హనుమకొండ చౌరస్తా, ఏప్రిల్ 9 : కాకతీయ యూనివర్సిటీలో మళ్లీ ఓఎస్డీ (ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ) పోస్టుపై వ్యతిరేక పవనాలు వినిపిస్తున్నాయి. లేని పోస్టును కొత్తగా క్రియేట్ చేసి ఇవ్వడంపై సర్వత్రా విమర్శలు రేకెత్తుతున్నాయి. కేయూలో ఓఎస్డీ పదవీ ఆది నుంచి ఆటంకంగా మారింది. అప్పటికీ ఇప్పుడు ఏమీ మారలేదని కేవలం పేరు మాత్రమే మారిందని అప్పుడు మల్లారెడ్డి ఇప్పుడు వెంకట్రామిరెడ్డి అనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అధికార దాహానికి పైరవీలు తోడైతే పరిపాలన అధికారులు దాసోహం అవ్వాల్సిందే అనడానికి కేయూలో ఓఎస్డీ పదవీ పెద్ద దుమారం లేపింది.
కాకతీయ యూనివర్సిటీ చరిత్రలోనే ఎన్నడూలేని పోస్టును తీసుకువచ్చి ప్రొఫెసర్ మల్లారెడ్డిని రెండో అంతస్థు భవనంలో ప్రత్యేకంగా కుర్చీవేసి కూర్చోబెట్టడంపై సర్వత్రా విమర్శలు రావడంతో అప్పటి నుంచి ఆ కుర్చీలో కూర్చోలేదు. ఇప్పటికే అనేక అవినీతి అక్రమాలపై ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రొఫెసర్ పెరటి మల్లారెడ్డి అర్హత లేకున్నా కూడా కాకతీయ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా నియమించారనే ఆరోపణలు కూడా లేకపోలేదు. ఆయనకే ఓఎస్డీ పోస్టు కట్టబెట్టడంపై ప్రొఫెసర్లు, విద్యార్థిసంఘాలు, ఉద్యోగులు సైతం భగ్గుమన్నారు. కాకతీయ యూనివర్సిటీలో రెడ్డి ప్రొఫెసర్ల పెత్తనం నడుస్తుందని ఇప్పటికే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు రావాల్సిన పదవులను రెడ్డిలకే ఇవ్వడంపై మండిపడుతున్నారు.
కేయూలో సొంతంగా ఓఎస్డీ పదవీ సృష్టించి ఉన్నవారికే రెండు, మూడు పదవులు కట్టబెడుతున్నారని ప్రొఫెసర్లు, మేధావులు, విద్యార్థిసంఘాల నాయకులు మండిపడుతున్నారు. అందరూ వ్యతిరేకిస్తున్నా కావాలని వైస్‌చాన్స్‌లర్ ప్రొఫెసర్ కర్నాటి ప్రతాప్‌రెడ్డి వెంకట్రామిరెడ్డికి ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓఎస్డీ పోస్టు క్రియేట్ చేసి పదవీ ఇవ్వడం మోసమని, న్యాయ నిపుణులకు ఇవ్వాల్సిన పదవి మళ్లీ రెడ్డికి కేటాయించడంపై విమర్శలు వచ్చాయి.
ఒక్కో ప్రొఫెసర్‌కు రెండు, మూడు పోస్టులు..
కాకతీయ యూనివర్సిటీని ప్రక్షాళన చేస్తానని సభలో ప్రగాల్బాలు పలికిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాటలు నోటి మాటగానే మిగిలిపోయానే విమర్శలు వినిపిస్తున్నాయి. లక్షలాది మంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం వేయ్యికండ్లతో ఎదురుచూస్తుంటే కేయూ ఎలాంటి రిక్రూట్మెంట్ చేయకుండా ఉన్నవారితో నడిపిస్తున్నారు. ఏకంగా ఒక్కొక్కరికీ రెండు, మూడు పదవుల్లో కొనసాగుతున్నారు. కేయూలో కొత్తగా క్రియేట్ చేసిన ఓఎస్డీ పోస్టులో నియామకమైన వెంకట్రామిరెడ్డి ఎడ్‌సెట్ కన్వీనర్, ఫిజిక్స్విభాగం ప్రొఫెసర్ కొనసాగుతున్నారు. ఇతనితో పాటు కేయూలోని పలువురు ప్రొఫెసర్లు రెండు, మూడు పోస్టుల్లో కొనసాగడంపై మండిపడుతున్నారు.
