ఇందల్వాయి, జూన్ 9 : వేములవాడ రాజన్న ఆలయానికి సంబంధించి కోడెలు మృతిచెందుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. సోమవారం ఆమె నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండల కేంద్రంలో శ్రీ సీతారామ చంద్రస్వామి ఆలయాన్ని సందర్శించారు. గతంలో ఎమ్మెల్సీ సొంతంగా ఆలయ ప్రహరీ నిర్మాణం కోసం రూ. 5 లక్షల నిధులు అందజేశారు. పనులు పూర్తి కావడంతో ప్రహరీ వద్ద శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కాంగ్రెస్ నాయకులు మాయమాటలు చెప్పి ప్రజలను మభ్యపెడుతున్నారని మండిపడ్డారు.
హైదరాబాద్, జూన్ 9(నమస్తే తెలంగాణ):సింగరేణిలో మారు పేర్ల (అలియాస్ నేమ్స్)తో కార్మికులుగా పని చేసి డిపెండెంట్ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న బాధితులను ఆదుకోవాలని ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. సోమవారం హైదరాబాద్లోని తన నివాసంలో సింగరేణి జాగృతి నాయకులు, అలియాస్ నేమ్స్ డిపెండెంట్ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న బాధితులతో ఆమె సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ, సంస్థలో 30 ఏళ్లకు పైగా సేవచేసిన కార్మికుల వారసులకు ఉద్యోగాలు ఇవ్వకుండా వేధింపులకు గురి చేయడం అన్యాయమని మండిపడ్డారు. అలియాస్ నేమ్స్ డిపెండెంట్ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారిని విజిలెన్స్ విభాగం ఉద్దేశపూర్వకంగా ఇబ్బంది పెడుతున్నదని విమర్శించారు. అనంతరం సింగరేణి జాగృతి నాయకులు సంస్థ జనరల్ మేనేజర్(కోఆర్డినేషన్) సుభానిని కలిసి వినతిపత్రం అందజేశారు.