Telangana | హైదరాబాద్, అక్టోబర్ 3 (నమస్తే తెలంగాణ): లంచాల కోసం ఇసుకాసురులతో అంటకాగుతున్న ముగ్గురు సీఐలు, 13 మంది ఎస్సైలను వీఆర్‌కు అటాచ్ చేస్తూ గురువారం మల్టీజోన్-2 ఐజీ వీ సత్యనారాయణ ఉత్తర్వులు జారీ చేశారు. వీఆర్‌లో పెట్టినవారిలో సంగారెడ్డి రూరల్, తాండూర్ రూరల్, తాండూరు టౌన్ సీఐలతో పాటు.. వీపనగండ్ల, బిజినేపల్లి, తెలకపల్లి, వంగూరు, ఉప్పనూతల, సంగారెడ్డి రూరల్, పెద్దేముల్, యాలాల్, తుంగతుర్తి, ఆత్మకూర్(ఎస్), పెన్‌పహాడ్, వాడపల్లి, హాలియా ఎస్సైలు ఉన్నారు. వీరిలో కొందరికి ఇసుక అక్రమ రవాణాలో ప్రత్యక్ష, పరోక్ష సహకారం ఉండటంతో వారిపై డిపార్ట్మెంట్ చర్యలు తీసుకున్నట్టు ఐజీ తెలిపారు. త్వరలో వీరిని లూప్లైన్కు బదిలీ చేస్తామని వెల్లడించారు. ఇప్పటికే ఒక సీఐ, 14 మంది ఎస్సైలను కూడా బదిలీ చేసిన విషయం తెలిసిందే.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాన మల్టీజోన్-2లో ఇసుక అక్రమ రవాణాదారులు రెచ్చిపోయారు. పోలీసులు అండదండలు దండిగా ఉండటంతో మరింత దూకుడు పెంచారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర నిఘా అధికారుల నివేదికలు, ఇతర ఎంక్వైరీల ద్వారా పోలీసులు, ఇసుక అక్రమార్కులు చేస్తున్న దారుణాలు ఐజీ ఆఫీసుకు తెలిశాయి. దీంతో ఐజీ సత్యనారాయణ తక్షణం వీఆర్ చర్యలు తీసుకున్నారు. ఇప్పటికే అక్రమార్కులతో కలిసి పనిచేసిన అడవిదేవిపల్లి, వేములపల్లి, నారట్పల్లి, చండూర్, మాడుగులపల్లి, తిప్పర్తి, చింతలపాలెం, తిరుమలగిరి, నాగారం, జాజిరెడ్డిగూడెం, అచ్చంపేట, బొంరాస్‌పేట, తాండూ ర్, చిన్నంబావి ఎస్సైలను ఐజీ బదిలీ చేశారు.
ఉన్నతాధికారులు ఇసుక అక్రమ రవాణాదారులతో కలిసి తిరుగుతుంటే.. కిందిస్థాయి సిబ్బంది రేషన్‌బియ్యం అక్రమంగా తరలించేవారితో, మట్కా, గ్యాంబ్లింగ్ నిర్వహించేవారితో అంటకాగుతున్నారు. దీంతో కానిస్టేబుళ్లపైనా తీవ్రమైన ఆరోపణలు వస్తుండటంతో వారిపైనా తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయా జిల్లాల ఎస్పీలకు ఐజీ సత్యనారాయణ ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో కొండమల్లేపల్లి హోంగార్డు (947), జడ్చర్ల హెడ్ కానిస్టేబుల్ ఆనంద్ (1049)ను డీఏఆర్‌కు అటాచ్ చేశారు. ఇప్పటికే వికారాబాద్‌లోని మర్పల్లిలో గెస్ట్ హౌస్‌లో పేకాట నిర్వహిస్తున్న ప్రభాకర్ సేట్, రఫిక్‌కు వికారాబాద్ ఎస్పీ వార్నింగ్ ఇచ్చారు. రఫీ మీద సస్పెక్ట్ షీట్ ఓపెన్ చేశారు.
ఓ మైనర్ రేప్ ఘటనలో తక్షణ విచారణ చేపట్టకుండా విధుల్లో అలసత్వం వహించిన వికారాబాద్ టౌన్ సీఐ నాగరాజు సస్పెండ్ అయ్యాడు. జోగిపేట ఎస్‌హెచ్‌వోగా, వికారాబాద్ టౌన్ పీఎస్‌గా పనిచేస్తున్న అతడు.. నిందితుల నుంచి లంచం తీసుకొని విచారణలో అవకతవకలకు పాల్పడ్డాడు. దీంతో సీఐని ఐజీ సత్యనారాయణ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.