మన్సూరాబాద్, జనవరి 26 : నకిలీ డాక్యుమెంట్లతో అటవీ భూమిని అంటగట్టిన ముఠా మోసం వెలుగులోకి వచ్చింది. మన్సూరాబాద్ సర్వే నంబర్-7లోని అటవీశాఖకు చెందిన భూమి పూర్వీకుల నుంచి తమకు సంక్రమించిదంటూ యూనిస్ఖాన్, ఆయన భార్య వాసం తులసమ్మ అలియాస్ సుల్తానా.. అడ్వకేట్ మహ్మద్ జిలానీతో కలిసి సుమారు 300 మందిని మోసం చేసి నకిలీ డాక్యుమెంట్లతో ప్లాట్లను విక్రయించారు. మోసకారుల మా టలు నమ్మిన బాధితులు అప్పులు చేసి ప్లాట్లు కొనుగోలు చేశారు. ఆ తర్వాత అటవీశాఖకు చెందిన భూమిని అంటగట్టారని తెలుసుకున్నారు. తమ వద్ద ప్లాట్లు కొనుగోలు చేసిన వారంతా రిపబ్లిక్ డే రోజున సదరు భూమి వద్దకు రావాలని, అక్కడ జెండా ఎగురవేసి ప్లాట్లను స్వాధీనం చేసుకుందామని మహ్మద్ జిలానీ ప్రచారం చేశాడు.
సుమారు 200 మంది ఆదివారం ఉదయం మన్సూరాబాద్ నుంచి ఆటోనగర్ డంపింగ్ యార్డుకు వెళ్లే మార్గంలోకి చేరుకున్నారు. విషయం తెలిసి అక్కడి చేరుకున్న వనస్థలిపురం ఏసీపీ కాశిరెడ్డి, హరిణ వనస్థలి నేషనల్ పార్కు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ సాయిప్రకాశ్ బాధితులతో మాట్లాడారు. సర్వే నంబర్-7లో 582 ఎకరాల భూమి అటవీశాఖ ఆధీనంలో ఉందని, సదరు భూమి లో ఎలాంటి కార్యకలాపాలు చేపట్టినా కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఒక్కొక్కరి నుంచి రూ.50 వేల నుంచి రూ.2 లక్షల వరకు తీసుకుని.. యూనిస్ఖాన్, సుల్తానా, మహ్మద్ జిలానీ అమ్మకాలు జరిపినట్టు బాధితులు వాపోయారు. సదరు భూమిలో జెండా ఎగురవేసేందుకు ప్రయత్నించగా ఎల్బీనగర్ అడిషనల్ డీసీపీ నేతృత్వంలో పోలీసులు వారిని అడ్డుకున్నారు. అదుపులోకి తీసుకుని ఎల్బీనగర్, వనస్థలిపు రం, హయత్నగర్, అబ్దుల్లాపూర్మెట్ పోలీస్స్టేషన్లకు తరలించారు.