పెద్దపల్లి, ఆగస్టు 30(నమస్తే తెలంగాణ)/కొత్తగూడెం సింగరేణి: సింగరేణిలో కారుణ్య నియామకాలకు కాంగ్రెస్ ప్రభుత్వం క్రమంగా మంగళం పాడుతున్నది. ఎన్నికల ముందు ‘కార్మికులను కడుపులో పెట్టుకొని చూసుకుంటాం.. బీఆర్ఎస్ ప్రభుత్వం నెలకు రెండు మెడికల్ బోర్డులు నిర్వహిస్తున్నది.. మేం అధికారంలోకి వస్తే నెలకు మూడు, నాలుగు మెడికల్ బోర్డులను నిర్వహిస్తాం.. బోర్డుకు వచ్చిన ప్రతి సింగరేణి కార్మికుడి కొడుక్కు, కూతురుకు ఉద్యోగాలు ఇస్తాం’ అని ఇచ్చిన హామీలు మోస పూరితమేనని తేలిపోయింది.
జూలైలో జరిగిన మెడికల్ బోర్డుకు 120 మందిని పిలిచి 24 మందిని మాత్రమే అన్‌ఫిట్ చేయగా.. తాజాగా గురువారం జరిగిన మెడికల్ బోర్డుకు 120 మందిని పిలిచి కేవలం 12 మందిని మాత్రమే మెడికల్ అన్ ఫిట్ చేసి తన మోసాన్ని బయటపెట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా పది జిల్లాల్లో విస్తరించి ఉన్న సింగరేణి సంస్థలో పనిచేస్తున్న దాదాపుగా 40 వేల మంది కార్మికుల కుటుంబాలను కాంగ్రెస్ సర్కార్ ఆగం చేస్తున్నది. తన రాజకీయ గురువు, ఏపీ సీఎం చంద్రబాబు చూపిన మార్గంలోనే నడుస్తూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తమ హక్కులను కాలరాస్తున్నారని కార్మికులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ దాదాపుగా 16,500 మందికి వారసత్వ ఉద్యోగాలు ఇవ్వగా.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మెడికల్ బోర్డులను సక్రమంగా నిర్వహించకపోగా.. రిక్రూట్‌మెంట్‌ను సైతం సక్రమంగా చేపట్టకుండా నిర్లక్ష్యం చేసింది. దీంతో తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుండగా.. కార్మికులు, కార్మిక సంఘాలు ఐక్య పోరాటాలకు సిద్ధమయ్యారు. ఆందోళనలు, సమ్మె నోటీసులతో దిగి వచ్చిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క జూన్‌లో మెడికల్ బోర్డు నిర్వహిస్తామని కార్మికుల్లో ఆశలు రేకెత్తించారు. ఎట్టకేలకు దిగివచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం జూలై 17, 18వ తేదీల్లో కొత్తగూడెంలోని సింగరేణి ప్రధాన దవాఖానలో 124 మంది కార్మికులను మెడికల్ బోర్డుకు పిలిచారు.
ఇందులో 24 మంది కార్మికులు సరైన సమాచారం లేక, ఇతర కారణాలతో గైర్హాజరు కాగా పరీక్షలకు హాజరైన 100 మందిలో కేవలం 24 మందిని మాత్రమే మెడికల్ అన్ ఫిట్ చేశారు. 38 మందిని తిరిగి విధుల్లో చేరాలని, మిగతా వారంతా విధుల్లో కొనసాగాలని ఆదేశించారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 75 నుంచి 85 శాతం వరకు మెడికల్ ఇన్వాలిడేషన్ జరుగగా.. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కేవలం 25 శాతం మాత్రమే జరుగడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఇదిలావుండగా తాజాగా, ఈ నెల 27న జరిగిన మెడికల్ బోర్డుకు 120 మందిని పిలువగా.. ఇందులో 71 మంది మాత్రమే హాజరయ్యారు. 43 మంది కార్మికులను ఫిట్ ఫర్ సేమ్ జాబ్‌కు ఎంపిక చేయగా.. 14 మందిని సర్ఫేస్కు కేటాయించారు. ముగ్గురు కార్మికులను హయ్యర్ సెంటర్‌కు రిఫర్ చేశారు. ఇందులో 48 మంది కార్మికులు మెడికల్ బోర్డుకు గైర్హాజరయ్యారు. కేవలం 12 మంది కార్మికులను మాత్రమే మెడికల్ అన్‌ఫిట్ చేశారు. దీంతో సింగరేణి వ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. కార్మికులు, కార్మిక సంఘాలు ఉద్యమానికి సిద్ధమవుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మెడికల్ బోర్డులు కేవలం మొక్కుబడిగా మాత్రమే నిర్వహిస్తున్నారని, ఈ రెండు బోర్డులతో రుజువవుతున్నది.
