రాష్ట్రంలో పూటపూటకూ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను మార్చడం వల్ల పాలన స్తంభించిపోతున్నది. రేవంత్‌రెడ్డి పాలనలో ఇప్పటివరకు ఐదుసార్లు భారీగా ఉన్నతాధికారుల మార్పులు చేర్పులు జరిగినయ్. ముఖ్యమంత్రి, మంత్రులకు నచ్చితే ఒకలా.. లేకపోతే మరోలా బదిలీలు చేస్తున్నరు. ఊ అంటే పోస్టింగ్.. ఆ అంటే బదిలీ అన్నట్టుగా ఉన్నది. -హరీశ్‌రావు
హైదరాబాద్, మార్చి 4(నమస్తే తెలంగాణ): రేవంత్‌రెడ్డి మేనల్లుడి మనుషులు నియోపొలిస్‌లో అక్రమ మైనింగ్ చేస్తున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ ఉపనేత హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. మొబైల్ క్రషింగ్ ప్లాంట్‌కు మాత్రమే నిబంధనలుంటే ఫిక్స్డ్ క్రషింగ్ ప్లాంట్ పెట్టారని మండిపడ్డారు. అసలు హెచ్ఎండీఏకు చెందిన 17 ఎకరాల భూమిని సీఎం మేనల్లుడి అనుయాయులకు ఎలా ఫ్రీగా ఇస్తారని నిలదీశారు. యాక్షన్ ద్వారా ఎందుకు ఆ భూమిని కేటాయించలేదని ప్రశ్నించారు. తెలంగాణభవన్‌లో బుధవారం మీడియా ప్రతినిధులతో హరీశ్ ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ల్యాండ్ లీజుకిస్తే 6 నుంచి 7 శాతం ఫీజు కట్టాలని చెప్పారు. మేనల్లుడి అనుయాయులు రూ.60-70 కోట్లు ప్రభుత్వానికి ఎగ్గొడుతున్నారని తెలిపారు. లెటర్లో పది ఎకరాలు ఇస్తే 17 ఎకరాల్లో మైనింగ్ జరుగుతున్నదని మండిపడ్డారు.
17 లక్షల క్యూబిక్ మీటర్ల బండకు ఫీజు ఎగ్గొట్టారని, అకడ రెడీమిక్స్‌కు పర్మిషన్ లేదని చెప్పారు. పటాన్చెరు ఎమ్మెల్యే మైనింగ్ కంపెనీకి పెనాల్టీ వేసిన అధికారులు దీనికి ఎందుకు వేయడం లేదని ప్రశ్నించారు. మంత్రి పొంగులేటి సంస్థ రాఘవ కన్స్ట్రక్షన్ ఎలాంటి అనుమతులు లేకుండా రాజేంద్రనగర్‌లో మైనింగ్ దందా నడుపుతున్నదని, నిజనిర్ధారణ కోసం బీఆర్ఎస్ బృందం గురువారం అక్కడికి వెళ్తుందని చెప్పారు. అక్రమ మైనింగ్‌కు సంబంధించిన పూర్తి వివరాలను బీఆర్ఎస్ నేతలు అక్కడ ఆధారాలతోసహా ఇస్తారని చెప్పారు. పేలని బాంబులేటి అక్రమ మైనింగ్ గురించి మంగళవారం మీడియాకు ఆధారాలతో వెల్లడిస్తే ఇప్పటివరకు ఎవరూ నోరెత్తలేదని ఎద్దేవాచేశారు. యంగ్ ఇండియా సూళ్ల నిర్మాణ టెండర్లను 5 శాతం అధిక రేటుకు కట్టబెడుతున్నారని, ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు త్వరలోనే బయటపెడుతానని చెప్పారు.
ప్రభుత్వమా? బదిలీల అంగడా?
