ఆదివారం 12 జూలై 2020
Telangana - Jun 30, 2020 , 01:50:29

తెలంగాణ నుంచే తొలి వ్యాక్సిన్‌

తెలంగాణ నుంచే తొలి వ్యాక్సిన్‌

  • సూదిమందును అభివృద్ధి చేసిన భారత్‌ బయోటెక్‌
  • ‘కోవాక్సిన్‌' పేరుతో త్వరలోనే అందుబాటులోకి
  • మనుషుల మీద ట్రయల్స్‌కు డీజీసీఐ అనుమతి
  • భారత్‌ బయోటెక్‌కు సహకరించిన ఎన్‌ఐవీ

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ నియంత్రణకు విరుగుడు కనుగొన్నామని హైదరాబాద్‌కు చెందిన భారత్‌ బయోటెక్‌ సంస్థ ప్రకటించింది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో కరోనా చికిత్స కోసం ‘కోవాక్సిన్‌'ను విజయవంతంగా అభివృద్ధిచేశామని సోమవారం తెలిపింది. భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌), పుణెలోని జాతీయ వైరాలజీ ఇన్‌స్టిట్యూట్‌ (ఎన్‌ఐవీ) సహకారంతో ఈ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేశామని తెలిపింది. హైదరాబాద్‌లోని జీనోమ్‌వ్యాలీలోగల భారత్‌ బయోటెక్‌లో అత్యంత పకడ్బందీగా వ్యాక్సిన్‌ను అభివృద్ధిచేశామని పేర్కొంది.

ఈ వ్యాక్సిన్‌ క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహించేందుకు డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (డీసీజీఐ), కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమశాఖ అనుమతినిచ్చాయని పేర్కొంది. జూలై నెలలో ఈ వ్యాక్సిన్‌ను మనుషులపై పరీక్షిస్తామని తెలిపింది. సార్స్‌-కోవ్‌2 వైరస్‌ నమూనాను పుణెలోని ఎన్‌ఐవీలో వేరుచేసి తమకు పంపారని, దీని ఆధారంగా దేశీయ పరిజ్ఞానంతో వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేశామని పేర్కొంది. ప్రీ క్లినికల్‌ ట్రయల్స్‌లో వచ్చిన ఫలితాలను డీసీజీఐకి పంపిన అనంతరం మనుషులపై క్లినికల్‌ ట్రయల్స్‌కు అనుమతి వచ్చిందని తెలిపింది. 

గర్వంగా ఉంది:కృష్ణా ఎల్లా

కరోనాకు  కోవాక్సిన్‌ పేరుతో వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేయడం గర్వంగా ఉన్నదని భారత్‌ బయోటెక్‌ సీఎండీ డాక్టర్‌ కృష్ణా ఎల్లా పేర్కొన్నారు. కరోనాకు భారతదేశం తయారు చేసిన తొలి స్వదేశీ వ్యాక్సిన్‌ ఇదేనని చెప్పారు. కొవాక్సిన్‌ను అభివృద్ధి చేయడంలో ఐసీఎంఆర్‌, ఎన్‌ఐవీ ఎంతో సహకరించాయని తెలిపారు. సెంట్రల్‌ డ్రగ్స్‌ స్టాండర్డ్‌ కంట్రోల్‌ ఆర్గనైజేషన్‌ సహకారం, అనుమతులు, సూచనలు ఇచ్చిందన్నారు. తమ సంస్థకు చెందిన పరిశోధన అభివృద్ధి బృందం రాత్రింబవళ్లు ఎంతగానో శ్రమించాయని ఆయన తెలిపారు. ఇప్పటివరకు నిర్వహించిన ట్రయల్స్‌ సత్ఫలినిచ్చాయని చెప్పారు. జేఎండీ సుచిత్ర ఎల్లా మాట్లాడుతూ.. కరోనా వ్యాక్సిన్‌ను ప్రయోగాలను విజయవంతంగా పూర్తిచేసి భారత్‌ శక్తి సామర్ధ్యాలను ప్రపంచానికి చాటిచెప్పుతామని పేర్కొన్నారు. 


logo