రంగారెడ్డి, మే 26(నమస్తే తెలంగా ణ): రంగారెడ్డి జిల్లా తుర్కయాంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని కోహెడలో పండ్ల మార్కెట్ భూములు ప్రస్తుతం పోలీస్ పహారాలో ఉన్నాయి. పండ్ల మార్కె ట్ ఏర్పాటుకు కేటాయించిన భూమిని సోమవారం చదునుచేస్తుండగా, రైతులు అడ్డుకోవడంతో అధికారులు వెనుదిరిగారు. అధికారులు మళ్లీ ఏక్షణానైనా రావొచ్చనే ఉద్దేశంతో బాధిత రైతులు భూమి వద్దనే రాత్రి పడుకున్నారు. మంగళవారం తెల్లవారుజామున 5గంటల ప్రాంతంలో పెద్ద ఎత్తున పోలీసు బలగాలు అక్కడికి చేరుకొని రైతులు, మహిళలను అరెస్టుచేసి నాగోల్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. రైతులు ప్రతిఘటించినప్పటికీ, పోలీసులు బలవంతంగా రైతులను వ్యాన్‌లో ఎక్కించారు.
రైతులు ఉదయం నుంచి సాయంత్రం వరకు పోలీస్‌స్టేషన్‌లోనే ఉన్నారు. రైతులను పోలీస్‌స్టేషన్‌కు తరలించిన అనంతరం రెవెన్యూ, వ్యవసా య అధికారులతోపాటు పోలీసులు మో హరించి పండ్ల మార్కెట్‌కు కేటాయించిన భూమిని జేసీబీలతో చదును చేయించారు. కోహెడ గ్రామంలో సర్వే నంబర్ 167/1లో ప్రభుత్వం 179 ఎకరాలను బాటసింగారం పండ్ల మార్కెట్‌కు కేటాయించగా, ఆ భూమి తమదేనని గ్రామానికి చెందిన పలువురు రైతులు ఆందోళనకు దిగుతున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం తెల్లవారుజామున పెద్ద ఎత్తున పోలీస్ బలగాలు అక్కడికి చేరుకొన్నాయి.
రైతులను అరెస్టు చేయడమే కాకుండా, వివిధ ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీల నాయకులు భూముల వద్దకు రాకుండా కోహెడ రోడ్డుతోపాటు సర్వీసు రోడ్డులో బారికేడ్లను ఏర్పాటు చేశారు. పొలాల వద్దకు రైతులతోపాటు సర్వీసు రోడ్డులో వెళ్లేవారిని కూడా ఎక్కడికక్కడే నిలిపివేశారు. పండ్ల మార్కెట్ కోసం కేటాయించిన భూమిని అధికారులు చదును చేస్తుండటంతో ఆ పనులకు ఎలాంటి ఆటంకం కలుగకుండా పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మోహరించారు. రైతులను అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ పలువురు బీజేపీ నాయకులు పనులు అడ్డుకోవడానికి ప్రయత్నించడంతో వారిని కూడా అక్కడినుంచి పంపించివేశారు.
కోహెడలో సర్వే నంబర్ 167/1లో ఉన్న ప్రభుత్వ భూమిని బాటసింగారం పండ్ల మార్కెట్ కోసం ప్రభుత్వం 179 ఎకరాలు కేటాయించిందని కలెక్టర్ నారాయణరెడ్డి తెలిపారు. ఆ భూమి తమదంటూ కొందరు రైతులు పనులను అడ్డుకుంటున్నారని చెప్పారు. దీనిపై ఇబ్రహీంపట్నం ఆర్డీవో పూర్తిస్థాయిలో విచారణ జరిపి అర్హులైన రైతులను గుర్తిస్తారని పేర్కొన్నారు. అర్హులైన రైతులుంటే అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డితో కలిసి మంగళవారం ఆయన కోహెడ గ్రామంలో పండ్ల మార్కెట్ ఏర్పాటు కోసం చదును చేస్తున్న భూములను పరిశీలించారు.
కలెక్టర్ మాట్లాడుతూ.. ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డితో కలిసి అర్హులైన వారిని గుర్తించి తగిన న్యాయం చేస్తామని చెప్పారు. రైతులు ఆందోళన చెందవద్దని కోరారు. ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి మాట్లాడుతూ.. త్వరలోనే ఇబ్రహీంపట్నం ఆర్డీవో, రైతులతో సమావేశం ఏర్పాటుచేసి సర్టిఫికెట్లు ఉన్న రైతులు, భూమి శిస్తు చెల్లించిన రైతుల పేర్లతో జాబితా తయారుచేస్తామని, దాని ఆధారంగా రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని తెలిపారు.