రెండున్నరేండ్లు కావస్తున్నా కాంగ్రెస్ పాలనలో కనీస స్థిరత్వం లేదని హరీశ్ మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి పాలన చేతగాక, తన అసమర్థతను అధికారుల మీదికి నెట్టేస్తున్నాడని విమర్శించారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను పూటకోసారి మారుస్తుంటే పాలనలో ఫలితాలు ఎలా వస్తాయని ప్రశ్నించారు. ‘ఇప్పటికే ఐదుసార్లు భారీ బదిలీలు జరిగినయ్. విభాగాధిపతులు సగటున 8 నెలలు కూడా పనిచేయడం లేదు. ఇది ప్రభుత్వమా లేక బదిలీల అంగడా?’ అని భగ్గుమన్నారు. విద్యుత్తు శాఖలో రెండేండ్లలో ఐదుగురు అధికారులు మారారని, దీనివల్ల శాఖ అతలాకుతలం కావడమే కాకుండా అవినీతిమయంగా మారిందని ఆందోళన వ్యక్తంచేశారు. కీలకమైన జీహెచ్ఎంసీ, సింగరేణి, మున్సిపల్, పాఠశాల విద్య, పంచాయతీరాజ్ వంటి కీలక శాఖల్లో నలుగురు నుంచి ఐదుగురు అధికారులను మార్చడం వల్ల పథకాల అమలు కుంటుపడిందని విమర్శించారు.
అతి ముఖ్యమైన ఆరోగ్యశ్రీలో ఏకంగా ఎనిమిది మంది అధికారులు మారడం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడటమేనని మండిపడ్డారు. ఒక కలెక్టర్‌కు జిల్లాపై అవగాహన రావడానికి కనీసం ఆరు నెలల సమయం పడుతుందని, ఆ సమయం కూడా ఇవ్వకుండానే కలెక్టర్లను మార్చడం వల్ల జిల్లాల అభివృద్ధి కుంటుపడిందని వాపోయారు. హైదరాబాద్‌కు గుండెకాయ వంటి రంగారెడ్డి జిల్లాలో ఇప్పటికే నలుగురు కలెక్టర్లు మారడమే ఇందుకు నిదర్శనమని విమర్శించారు. ‘ముఖ్యమంత్రి, మంత్రులకు నచ్చితే ఒకలా.. లేకపోతే మరోలా బదిలీలు చేస్తున్నరు. ఊ అంటే పోస్టింగ్.. ఆ అంటే బదిలీ అన్నట్టుగా సాగుతున్నది’ అని మండిపడ్డారు. లగచర్ల ఘటనలో హామీలు ఇచ్చిన వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్‌ను, ఆ హామీలు అమలు చేయాల్సి వస్తుందని బదిలీ చేయడం ప్రభుత్వ కక్షసాధింపు ధోరణికి పరాకాష్ట అని నిప్పులు చెరిగారు.
ఐదుసార్లు అధికారుల మార్పు
రేవంత్‌రెడ్డి పాలనలో ఇప్పటివరకు ఐదుసార్లు భారీగా ఉన్నతాధికారుల మార్పులు చేర్పులు జరిగాయని (2024 జనవరి 3, జూన్ 15, అక్టోబర్ 16, 2025 ఏప్రిల్ 27, 2026 ఫిబ్రవరి 25-26) తేదీలు సహా వివరించారు. విభాగాధిపతులు సగటున 6-8 నెలలు కూడా పని చేయడం లేదని చెప్పారు. రాష్ట్రంలో అత్యంత కీలకమైన విద్యుత్తు శాఖలో ఈ రెండేండ్ల కాలంలో ఐదుగురు (ప్రభాకర్‌రావు, రిజ్వీ, సుల్తానియా, రోనాల్డ్ రోస్, నవీన్‌మిట్టల్) అధికారులు మారారని, ఇది ఆ శాఖపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపిందని తెలిపారు. విస్తృతమైన ఈ శాఖను అర్థం చేసుకునేలోపే అధికారులను బదిలీ చేయడంతో ఆ శాఖ అతలాకుతలం కావడమే కాకుండా అవినీతిమయంగా మారిందని ఆందోళన వ్యక్తంచేశారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో విద్యుత్తు సంస్థల సీఎండీగా ప్రభాకర్‌రావు ఒక్కరే ఉన్నారని గుర్తుచేశారు. సింగరేణిలో కూడా నలుగురు అధికారులు (శ్రీధర్, బలరాం, కృష్ణభాస్కర్, జ్యోతి బుద్ధ ప్రకాశ్) మారారని చెప్పారు.
