మేడ్చల్, సెప్టెంబర్ 16 : తాను అధికారిని అని, డబ్బులు ఇవ్వకపోతే చర్యలు తీసుకుంటామని వసూళ్లకు పాల్పడుతున్న వ్యక్తిని స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన బుధవారం మేడ్చల్ పీఎస్ పరిధిలోని డబిల్పూర్లో జరిగింది. డబిల్పూర్ గ్రామంలో బుధవారం ఉదయం ప్రవేశించిన ఒక వ్యక్తి దుకాణాలు, హోటళ్లకు వెళ్లి తాను చైల్డ్ లేబర్ ఆఫీసర్ అని చెప్పుకొంటూ డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఇలా పలు దుకాణాల్లో వసూళ్లకు పాల్పడ్డాడు. అయితే స్థానిక యువకులు అతడి వ్యవహారంపై అనుమానం రావడంతో పట్టుకొని నిలదీశారు. ఐడీ కార్డు చూపించాలని అడిగారు. అతడి వద్ద ఉన్న కార్డు నమ్మశక్యంగా లేకపోవడంతో పోలీసులకు పట్టించారు. అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడిని నకిలీ అధికారిగా తేల్చారు. ఎక్కడెక్కడ వసూళ్లకు పాల్పడింది తదితర విషయాలపై విచారణ జరుపుతున్నారు.