బోర్డు పిలుపు కోసం 2,500 మంది ఎదురుచూపు
సింగరేణి వ్యాప్తంగా దాదాపుగా 2,500 మంది వరకు మెడికల్ ఇన్వాలిడేషన్ కోసం ఎదురు చూస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 10 నుంచి 12 మెడికల్ బోర్డులు పెట్టిన తరువాత బోర్డుకు వచ్చిన ప్రతి ఒక్కరినీ ఇన్వాలిడేషన్ చేసి ఉద్యోగావకాశాలు కల్పిస్తామని చెప్పిన ప్రభుత్వం ఆ ప్రక్రియకు మంగళం పాడింది. రెండేండ్లలోపు సర్వీసు ఉన్న వారికి ఉపశమనం కలిగిస్తున్నదనుకుంటే.. ఆ ఆశలను తాజా బోర్డు మీటింగ్ అడియాశలు చేసింది.
2025 జూలై, నవంబర్‌లో జరిగిన మెడికల్ బోర్డుల్లో ఇలాంటి వారిని పిలిచినా అన్ ఫిట్ చేయకుండా సంవత్సరాల తరబడి వారు తమ జీతాలను నష్టపోయేలా సింగరేణి యాజమాన్యం తీరని అన్యాయం చేసింది. కాళ్లు, చేతులు లేని వారు, పక్షవాతం వచ్చిన వారు, కిడ్నీ, కండ్లు, ఓపెన్ హార్ట్ సర్జరీ అయిన వారికి కూడా ఫిట్ ఫర్ సేమ్ డ్యూటీ ఇచ్చారు. ఇలాంటి నిర్ణయాలపై కార్మికుల్లో ఆగ్రహం వ్యక్తమవుతున్నది.
మోసం చేయడమే కాంగ్రెస్ నైజం
సింగరేణి కార్మికులను కాంగ్రెస్ ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం నిరంతరం మోసం చేస్తూనే ఉన్నాయి. మెడికల్ బోర్డుకు పిలువడం కూడా పెద్ద మోసమే. పిలిచినట్టు చేసి కేవలం పది శాతం, ఇరువై శాతం మందిని మాత్రమే మెడికల్ ఇన్వాలిడేషన్ చేయడం సరికాదు. కాంగ్రెస్ ప్రభుత్వం, సింగరేణి యాజమాన్య మోసాన్ని గుర్తించి 120 మంది కార్మికులు కోర్టులను ఆశ్రయించారు. ఇందులో ఐదుగురిని అన్‌ఫిట్ చేసి ఉద్యోగం ఇవ్వాలని, మానవీయ కోణంలో చూడాలని కోర్టు చెప్పినా.. ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.
బోర్డుకు వచ్చిన వారిలో 10 నెలలు ఉన్న వారే ఉండాల్సి ఉండగా.. కొందరు రెండేండ్లు, మూడేండ్లు ఉన్న వారిని సైతం బోర్డుకు పిలిచారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇందులో కొందరు ఇన్వాలిడేషన్ కూడా అయ్యారు. ఈ విషయంలో బోర్డు తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇది పారదర్శకంగా జరుగడం లేదు. వీరు ఎలా ఎవరి ప్రోద్బలంతో బోర్డుకు వచ్చి ఇన్వాలిడేషన్ అయ్యారో యాజమాన్యం వివరణ ఇవ్వాలి.
– మిర్యాల రాజిరెడ్డి, టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు