హైదరాబాద్, జనవరి 25 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని విద్యుత్తు సంస్థల్లో ఇంజినీర్లు, ఉద్యోగుల సాధారణ బదిలీలకు ఈ నెల 20న మార్గదర్శకాలు, షెడ్యూల్ విడుదలయ్యాయి. వీటిని ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. బదిలీలపై యాజమాన్యం ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నదని మండిపడుతున్నారు. వచ్చే నెలలో ఇంటర్ వార్షిక పరీక్షలు, మార్చిలో పదో తరగతి పరీక్షలు జరుగనున్న తరుణంలో ఈ బదిలీలేమిటని, అర్ధాంతరంగా తాము ఎక్కడికి వెళ్లాలని ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ పవర్ ఎంప్లాయిస్ జేఏసీ, తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ జేఏసీ నేతలు ఈ నెల 24న భేటీ అయ్యారు.
యాజమాన్యం మొండి వైఖరిని నిరసిస్తూ మింట్ కంపౌండ్‌లో భారీ ధర్నాకు దిగాలని నిర్ణయించారు. ఇదే విషయంపై జేఏసీ నేతలు సాయిబాబు, రత్నాకర్‌రావు, తాజుద్దీన్ బాబా, భూపాల్‌రెడ్డి, పవన్, మహేశ్ తదితరులు ఆదివారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిశారు. బదిలీలపై పునరాలోచించాలని, ఉద్యోగులకు ఇబ్బంది కలగకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. మే, జూన్‌లో బదిలీలు చేపట్టాలని, ఆర్టిజన్ల కన్వర్షన్ సమస్యను పరిష్కరించాలని కోరారు. ఆ వినతులను పరిగణనలోకి తీసుకున్న భట్టి విక్రమార్క.. యాజమాన్యంతో మాట్లాడి వివాదాన్ని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.