హైదరాబాద్, ఫిబ్రవరి 26 (నమస్తే తెలంగాణ): తెలంగాణ మీడియా అక్రెడిటేషన్ విధానంపై సమగ్ర వివరాలు అందజేయాలని కోరుతూ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది. ప్రభుత్వ ప్రధానకార్యదర్శి, జీఏడీ ముఖ్యకార్యదర్శి, సమాచారశాఖ కమిషనర్, మీడియా అకాడమి చైర్మన్‌కు తాఖీదులు జారీచేస్తూ తదుపరి విచారణను ఏప్రిల్ 8కి వాయిదా వేసింది. అక్రెడిటేషన్ అర్హతల నిబంధనలపై రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన జీవోను సవాలు చేస్తూ హైటెక్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్, తెలంగాణ ఉర్దూ వరింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్, క్రియేటివ్ ఇండియా బ్రాడ్‌కాస్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ వేర్వేరుగా పిటిషన్లు దాఖలుచేశాయి.
వీటిపై చీఫ్‌జస్టిస్ అపరేశ్‌కుమార్‌సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్ ధర్మాసనం గురువారం మరోసారి విచారణ జరిపింది. కేబుల్ చానళ్లు, డిజిటల్ మీడియాకు అక్రెడిటేషన్ల జారీకి నిర్ణయించిన అర్హతలు తీవ్రం నష్టం చేకూరేలా ఉన్నాయని, ఇవి రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించాలని పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదించారు. జీ వో అమలును నిలిపివేస్తూ స్టే ఇవ్వాలని కోరారు.
అక్రెడిటేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకునే గడువు ఈనెల 28తో ముగియనున్నందున జీవో అమలును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. ప్రభుత్వ న్యాయవాది స్పందిస్తూ.. ప్రస్తుతమున్న అక్రెడిటేషన్ కార్డుల చెల్లుబాటు గడువును ప్రభుత్వం మరో రెండు నెలలు పొడిగించిందని చెప్పారు. కౌంటర్ దాఖలుకు గడువు కావాలని కోరారు. కోర్టు నా లుగు వారాలు గడువు మంజూరు చేసింది. ఆ తర్వాత రెండు వారాల్లోగా పిటిషనర్లు కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది.