హైదరాబాద్, జనవరి 23(నమస్తే తెలంగాణ): పాత అసెంబ్లీ భవనంతోపాటు జూబ్లీహాలును పునరుద్ధరించే ఏర్పాట్లను ప్రభుత్వం ముమ్మరం చేసింది. నాంపల్లి పబ్లిక్‌గార్డెన్స్ నుంచి లలితకళాతోరణం వరకు సుందరీకరించి అసెంబ్లీ ప్రాంగణాన్ని ఉత్తమ పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ పనుల కోసం రూ.50 కోట్లు ఖర్చవుతుందని అంచనాలు రూపొందించిన ఆర్అండ్బీ శాఖ ఇప్పటికే ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందజేసింది. ఒకటి రెండు రోజుల్లోనే నిధులు విడుదల అయ్యే అవకాశం ఉన్నదని అధికారులు భావిస్తున్నారు. పాత అసెంబ్లీ భవనంతోపాటు జూబ్లీహాలు వాసరత్వ కట్టడాలు కావడంతో వాటిని వినియోగంలోకి తేవాలంటే వాటిని చెక్కుచెదరకుండా పరిరక్షించడంతోపాటు పునరుద్ధరించాల్సిన అవసరం ఉన్నది.
ఈ నేపథ్యంలో వారసత్వ కట్టడాల పరిక్షణలో అనుభవం ఉన్న లండన్‌కు చెందిన నిపుణులను ప్రభుత్వం రప్పించింది. ఈ బృందం సోమవారం అసెంబ్లీ ప్రాంగణంలోని పాత అసెంబ్లీ భవనం, జూబ్లీహాలుతోపాటు పబ్లిక్‌గార్డెన్స్‌లో చేపట్టాల్సిన సుందరీకరణ పనులకు సంబంధించిన వివిధ నమూనాలను పరిశీలించింది. ప్రస్తుతం వాసరత్వ భవనంగా ఉన్న పాత అసెంబ్లీ భవనాన్ని పునరుద్ధరించి అందులో శాసనమండలి కార్యకలాపాలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం మండలి కొనసాగుతున్న భవనాన్ని సెంట్రల్హాలుగా వినియోగించాలని, ప్రస్తుతం ఉన్న సీఎల్పీ, ఇతర ఫ్లోర్‌లీడర్ల కార్యాలయాలను తొలగించి ప్రాంగణంలో చివర నిర్మించాలని నిర్ణయించారు. కొత్త భవనాల నిర్మాణం పూర్తయ్యేవరకు వాటిని అసెంబ్లీలోని పై అంతస్తులో సర్దుబాటు చేయనున్నారు.
వాస్తవానికి ఫిబ్రవరిలో శాసనసభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యేలోగా ఈ పనులన్నీ పూర్తిచేయాలని ప్రభుత్వం భావించినప్పటికీ అది సాధ్యమయ్యే అవకాశం కనిపించడం లేదు. ఇప్పటివరకు పనులకు సంబంధించిన టెండర్ల ప్రక్రియ ప్రారంభంకాలేదు. కాబట్టి ఈసారికి ప్రస్తుతం కొనసాగుతున్న భవనాల్లోనే శాసనసభ, శాసనమండలి సమావేశాలు నిర్వహించనున్నారు.