సగటున ఆరునెలలకు ఒకరు బదిలీ అయ్యారని తెలిపారు. జీహెచ్ఎంసీలో కూడా నలుగురు (రోనాల్డ్ రోస్, ఆమ్రపాలి, ఇలంబర్తి, కర్ణన్) మారారని గుర్తుచేశారు. సమాచార ప్రజాసంబంధాలశాఖ (ఐఅండ్‌పీఆర్)లో కూడా నలుగురు (అశోక్‌రెడ్డి, హనుమంతరావు, హరీశ్, ప్రియాంక) మారారని చెప్పారు. బడ్జెట్లో ఈ శాఖకు రూ.16 కోట్లు కేటాయించారని, నిరుడు రూపాయి కూడా విడుదల చేయలేదని, ఇప్పుడు కూడా నేటికీ నిధులు విదిల్చలేదని తెలిపారు. పాఠశాల విద్యాశాఖలో నలుగురు (వాకాటి కరుణ, బుర్రా వెంకటేశం, శ్రీధర్, యోగితా రాణా), విద్యాశాఖ డైరెక్టర్లు ముగ్గురు (దేవసేన, నర్సింహారెడ్డి, నవీన్ నికోలస్) మారారని గుర్తుచేశారు. ఆరోగ్యశ్రీలో అత్యధికంగా ఎనిమిది మంది (విశాలాక్షి, క్రిస్టీనా, కర్ణన్, శివశంకర్, కర్ణన్, సంగీత సత్యనారాయణ, క్రిస్టీనా, ఉదయ్) అధికారులు మారారని, ఇలాగైతే వ్యవస్థ ఎలా నడుస్తుందని ప్రశ్నించారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్లుగా నలుగురు (గౌతమ్, శశాంక, భారతి హోలికేరి, నారాయణరెడ్డి) మారారని గుర్తుచేశారు.
రాష్ట్రంలో కీలకమైన, కేంద్రంతో సత్సంబంధా లు కలిగి ఉండాల్సిన పంచాయతీరాజ్ శాఖలో కూడా నలుగురు (అనితారామచంద్రన్, సృజ త, శృతి ఓఝా, దివ్యదేవరాజన్) కమిషనర్లు మారారని చెప్పారు. ఇలా ఆరునెలలకు ఒకరు చొప్పున మారితే కేంద్రం నుంచి నిధులు ఎలా వస్తాయని, అధికారుల సమన్వయం ఎలా కుదురుతుందని నిలదీశారు. మున్సిపల్ శాఖ లో ఐదుగురు (దానకిశోర్, లోకేశ్, ఇలంబర్తి, శ్రీదేవి, జయేశ్‌రంజన్), ఐటీశాఖలో ముగ్గురు (జయేశ్‌రంజన్, సంజ య్, రామకృష్ణారావు), రాష్ర్టానికి అత్యధిక రెవెన్యూ ఇచ్చే మైనింగ్‌శాఖలో ఆరుగురు డైరెక్టర్లు మారారని చెప్పారు. వాణిజ్య పన్నుల శాఖలో ఐదుగురు (క్రిస్టీనా, టీకే శ్రీదేవి, రిజ్వీ, హరిత, రఘునందన్‌రావు) కమిషనర్లు మారారని, నేషనల్ హెల్త్ మిషన్‌లో ముగ్గురిని మార్చారని తెలిపారు.