న్యాయనిపుణులకు కేటాయించాలి..
అసలుకైతే ఓఎస్డీ పదవి ఎక్కువ శాతం న్యాయనిపుణులకు కేటాయిస్తారు. కాకతీయ యూనివర్సిటీలో జరుగుతున్న ప్రతి కోర్టు కేసును విశ్లేషణాత్మకంగా అర్థం చేసుకొని అటు వీసీకి ఇటు రిజిస్ట్రార్‌కు కోర్టు కేసుల సమస్యల పట్ల అవగాహన కల్పించడం ఓఎస్డీ బాధ్యతగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ కేయూలో మాత్రం అందుకు భిన్నంగా వెంకట్రామిరెడ్డికి ఓఎస్డీగా అవకాశాలు కల్పించారు. కాకతీయ విశ్వవిద్యాలయానికి వచ్చేసరికి పరిణామాలు తారుమారై అధికార దుర్వినియోగం జరుగుతుందని తీవ్రంగా మండిపడ్డారు. అధికారం అనేది వ్యవస్థ బాగు కోసం, అలసటలేని నిరంతరంగా పనిచేయగల సమర్థవంతమైన పదవీ. కాకతీయ యూనివర్సిటీ 50 సంవత్సరాల సుదీర్ఘకాలంలో ఎక్కడా లేని ఓఎస్డీ పదవీ ఒకటి పుట్టించి అదే సామాజిక వర్గానికి చెందిన వెంకట్రామిరెడ్డికి ఓఎస్డీ పదవి కట్టబెట్టడంలో విశ్వవిద్యాలయ సామాజిక న్యాయం అణచివేయబడిందని, కేవలం విశ్వవిద్యాలయాన్ని నాశనం చేస్తూ రెడ్డి సామాజికవర్గం ఆధిపత్యం చెలాయించడానికి అవకాశవాద రాజకీయాలు ఉన్నతవిద్యలో కొనసాగిస్తున్నట్లుగా మేధావులు, విద్యావేత్తలు మండిపడుతున్నారు. లేని పోస్టు కొత్తగా ఓఎస్డీగా క్రియేట్ చేసి వెంకట్రామిరెడ్డి వీసీ, రిజిస్ట్రార్ నుంచి ఉత్తర్వులు అందుకున్నారు.
అత్యంత ఉన్నత పదవుల్లో రెడ్డీలు..
కేయూలో అత్యంత ఉన్నత పదవిలో కొనసాగుతున్న వీసీ ప్రొఫెసర్ ప్రతాపరెడ్డి, నరసింహారెడ్డి, వెంకటరామిరెడ్డి, వాసుదేవరెడ్డి, మల్లికార్జున్‌రెడ్డి, రమణారెడ్డి, వేణుగోపాల్‌రెడ్డి, హరికృష్ణరెడ్డి, బి.రమారెడ్డి, సిహెచ్.రాధికరెడ్డి ఇంతమంది రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అధ్యాపకులు కేయూలో కొనసాగుతున్నారు. అత్యధిక పదవుల్లో కొనసాగుతూ విశ్వవిద్యాలయ ఆదాయాన్ని, విశ్వవిద్యాలయ భూములను, పరిశోధన, విద్యాబోధనలను సమూలంగా నాశనం చేస్తుంటే ప్రభుత్వాలకు, అధికారులకు చలనం లేకుండా విశ్వవిద్యాలయ నాశనాన్ని కోరుకుంటున్నట్లు తెలుస్తోంది. బీసీలను, వికలాంగులను, ఎస్టీలను, మైనార్టీలను దూరంచేస్తున్నారనే విమర్శలు లేకపోలేదు. వర్సిటీలో ఉన్నత పదవులు చేయడానికి చాలామంది ఉన్నా కేవలం రెడ్డిలకే కట్టబెట్టడంపై సర్వత్రా విమర్శలు గుప్పుమంటున్నాయి.