హైదరాబాద్, జనవరి 17 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల రిజర్వేషన్ ప్రక్రియ ముగిసింది. వీటిలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ స్థానం మళ్లీ మహిళకే దక్కనున్నది. నల్లగొండ, నిజామాబాద్, ఖమ్మం కార్పొరేషన్ మేయర్ స్థానాలూ అతివలకే దక్కనున్నాయి. రాష్ట్రంలోని 10 మున్సిపల్ కార్పొరేషన్ల మేయర్ పదవులు, 121 మున్సిపాలిటీల చైర్పర్సన్ పదవుల రిజర్వేషన్లను రాష్ట్ర మున్సిపల్ శాఖ అధికారికంగా శనివారం ఖరారు చేసింది. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు యూనిట్‌గా తీసుకొని డివిజన్లు, వార్డుల రిజర్వేషన్లను ఆయా జిల్లాల కలెక్టర్లు ఖరారు చేశారు. మొత్తం పదవుల్లో 50 శాతం మహిళలకే కేటాయించారు.
ఈ మేరకు రిజర్వేషన్ల తుది జాబితాలను ప్రభుత్వానికి శనివారమే అందజేసినట్టు ఆ శాఖ కార్యదర్శి టీకే శ్రీదేవి వెల్లడించారు. హైదరాబాద్‌లోని డీసీఎంఏ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ రిజర్వేషన్ల వివరాలను వెల్లడించారు. తెలంగాణలో 2011 జనాభా ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు, 2024లో నిర్వహించిన సీపెక్ సర్వే ప్రాతిపదికన డెడికేషన్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా బీసీలకు రిజర్వేషన్లను ఖ రారు చేసినట్టు చెప్పారు. మున్సిపల్ యాక్ట్-2019 ప్రకారం మొత్తం సీట్లలో మహిళలకు 50 రిజర్వేషన్లు కేటాయించినట్టు తెలిపారు. పార్టీల ప్రతినిధుల సమక్షంలోనే మొదట ఎస్టీ, ఎస్సీ రిజర్వేషన్లు ఖరారు చేశామని, లాటరీ ద్వారా 50 శాతం మహిళలకు రిజర్వేషన్లు కల్పించామని చెప్పారు. కాగా, రాష్ట్ర ఎన్నికల సంఘం వచ్చేవారంలో ఎప్పుడైనా మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్‌ను జారీచేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది.
ఈ స్థానాలకు ఇప్పుట్లో ఎన్నికల్లేవు!
రాష్ట్రంలో మొత్తం 10 కార్పొరేషన్ల రిజర్వేషన్లను మున్సిపల్ అధికారులు ఖరారు చేసి నా, వీటిలో జీహెచ్ఎంసీ, వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ల పాలకవర్గాలకు ఇంకా గడువు ఉన్నది. ఇవి మినహా ఏడు కార్పొరేషన్లు అయిన భద్రాద్రి కొత్తగూడెం, రామగుండం, మహబూబ్‌నగర్, మంచిర్యాల, కరీంనగర్, నిజామాబాద్‌తోపాటు కొత్తగా ఏర్పడిన నల్లగొండ కార్పొరేషన్‌కు ఎన్నికలు నిర్వహించనున్నారు. రాష్ట్రంలోని 121 మున్సిపాలిటీల రిజర్వేషన్లు ఖరారు చేసినప్పటికీ 116 మున్సిపాలిటీలకే ఇప్పుడు ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉన్నది. సిద్దిపేట, కొత్తూరు, నకిరేకల్, జడ్చర్ల, అచ్చంపేట మున్సిపాలిటీ పాలకవర్గాలకు ఇంకా సమయం ఉన్నందున రెండో దఫాలో వీటికి ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉన్నది.
21న మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్?