కలెక్టర్లకు అవగాహన ఎలా వస్తది?
ఇప్పటివరకు 140 మంది ఐఏఎస్‌లు, 20 మంది కలెక్టర్లను మార్చారని హరీశ్ దుయ్యబట్టారు. కొన్ని సందర్భాల్లో పోస్టులు ఇచ్చి కూడా జాయిన్ కావద్దని ఆదేశిస్తున్నారని మండిపడ్డారు. కలెక్టర్లు కనీసం రెండేండ్లు ఒకే చోట ఉంటే మంచి ఫలితాలు వస్తాయని చెప్పారు. కేసీఆర్ హయాంలో రాష్ట్రం మాడల్ స్టేట్ అయిదంటే అది అధికారులకు స్వేచ్ఛనిచ్చి పని చేయించడం వల్లే సాధ్యమైందని గుర్తుచేశారు. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కలెక్టర్లను బెదిరించడం మంచి పద్ధతి కాదని, తమ అక్రమాలకు అధికారులు సహకరించనందుకే వారిని బదిలీ చేస్తున్నారని, బెదిరిస్తున్నారని విమర్శించారు. సీఎం తప్పులకు తామెందుకు బాధ్యులం కావాలని అధికారులు భావిస్తున్నారని, సీఎం అధికారులను బ్లాక్ మెయిల్ చేయడం మానుకోవాలని హితవుపలికారు.
వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్ లగచర్ల ఆందోళన సందర్భంగా అనేక హామీలిచ్చారని, ఆ హామీలు అమలు చేయాల్సి వస్తుందని ఆయనను అకడి నుంచి బదిలీ చేశారని చెప్పారు. సీఎస్‌కు బోలెడు బాధ్యతలుంటాయని, ఐటీ కార్యదర్శిగా సీఎస్ ఎలా పని చేయగలుతారని ప్రశ్నించారు. అధికారులను తరచూ బదిలీ చేయడం వల్ల రాష్ట్రానికి అవార్డులు కూడా రావడం లేదని, గతంలో తమ పాలనలో ఇలా అధికారులను మార్చలేదు కాబట్టే కేంద్ర అవార్డుల్లో సింహభాగం రాష్ర్టాన్ని వరించాయని గుర్తుచేశారు. అధికారులను తరచూ బదిలీ చేయడం వల్ల పాలన, ప్రగతి దెబ్బతింటున్నాయని చెప్పారు. ‘సీఎం తప్పులకు అధికారులను బలి చేయడం మానుకోవాలి. పదేండ్లు ప్రభుత్వం నడిపిన అనుభవంతో మేము చెప్తున్నది నిర్మాణాత్మక సూచనగా స్వీకరించండి. మా సలహాలను కాంగ్రెస్ ప్రభుత్వం స్వీకరిస్తే మంచిది. లేదంటే వారి కర్మ’ అని పేర్కొన్నారు.
అప్పుడో నీతి.. ఇప్పుడో నీతా?
