నీలగిరి, అక్టోబర్ 8: నల్లగొండ జిల్లా వ్యవసాయశాఖలో యూరియా సరఫరాలో అక్రమాలకు పాల్పడిన వారిపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. వారం క్రితమే సూపరింటెండెంట్‌ను సస్పెండ్ చేయగా, తాజాగా మరో ముగ్గురు అధికారులను సస్పెండ్ చేస్తూ శనివారం రాత్రి ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది.
నల్లగొండ జిల్లాలోని పలు మండలాల్లో ఆగస్టులో సరిపడా యూరియా సరఫరా చేసినా కొరత ఏర్పడింది. దీంతో కలెక్టర్ ఆర్వీ కర్ణన్, డీఏవో శ్రవణ్‌కుమార్‌తో కలిసి సెప్టెంబర్ 7న సొసైటీలు, డీలర్ల్లు, వ్యాపారుల వద్ద నిల్వలను పరిశీలించగా 2వేల మెట్రిక్ టన్నుల యూరియా ఉన్నట్టు వెల్లడైంది. బాధ్యులైన దేవరకొండ ఏడీఏ వీరప్ప, టెక్నికల్ ఏవో గిరిప్రసాద్, సీనియర్ అసిస్టెంట్ రవికుమార్‌ను సస్పెండ్ చేశారు. గత వారం సూపరింటెండెంట్ ఎం శ్రవణ్‌కుమార్ సస్పెండ్ అయ్యారు. మరో ఐదుగురు క్షేత్రస్థాయి ఉద్యోగులపైనా వేటు పడే అవకాశం ఉన్నట్టు సమాచారం.