హైదరాబాద్, అక్టోబర్ 27 (నమస్తే తెలంగాణ) : ఏక్ పోలీస్ విధానం అమలు కోసం ఆందోళన చేస్తున్న బెటాలియన్ కానిస్టేబుళ్లపై తెలంగాణ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతున్నది. కుటుంబసభ్యులతో కలసి ఆందోళన నిర్వహించిన నేపథ్యంలో శనివారం 39 మంది కానిస్టేబుళ్లపై పోలీస్ శాఖ క్రమశిక్షణ చర్యలు చేపట్టింది. ఆదివారం సెలవురోజు అయినప్పటికీ తమ సహోద్యోగులపై పెట్టిన సస్పెన్షన్ వేటును ఎత్తివేయాలని ఆయా బెటాలియన్ల పరిధిలోని కానిస్టేబుళ్లు మరోసారి ఆందోళన నిర్వహించారు. సోమవారం సచివాలయ ముట్టడికి కూడా పిలుపునిచ్చారు. బెటాలియన్ కానిస్టేబుళ్లను మరింత భయబ్రాంతులకు గురిచేసేలా ఆదివారం రాత్రి 10 మంది కానిస్టేబుళ్లను సర్వీస్ నుంచి తొలగి స్తూ పోలీసు శాఖ ఉత్తర్వులు వెలువరించిం ది. ఆర్టికల్ 311(2)(b) ప్రకారం చర్యలు తీసుకున్నట్టు పేర్కొంది. టీజీఎస్పీ ప్రతిష్ఠను దెబ్బ తీసేలా వీధుల్లో ఆందోళనలు చేపట్టడం వల్లే డిస్మిస్ చేస్తున్నట్టు ప్రకటించింది.
‘మేము పోలీసులమా? కూలీలమా? మాకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించడమే నేరమా? పోలీసులమని ఉద్యోగంలో చేరితే వెట్టి చాకిరీ పనులు చేయడం ఎంత వరకు సమంజసం. ఏక్ పోలీస్ విధానం అమలు చేయాలని కోరితే సస్పెండ్ చేయడం సరికాదు’ అంటూ బెటాలియన్ కానిస్టేబుళ్లు ఆదివారం గొంతెత్తారు. రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ఆందోళనలో భాగంగా 39 మందిని సస్పెండ్ చేశారని, వారందరినీ తిరిగి విధుల్లో చేర్చుకోవాలని డిమాండ్ చేస్తూ ఆదివారం నిరసన తెలిపారు. లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా 9,900 మంది బెటాలియన్ పోలీసులం స్వచ్ఛందం గా రాజీనామా చేస్తామని స్పష్టం చేశారు. సిరిసిల్లలోని 17వ బెటాలియన్ పోలీసులు ఆదివారం రాత్రి కొవ్వొత్తులతో ప్రదర్శన నిర్వహించారు. అంతకుముందు తమ బెటాలియన్లో ఆరుగురిని సస్పెండ్ చేయడాన్ని నిరసి స్తూ వంద మందికిపైగా పోలీసు సిబ్బంది బె టాలియన్ ఆవరణలోని కమాండెంట్ కార్యాలయాన్ని ముట్టడించారు. వరంగల్ జిల్లాలోని మామునూరు నాలుగవ బెటాలియన్ పోలీస్ కానిస్టేబుళ్లు బెటాలియన్ ప్రధాన ద్వారం వద్ద బైఠాయించారు. మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలంలోని గుడిపేటలోని 13వ పోలీస్ బెటాలియన్ ఎదుట కానిస్టేబుళ్లు నిరసన తెలిపారు. ఐదుగురు గుడిపేట బెటాలియన్ కానిస్టేబుళ్లపై సస్పెన్షన్ ఎత్తివేయాలని ఆందోళనకు దిగారు. కొత్తగూడెంలోని చాతకొండ బెటాలియన్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి, రాత్రి బెటాలియన్ ఆవరణలో కొవ్వొత్తులతో నిరసన ప్రదర్శన చేపట్టారు. నల్లగొండ శివారులోని అన్నెపర్తి 12వ బెటాలియన్లో ఆదివారం కానిస్టేబు ల్ కుటుంబసభ్యులు ఇంటిల్లిపాది రోడ్డెక్కి నిరసన తెలిపారు.