ములుగు, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ): జనన ధ్రువీకరణ పత్రం లేక చిన్నారి గుండె ఆపరేషన్ ఆగిపోవడంతో ‘బర్త్ సర్టిఫికెట్ లేక ఆగిన గుండె ఆపరేషన్, ఇబ్బందుల్లో పసి ప్రాణం’ అనే కథనం ‘నమస్తేతెలంగాణ’ దినపత్రికలో ఈ నెల 6న ప్రచురితమైంది. దీనికి పంచాయతీ అధికారులు స్పందించారు. శనివారం వినాయక చవితి సెలవు రోజు అయినప్పటికీ పంచాయతీ కార్యదర్శి రఘు.. చిన్నారి తండ్రి సురేశ్‌కు బర్త్ సర్టిఫికెట్ అందజేశారు.
ఈ సందర్బంగా ఎంపీవో రహీమొద్దీన్ మాట్లాడుతూ.. ఇటీవల ములుగు మండలంలోని గ్రామ పంచాయతీ కార్యాలయాల ఆన్లైన్ పాస్వర్డ్లు మార్చుతున్న క్రమంలో సాంకేతిక కారణాల వల్ల ములుగు జీపీకి చెందిన యూజర్ ఐడీ, పాస్వర్డ్లు పనిచేయకుండా పోయినట్టు తెలిపారు. ప్రస్తుతానికి ఆఫ్‌లైన్‌లో ఇచ్చామని త్వరలో సాంకేతిక సమస్యను పరిష్కరించి ఆన్లైన్లో బర్త్ సర్టిఫికెట్ అందజేస్తామని పేర్కొన్నారు.