గతంలో బీఆర్ఎస్ హయాంలో అధికారుల పొడిగింపుపై విమర్శలు చేసిన కాంగ్రెస్ నేతలు, ఇప్పుడు డజన్ల కొద్దీ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, వందల మంది ఇంజినీర్లకు ఎక్స్టెన్షన్లు ఎలా ఇస్తున్నారని హరీశ్ ప్రశ్నించారు. బీఆర్ఎస్ హయంలో అధికారుల ఉద్యోగ కాలం పొడిగింపుపై ఈ కాంగ్రెస్ నేతలే విమర్శలు చేశారని, ఇప్పుడు వాళ్లు చేస్తున్నదేమిటని నిలదీశారు. రిటైర్డ్ అధికారులు కీలక పోస్టుల్లో ఉండటం వల్లే అవినీతి రాజ్యమేలుతున్నదని ఆరోపించారు. యంగ్ ఇండియా సూళ్ల నిర్మాణ టెండర్లలో 5 శాతం అధిక రేటుకు పనులు ఇస్తున్నారని చెప్పారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే బయటపెడుతానని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
80 జీవోలు ఆఫ్‌లైన్‌లోనే
అవినీతి జరుగుతున్నది కాబట్టే అన్ని జీవోలను పారదర్శంగా పబ్లిక్ డొమైన్లో పెట్టడం లేదని హరీశ్ విమర్శించారు. 20 శాతం జీవోలు ఆన్లైన్లో, 80శాతం జీవోలు ఆఫ్‌లైన్‌లో పెడుతున్నారని చెప్పారు. బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ హైకోర్టుకు వెళ్తే నాలుగు వారాల్లో జీవోలన్నీ ఆన్లైన్లో పెట్టాలని కోర్టు ఆదేశించిందని, అయినా జీవోలు ఆన్లైన్లో పెట్టడం లేదని మండిపడారు. ‘ప్రతిపక్షంలో ఉండగా జీవోలపై కాంగ్రెస్ ఏం మాట్లాడింది? ఇపుడేం చేస్తున్నది?’ అని ఆగ్రహం వ్యక్తంచేశారు. వరంగల్ ఎంజీఎంలో ఎలుకలు, జడ్చ ర్ల దవాఖానలో శవాన్ని కుక్కలు పీక్కుతినడం పై తీవ్రంగా మండిపడ్డారు. రాష్ట్రంలో వైద్య ఆ రోగ్యశాఖ పరిస్థితి ఇట్లా తయారైందని ఎద్దేవా చేశారు. తాము అనువుగా కట్టిన మార్చురీలను ఈ ప్రభుత్వం వాడుకోవడం లేదని చె ప్పారు. ఫిరాయింపు విషయంలో కౌన్సిలర్లను సస్పెండ్ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ.. ఫిరాయించిన ఎమ్మెల్యేల విషయంలో ఎందుకు స్పం దించడం లేదని ప్రశ్నించారు. కౌన్సిలర్లకు ఒక నీతి? ఎమ్మెల్యేలకు మరో నీతా? అని నిలదీశారు. 16 హౌస్ కమిటీలు వేయకుండా అసెంబ్లీ వ్యవస్థను భ్రష్టు పట్టించారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
ప్రతిపక్షంగా మేము సక్సెస్
ప్రధాన ప్రతిపక్ష సభ్యులుగా తాము పూర్తిస్థాయిలో సక్సెస్ అవుతున్నామని హరీశ్ చెప్పారు. ప్రభుత్వంపై ప్రజల తరఫున ఒత్తిడి తేగలుగుతున్నామని, తమ ఒత్తిడికి తలొగ్గే ప్రభుత్వం వివిధ అంశాలపై స్పందించాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. ఖమ్మంలో ఇండ్లు కూలగొట్టిన అంశంపై తాము నిలదీస్తేనే జాగలు ఇచ్చి ఇండ్లు కట్టిస్తామని ప్రభుత్వం చెప్తున్నదని గుర్తుచేశారు. శారదాపీఠం విషయంలో కూడా వెనక్కి తగ్గిందని చెప్పారు. ఎడ్యుకేషన్ పాలసీ మంచిదే అయితే వెబ్సైట్ నుంచి ఎందుకు తీసివేశారని ప్రశ్నించారు.అసెంబ్లీలో ఇద్దరు సెక్రటరీల సిస్టం ఎప్పుడూ లేదని, ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ కొత్తగా తెచ్చిందని చెప్పారు.
