హైదరాబాద్, డిసెంబర్ 25 (నమస్తే తెలంగాణ) : రైతులకు మేలుచేసే పరిశోధనలతోపాటు వారి తలసరి ఆదాయం పెరిగే మార్గాలపై ఉద్యాన వర్సిటీ శాస్త్రవేత్తలు దృష్టిసారించాలని రాష్ట్ర వ్యవసాయ సహకారశాఖ కార్యదర్శి కే సురేంద్రమోహన్ సూచించారు. 2047 నాటికి తెలంగాణ రైతు తలసరి ఆదాయం సంవత్సరానికి రూ.12,53,733కు పెరిగేలా ప్రభుత్వం కార్యక్రమాలు చేపడుతున్నట్టు తెలిపారు. గురువారం ఉద్యాన వర్సిటీని ఆయన సందర్శించారు. అనంతరం వర్సిటీ వీసీ రాజిరెడ్డితో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సురేంద్రమోహన్ మాట్లాడుతూ.. ఇప్పుడున్న పండ్ల సాగు విస్తీర్ణాన్ని 12 లక్షల ఎకరాలకు, కూరగాయల సాగు 10 లక్షలు, సుగంధద్రవ్యాల సాగు 6 లక్షలు, తృణధాన్యాల సాగు 10 లక్షలు, అపరాల సాగు 7 లక్షలు, పామాయిల్ సాగు విస్తీర్ణం 12 లక్షల ఎకరాలకు విస్తరించేలా ప్రణాళికలు చేపడుతున్నట్టు వెల్లడించారు.
పట్టు పరిశ్రమలో ఐదు రెట్ల మల్బరీ ఉత్పత్తి, ఎనిమిది రెట్లు టస్సర్ సిల్ ఉత్పత్తిని టార్గెట్‌గా పెట్టుకున్నట్లు తెలిపారు. వీటికి మద్దతుగా మైక్రో ఇరిగేషన్ 40 లక్షల ఎకరాలకు పెంచేందుకు సిద్ధంగా ప్రభుత్వం ఉందన్నారు. అనంతరం ఉద్యానరంగా న్ని పెంపొందించేందుకు వర్సిటీ తయారుచేసిన ప్రణాళికను సురేంద్రమోహన్‌కు వీసీ రాజిరెడ్డి వివరించారు. కార్యక్రమం లో టీఎస్ ఆయిల్‌ఫెడ్ ఓఎస్డీ కిరణ్‌కుమా ర్, వర్సిటీ కన్సల్టెంట్ వీరాంజనేయులు, టెక్నికల్ అడ్వైజర్ సునందిని, కూరగాయల పరిశోధన కేంద్రం హెడ్ అనితకుమారి, ప్రొఫెసర్ పిడిగం సైదయ్య, ఉద్యానశాఖ జేడీ సరోజిని, సిద్దిపేట జిల్లా ఉద్యాన అధికారి సువర్ణ, జేడీఏ శ్రీధర్, శాస్త్రవేత్తలు, విద్యార్థులు పాల్గొన్నారు.
హైదరాబాద్, డిసెంబర్ 25 (నమస్తే తెలంగాణ): తెలంగాణ వైద్య విధానపరిషత్ (టీవీవీపీ)ను డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ సర్వీసెస్ (డీఎస్‌హెచ్‌ఎస్) పరిధిలోకి తీసుకువచ్చేందుకు అసెంబ్లీలో వెంటనే బిల్లు ప్రవేశపెట్టాలని తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం (టీజీజీడీఏ) డిమాండ్ చేసింది. ఈ మేరకు గురువారం టీజీజీడీఏ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ నరహరి, కార్యదర్శి డాక్టర్ లాలుప్రసాద్ రాథోడ్, కోశాధికారి డాక్టర్ ఎంకే రవూఫ్ ప్రకటన విడుదల చేశారు. టీవీవీపీలో పనిచేస్తున్న వైద్యుల జీతాల సమస్యకు శాశ్వత పరిష్కారం లభించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు.
వైద్యులు ప్రతి నెలా జీతాల కోసం ఎదురుచూడాల్సిన దుస్థితి నెలకొన్నదని వాపోయారు. కొంతమందికి ఈ నెల జీతాలు రాలేదని, వారు తీవ్ర ఆర్థిక, మానసిక వేదనకు గురవుతున్నారని పేర్కొన్నారు. ఇది రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శమని మండిపడ్డారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి టీవీవీపీ వైద్యులకు ప్రతి నెలా మొదటి తారీఖున జీతాలు వచ్చేలా శాశ్వత వ్యవస్థను ఏర్పాటు చేయాలని కోరారు. లేకపోతే తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.