హైదరాబాద్, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ): సచివాలయంలో సుదీర్ఘంగా డిప్యూటేషన్‌పై కొనసాగుతున్న అధికారులపై ప్రభుత్వం దృష్టి పెట్టినట్టు తెలిసింది. మంత్రులు, ఉన్నతాధికారుల దగ్గర పీఎస్లుగా, పీఏలుగా, వివిధ విభాగాల్లో సెక్షన్ ఆఫీసర్లుగా, ఇతర హోదాల్లో కొనసాగుతున్న వారి జాబితాను సిద్ధం చేసినట్టు సచివాలయవర్గాలు తెలిపాయి. కొందరిపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయని, మరికొందరిపై సహోద్యోగులే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారని విశ్వసనీయవర్గాలు తెలిపాయి.
ముఖ్యంగా సచివాలయంలోని ఓ ఉన్నతాధికారి దగ్గరున్న పీఎస్ తీరుపై సీఎంవో వరకు ఫిర్యాదులు వెళ్లినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. తమకు కనీస మర్యాద ఇవ్వడం లేదని, ప్రతి చిన్న విషయానికి కసురుకుంటున్నారని సహచర ఉద్యోగులు, సిబ్బంది ఫిర్యాదు చేసినట్టు తెలిసింది.
దీంతో ఇతర శాఖల నుంచి సచివాలయంలోకి డిప్యూటేషన్‌పై వచ్చి, ఇక్కడే తిష్టవేసిన అధికారుల జాబితాను తయారు చేయాలని సీఎంవో ఆదేశించినట్టు సమాచారం. ఈ వివరాలు జీఏడీకి చేరాయని తెలిసింది. ఫైల్‌కు సీఎం రేవంత్‌రెడ్డి ఆమోదం తెలిపితే డిప్యూటేషన్లను రద్దు చేసి వారిని మాతృవిభాగాలకు పంపనున్నట్టు సచివాలయవర్గాల్లో చర్చ జరుగుతున్నది.