రైతులకు కష్టాలు తప్పడం లేదు
కాంగ్రెస్ పాలనలో రైతులకు కష్టాలు తప్పడం లేదని, షాపుల్లో ఇవ్వాల్సిన యూ రియా.. యాప్‌లో ఇస్తామని చెప్పి ప్రభు త్వం విఫలమైందని హరీశ్‌రావు విమర్శించారు. రైతులు పండించిన పంటనైనా అ మ్ముకుందామంటే కొనుగోలు కేంద్రాల ఏ ర్పాటులోనూ సర్కార్ అదే నిర్లక్ష్యం వహిస్తున్నదని దుయ్యబట్టారు. కనీసం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేయక.. మద్దతు ధర అందక మక రైతులు తీవ్ర నష్టాలు ఎదురొంటున్నారని వాపోయారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం ఆరెపల్లి (అకెనపల్లి)లో సుమారు 350 ఎకరాల్లో మక సాగు చేస్తున్న రైతులు ప్రతి ఏటా నష్టపోతున్నా ఈ ప్రభుత్వం పట్టించుకోకపోవడం శోచనీయమని పేర్కొన్నారు.
కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయకపోవడంతో ప్రైవేట్ వ్యాపారులకు క్వింటాల్‌కు రూ.300 నుంచి రూ.600 తకువ ధరకు అమ్ముకోవాల్సి వస్తున్నదని, దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఇది ఒక ఆరెపల్లి సమస్య మాత్రమే కాదని, రాష్ట్ర వ్యాప్తంగా మక రైతులు ఇలాంటి ఇబ్బందులు అనేకం ఎదురొంటున్నారని తెలిపారు. అనేక జిల్లాల్లో కొనుగోలు కేంద్రాలు ఆలస్యంగా ప్రారంభం కావడం, అసలు ఏర్పాటే చేయక పోవడం, చెల్లింపులు ఆలస్యం కావడం, రవాణా సదుపాయాలు లేకపోవడం వంటి సమస్యలు రైతులను ఆర్థికంగా కుంగదీస్తున్నాయని చెప్పా రు. ప్రభుత్వం వెంటనే ఆరెపల్లితో పాటు అ వసరమైన అన్ని ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి, మద్దతు ధర చె ల్లించి మకలు కొనుగోలు చేయాలని డి మాండ్ చేశారు. రైతులు పండించిన పంట లు కోత దశకు వచ్చినా వారికి ఇస్తానన్న పె ట్టుబడి సాయం ఇవ్వలేని దుస్థితిలో రేవంత్ సర్కార్ ఉన్నదని తూర్పారబట్టారు.
హెచ్ఎండీఏకు చెందిన 17 ఎకరాల భూమిని సీఎం రేవంత్‌రెడ్డి మేనల్లుడి మనుషులకు అప్పనంగా కట్టబెట్టిండ్రు. నియో పొలిస్‌లో వాళ్లు అక్రమంగా మైనింగ్ చేస్తున్నరు. ల్యాండ్ లీజుకిస్తే 6 నుంచి 7 శాతం ఫీజు కట్టాల్సి ఉంటది. అలా వాళ్లు రూ.60-70 కోట్లు ప్రభుత్వానికి ఎగ్గొడుతున్నరు. లెటర్లో పది ఎకరాలు అని రాసిస్తే 17 ఎకరాల్లో మైనింగ్ జరుగుతున్నది.
-హరీశ్‌రావు
ఇప్పటివరకు 140 మంది ఐఏఎస్‌లు, 20 మంది కలెక్టర్లను మార్చిండ్రు. ఢిల్లీతో సమన్వయం ఉండాల్సిన కీలక శాఖల్లో అధికారులను తరచూ మార్చడం వల్ల రాష్ట్రానికి తీవ్ర నష్టం కలుగుతున్నది. కలెక్టర్‌కు జిల్లాపై అవగాహన రావడానికి కనీసం ఆరు నెలలు పడుతది. ఆలోపే మారిన కలెక్టర్లు ఎంతో మంది ఉన్నది. ముఖ్యంగా యువ కలెక్టర్లను బదిలీ చేయడం వల్ల వారిలో నైతిక ైస్థెర్యం, ఆత్మవిశ్వాసం, ఆసక్తి దెబ్బతింటయ్.
-హరీశ్‌రావు