ఆదివారం రాష్ట్ర క్యాబినెట్ సమావేశం జరుగనున్నది. రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తయినందున, పోలీస్, ఇతర శాఖల అభిప్రాయాలను క్యాబినెట్ సమావేశంలో పరిగణనలోకి తీసుకొంటారు. ఆ తర్వాత పురపోరుపై చర్చించి ఎన్నికలపై క్యాబినెట్ తుది నిర్ణయం ప్రకటించే అవకాశం ఉన్నది. ఫిబ్రవరి 20లోగా ఎన్నికల ప్రక్రియను ముగించాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఈ నెల 19 నుంచి 23 వరకు సీఎం రేవంత్ దావోస్ పర్యాటనకు వెళ్లనున్నారు. 20 లేదా 21న షెడ్యూల్ ప్రకటించాలని, ఆ తర్వా త 3-4 రోజల్లో నోటిఫికేషన్ ఇవ్వాలని ఎస్ఈసీ భావిస్తున్నట్టు తెలిసింది. విదేశీ పర్యటన ముగిసిన వెంటనే సీఎం రేవంత్ జిల్లాల పర్యటనలు ఉన్నందున అవి మున్సిపల్ ఎన్నికల ప్రచార సభలుగా మారతాయని సమాచారం.
బీసీ రిజర్వేషన్లు 31.40 శాతమే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజరేషన్లు కల్పిస్తామన్న కాంగ్రెస్ సర్కార్.. ఆ హామీని విస్మరించి మరోసారి బీసీలను ధోకా చేసింది. పంచాయతీ ఎన్నికల్లో బీసీలను మోసం చేసినట్టుగానే పురపాలికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేకపోయింది. సుప్రీంకోర్టు తీర్పును సాకుగా చూపుతూ బీసీలకు కేవలం 30% రిజర్వేషన్లు కల్పించింది. మొత్తం 121 మున్సిపాలిటీలో కేవలం 38 చైర్పర్సన్ స్థానాలు (31.40%) బీసీలకు కేటాయించింది. ఇందు లో బీసీ మహిళలకు 19 చైర్పర్సన్ స్థానాలు దక్కాయి. మొత్తం 5,929 వార్డుల్లో కేవలం 1,815 వార్డులు అంటే 30.61 శాతమే కేటాయించింది. కామరెడ్డి బీసీ డిక్లరేషన్ ప్రకారం ఎక్కడ కూడా బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించకుండా కుచ్చుటోపీ పెట్టింది. ఎస్టీలకు 5 స్థానాలు (4.13 శాతం), ఎస్సీలకు 17 స్థానాలు (14.04 శాతం) కేటాయించింది. 121 మున్సిపాలిటీల్లో 61 చైర్పర్సన్ స్థానాలను, 3,025 వార్డులను అన్‌రిజర్వుడుగా (51.03)గా ప్రకటించింది.
మున్సిపల్ చైర్పర్సన్ రిజర్వేషన్లు ఇలా..
ఎస్టీ క్యాటగిరీ-5
కల్లూరు- (ఎస్టీ జనరల్), భూత్పూర్ -(ఎస్టీ జనరల్), మహబూబాబాద్-(ఎస్టీ జనరల్), కేసముద్రం -(ఎస్టీ మహిళ) ఎల్లంపేట్ (ఎస్టీ మహిళ)
ఎస్సీ క్యాటగిరీ -17
స్టేషన్‌ఘన్‌పూర్-ఎస్సీ (జనరల్), చొప్పదండి- ఎస్సీ (మహిళ), జమ్మికుంట-ఎస్సీ (జనరల్), హుజూరాబాద్- ఎస్సీ (మహిళ), ఎదులాపురం- ఎస్సీ (మహిళ), డోర్నకల్-ఎస్సీ (జనరల్), లక్ష్సెట్టిపేట-ఎస్సీ (జనరల్), మూడు చింతలపల్లి-ఎస్సీ (జనరల్), నందికొండ-ఎస్సీ (జనరల్), మోయినాబాద్-ఎస్సీ (జనరల్), గడ్డ పోతారం- ఎస్సీ మహిళ, కోహిర్- ఎస్సీ (జనరల్), ఇంద్రేశం- ఎస్సీ (మహిళ), చేర్యాల-ఎస్సీ (మహిళ), హుస్నాబాద్-ఎస్సీ (జనరల్), వికారాబాద్- ఎస్సీ (మహిళ), మోత్కూరు- ఎస్సీ (మహిళ).
