హైదరాబాద్, ఆగస్టు 20 (నమస్తే తెలంగాణ): డీఎస్సీ పరీక్షల్లో ఒకరోజు వచ్చిన ప్రశ్నలు మరోరోజు రావడం.. ఇలా 19 ప్రశ్నలు పునరావృతం కావడంపై సర్కారు ఆరా తీసింది. ఈ అంశంపై ‘నమస్తే తెలంగాణ’లో మంగళవారం ‘డీఎస్సీ పేపర్ లీక్’ అన్న శీర్షికన ప్రత్యేక కథనం ప్రచురితమైంది. దీనిపై ప్రభుత్వ పెద్దలు సహా విద్యాశాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం ఆరా తీశారు. ప్రశ్నలు పునరావృతం కావడంపై పాఠశాల విద్యాశాఖ పరిశీలిస్తున్నది. ఈ తప్పిదం ఎలా జరిగింది అని, ఇందుకు బాధ్యులెవరు? అన్న కోణంలో విచారణ జరుపుతున్నది.
ఈ విచారణ అనంతరం బాధ్యులైన వారిపై చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలిసింది. అయితే పేపర్ లీక్ వార్తలపై పాఠశాల విద్యాశాఖ ఒక ప్రకటనలో వివరణ ఇచ్చింది. విద్యాశాఖ విడుదల చేసిన డీఎస్సీ ప్రాథమిక ‘కీ’పై భారీగా అభ్యంతరాలు రావడం గమనార్హం. ప్రాథమిక ‘కీ’ని సవాల్ చేస్తూ అనేక మంది అభ్యంతరాలను సమర్పించారు. దాదాపు 28,500 అభ్యంతరాలు వచ్చినట్టు విద్యాశాఖ వర్గాలు వెల్లడించాయి. జూలై 18 నుంచి ఆగస్టు 13 వరకు ని ర్వహించిన డీఎస్సీ పరీక్షల ప్రాథమిక కీలను ఈ నెల 13న విద్యాశాఖ విడుదల చేసింది. దీనిపై అభ్యంతరాలు తెలిపేందుకు ఈ నెల 20 వరకు గడువును ఇచ్చారు. ఈ గడువు మంగళవారం సాయంత్రంతో ముగిసింది. ఈ నెలాఖరులో ఫైనల్కీని విడుదల చేసే అవకాశం ఉన్నది.
డీఎస్సీ పరీక్షను ఆన్లైన్లో నిర్వహించామని, ఎక్కడా పేపర్ లీక్ అనే ప్రశ్నే ఉత్పన్నంకాదని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఈవీ నర్సింహారెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎస్జీటీ పరీక్షలో 160 ప్రశ్నలు ఉండగా ఒక్కో ప్రశ్నపత్రంలో 8 వేర్వేరు విభాగాలు ఉంటాయని, మొత్తం 7 సెషన్లకు 14 సెట్ల ప్రశ్నపత్రాలను తయారు చేశామని తెలిపారు. జూలై 19న మొదటి సెషన్ ప్రశ్నపత్రంలోని సోషల్ స్టడీస్ సబ్జెక్టుకు సంబంధించిన 18 ప్రశ్నలు.. 23న రెండో సెషన్లోనూ పునరావృతమయ్యాయని అంగీకరించారు. 19న ఆరు జిల్లాలు, 23న మరో 6 జిల్లాల వారికి పరీక్షలు నిర్వహించామని, ఒక సెషన్లో ఒక జిల్లా వారికి మాత్రమే పరీక్షలను నిర్వహించడం వల్ల, ఇది ఏ విధంగానూ అభ్యర్థుల ర్యాంకులను, ఫలితాలను ప్రభావితం చేయదని తెలిపారు. దీనిపై అభ్యర్థులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన కోరారు.