ధర్మారం/రామడుగు, జనవరి 10: కాళేశ్వరం ప్రాజెక్టు లింక్-2లో మూడు రోజుల క్రితం ప్రారంభమైన గోదావరి జలాల ఎత్తిపోతలు శనివారం నిలిపివేశారు. గ్రావిటీ కాలువ, వరదకాలువ పరీవాహక గ్రామాల రైతులకు సాగునీటిని అందించేందుకు ఈ నెల 8 నుంచి పెద్దపల్లి జిల్లా ఎల్లంపల్లి బరాజ్‌లోని నీటిని నంది, గాయత్రీ పంప్‌హౌస్‌ల ద్వారా ఎస్సారెస్పీ వరద కాలువలోకి ఎత్తిపోస్తున్నారు.
శనివారం ధర్మారం మండలం నందిమేడారంలోని నంది పంప్‌హౌస్‌లో ఐదో మోటర్‌ను ఆన్ చేసి 3150 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోయగా, డెలివరీ సిస్టర్న్ నుంచి ఎగిసిపడ్డ జలాలు జంట సొరంగాల ద్వారా కరీంనగర్ జిల్లా లక్ష్మీపూర్‌లోని గాయత్రీ పంప్‌హౌస్‌కు చేరుతున్నాయి. ఇక్కడ శనివారం ఏడో నంబర్ మోటర్ ద్వారా ఎత్తిపోతలు కొనసాగించారు. శ్రీరాములపల్లి వద్ద వరద కాలువలో 88 కిలోమీటర్ పాయింట్ వద్ద ఎత్తిపోసినట్టు ప్రాజెక్టు అధికారులు తెలిపారు. మూడు రోజులుగా సుమారు 0.6 టీఎంసీల నీటిని వరదకాలువ ఎగువకు తరలించినట్టు పేర్కొన్నారు.
మెట్పల్లి రూరల్, జనవరి 10: దిగువన నంది, గాయత్రీ పంప్‌హౌస్‌ల ద్వారా ఎత్తిపోతలతో గోదావరి జలాలు వరద కాలువలో పరుగులు తీస్తున్నాయి. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం రాజేశ్వర్రావుపేట (వరద కాలువ 34 కిలోమీటర్) వద్ద నిర్మించిన పంప్‌హౌస్‌కు జలాలు చేరగా, ఇక్కడ శనివారం ఉదయం 6 గంటలకు ఎత్తిపోతలు మొదలయ్యాయి. రెండు మోటర్లు ఆన్ చేసి 1,450 క్యూసెక్కుల చొప్పున ఎత్తిపోశారు. సాయంత్రం ఐదు గంటలకు ఎత్తిపోతలు నిలిపివేశామని, 0.153 టీఎంసీల నీటిని వరద కాలువ 34 కిలోమీటర్ నుంచి ఎగువన 17వ కిలోమీటర్ పాయింట్ వరకు తరలించినట్టు డీఈ రూప్లానాయక్ పేర్కొన్నారు.