బీసీ క్యాటగిరీ-38
ఇల్లందు- బీసీ (మహిళ), జగిత్యాల బీసీ (మహిళ), జనగామ బీసీ (జనరల్), భూపాలపల్లి బీసీ (జనరల్), అయిజ బీసీ (జనరల్), వడ్డేపల్లి బీసీ (జనరల్), అలంపూర్ బీసీ (జనరల్), బిచ్కుంద బీసీ (జనరల్), కామారెడ్డి బీసీ (మహిళ), బాన్సువాడ బీసీ (మహిళ), ఆసిఫాబాద్ బీసీ (జనరల్), కాగజ్‌నగర్ బీసీ (మహిళ), దేవరకద్ర బీసీ (మహిళ), చెన్నూరు బీసీ (మహిళ), మెదక్ బీసీ (మహిళ), ములుగు బీసీ (మహిళ), కొల్లాపూర్ బీసీ (మహిళ), అచ్చంపేట బీసీ (మహిళ), నాగర్‌కర్నూల్ బీసీ (జనరల్), దేవరకొండ బీసీ (మహిళ), మద్దూరు బీసీ (జనరల్), పెద్దపల్లి బీసీ (జనరల్), మంథని బీసీ (జనరల్), వేములవాడ బీసీ (జనరల్), షాద్‌నగర్ బీసీ (జనరల్), జిన్నారం బీసీ (జనరల్), జహీరాబాద్ బీసీ (జనరల్), గుమ్మడిదల బీసీ (జనరల్), సిద్దిపేట బీసీ (జనరల్), గజ్వేల్ బీసీ (మహిళ), దుబ్బాక బీసీ (మహిళ), హుజూర్నగర్ బీసీ (జనరల్), తాండూరు బీసీ (జనరల్), పరిగి బీసీ (మహిళ), కొత్తకోట బీసీ (మహిళ), ఆత్మకూర్ బీసీ (మహిళ), నర్సంపేట బీసీ (మహిళ), ఆలేరు బీసీ (మహిళ)
జనరల్ (అన్రిజర్వ్డ్) -30
పరకాల, రాయికల్, మెట్పల్లి, ఎల్లారెడ్డి, జడ్చర్ల, తొర్రూరు, చండూరు, నకిరేకల్, హాలియా, కోస్గి, మక్తల్, ఖానాపూర్, భైంసా, బోధన్, సుల్తానాబాద్, శంకర్పల్లి, చేవెళ్ల, ఇబ్రహీంపట్నం, ఆమన్‌గల్, కొత్తూరు, నారాయణఖేడ్, ఆందోల్-జోగిపేట, సూర్యాపేట, తిరుమలగిరి, నేరేడుచర్ల, కొడంగల్, అమరచింత, పెబ్బేరు, వర్ధన్నపేట, పోచంపల్లి
మహిళ (అన్రిజర్వ్డ్)-31
ఆదిలాబాద్, అశ్వారావుపేట, కోరుట్ల, ధర్మపురి, గద్వాల, సత్తుపల్లి, వైరా, మధిర, మరిపెడ, క్యాతన్‌పల్లి, బెల్లంపల్లి, రామాయంపేట, నర్సాపూర్, తూప్రాన్, అలియాబాద్, కల్వకుర్తి, మిర్యాలగూడ, చిట్యాల, నారాయణపేట, నిర్మల్, భీమ్‌గల్, ఆర్మూరు, సిరిసిల్ల, సదాశివపేట, సంగారెడ్డి, ఇస్నాపూర్, కోదాడ, వనపర్తి, యాదగిరిగుట్ట, భువనగిరి, చౌటుప్పల్.
కార్పొరేషన్ల మేయర్ రిజర్వేషన్లు ఇలా..
ఎస్టీ క్యాటగిరీ
1. కొత్తగూడెం ఎస్టీ (జనరల్)
ఎస్సీ క్యాటగిరీ
2. రామగుండం ఎస్సీ (జనరల్)
బీసీ క్యాటగిరీ
3.మహబూబ్‌నగర్ బీసీ (మహిళ)
4.మంచిర్యాల బీసీ (జనరల్)
5. కరీంనగర్ బీసీ (జనరల్)
జనరల్ క్యాటగిరీ
6. ఖమ్మం మహిళ (జనరల్)
7. నిజామాబాద్ మహిళ (జనరల్)
8.వరంగల్ అన్ రిజర్వ్డ్
9.హైదరాబాద్ మహిళ (జనరల్)
10. నల్లగొండ మహిళ (జనరల్)