హైదరాబాద్, మార్చి 21 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ఆర్థిక స్థితిపై ప్రభుత్వం చెప్తున్న లెకలకు, క్షేత్రస్థాయిలో జరుగుతున్న ఖర్చులకు పొంతన కుదరడం లేదు. వరుసగా రెండో ఏడాది కూడా ద్రవ్యలోటు రూ.50 వేల కోట్ల మారును దాటడం కాంగ్రెస్ ప్రభుత్వ ఆర్థిక క్రమశిక్షణా రాహిత్యానికి నిదర్శనంగా నిలుస్తున్నది. అంచనాలు వేయడంలో వైఫల్యం, ఆదాయ మార్గాలను పెంచుకోలేకపోవడం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మారుస్తున్నాయి. ప్రస్తుత 2025-26 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటు రూ.54,009 కోట్లుగా ఉంటుందని తొలుత భావించగా.. సవరించిన అంచనాల ప్రకారం అది రూ.56,123 కోట్లకు చేరి అందరికీ షాకిచ్చింది.
తాజాగా వచ్చే 2026-27 ఆర్థిక సంవత్సరానికి రూ.3,24,234 కోట్లతో భారీ బడ్జెట్ను ప్రవేశపెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఈసారి ఏకంగా రూ.58,458 కోట్ల ద్రవ్యలోటు ఏర్పడవచ్చని అంచనా వేసింది. ఇది రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి (జీఎస్డీపీ)లో దాదాపు 3.5 నుంచి 4 శాతానికి సమానం. జీఎస్డీపీలో అప్పులు దాదాపు 30% మేరకు ఉన్నాయి. 2023-24 సంవత్సర బడ్జెట్లో ద్రవ్యలోటును రూ.38,235 కోట్లుగా అంచనా వేశారు. ఇది రాష్ట్ర జీఎస్డీపీలో కేవలం 2.7 శాతమే. రేవంత్రెడ్డి ప్రభుత్వం చూపిస్తున్న రెవెన్యూ మిగులు లెకలు ఆశ్చర్యపరుస్తున్నాయి. వాస్తవానికి ఏటాఅంచనాలో మిగులు సగం కూడా ఉండటం లేదు.
2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.4,881 కోట్ల మిగులు ఉంటుందని అంచనా వేస్తే చివరికి అది రూ.1,704 కోట్లకు పడిపోయింది. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.2,738 కోట్లు మిగులు ఉంటుందని ఆశిస్తే రూ.591 కోట్లకే పరిమితమైంది. దీన్ని బట్టి ఖర్చుపై ప్రభుత్వానికి నియంత్రణ లేదని అర్థమవుతున్నది. దీంతో ఈ ఏడాది రూ.6,857 కోట్ల మిగులు ఉంటుందని కాంగ్రెస్ సర్కార్ చెప్తున్న లెక్కలు కూడా ఉత్తుత్తివేనని ఆర్థిక నిపుణులు విమర్శిస్తున్నారు.
