హైదరాబాద్, అక్టోబర్ 7 (నమస్తే తెలంగాణ): యాసంగిలో దొడ్డు ధాన్యం కొనుగోళ్లలో కేంద్రం చేతులెత్తేసిందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఈ సమస్యపై ఇటీవలే కేంద్ర మంత్రిని కలిసి మాట్లాడానని, కేంద్ర నిర్ణయం రాగానే రైతులు వేరే పంటలు వేసుకోవాలా? లేక ఇంకేం చేయాలన్నది చెప్తామన్నారు. గురువారం శాసనసభలో పల్లె ప్రగతిపై జరిగిన చర్చలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. సీఎం ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే..
ఎఫ్సీఐ పద్ధతి బాగోలేదు
మొన్న ఢిల్లీకి వెళ్లినప్పుడు రెండు రోజులు ఇదే విషయంపై కేంద్ర మంత్రితో మాట్లాడాను. ‘నేను చూస్తాను. మీరు వెళ్లండి రావు గారూ’.. అంటే ‘లేదు సార్.. రేపు కూడా ఇక్కడే ఉంటాను. అధికారులను పిలిపించి మాట్లాడండి..’ అని చెప్పిన. తెల్లారి కూడా అక్కడే ఉండి.. ఎఫ్సీఐ పద్ధతి బాగా లేదని, కేంద్రం కూడా పద్ధతి మార్చుకోవాలని చెప్పాం. ‘ఒక ఏడాదిలో మీరు ఎంత కొంటారో టార్గెట్ చెప్పండి.. దాని ప్రకారం మేం వస్తాం’ అని చెప్పాం. ‘మీరు చెప్పింది సరైందేనని’ అధికారులు కూడా అన్నారు. నా ముందే ఆ మంత్రిగారు కూడా ‘సంవత్సరం టార్గెట్ ఒకేసారి ఇవ్వండి’ అని అధికారులను ఆదేశించారు. వాళ్ల నిర్ణయాన్ని బట్టి ఏ పంటలు వేయాలే.. ఏది వేయొద్దు అని మన వ్యవసాయశాఖ మంత్రి నవంబర్ మొదటి వారంలో ప్రకటిస్తరు.
పోలీస్స్టేషన్లలో ఎరువులు అమ్మిన చరిత్ర మీది
రైతుల కల్లాలు కడుతున్నాం.. రైతు వేదికలు కడుతున్నాం.. మీ కాలంలో రైతు వేదికలు ఎక్కడివి? రైతులకు విత్తనాలు, ఎరువులు కూడా ఇవ్వలేదు. మీరా రైతుల గురించి, మద్దతు ధరల గురించి మాట్లాడేది? కరోనా కాలంలో కూడా మేం ఒక్క గింజ లేకుండా ధాన్యం కొనుగోలు చేశాం. ధాన్యం కొన్న తర్వాత ఎప్పుడో 15 రోజులకు డబ్బులు ఇచ్చుడు కాదు.. కొన్న వెంటనే రైతు బ్యాంకు ఖాతాల్లోకి డబ్బులు పడతయ్. మూడు కోట్ల టన్నుల వరిధాన్యాన్ని మా ప్రభుత్వమే కొనుగోలు చేసింది. మీరు పోలీస్ స్టేషన్లో పెట్టి మరీ ఎరువులు అమ్మించారు. గతంలో కరెంటు విషయంలో కూడా జోక్స్ ఉండేవి. కొత్తగా పెండ్లి చేసుకున్న పిలగాళ్లు ‘మేం బాయికాడ పండాలా? ఇంటికాడనా!’ అనేటోళ్లు. ఇవాళ కరెంటు, నీళ్లకు ఎలాంటి బాధ లేదు. భూగర్భ జలాలకు బాధ లేదు. ఎరువుల కొరత లేదు. కల్తీ విత్తనాల బెడద లేదు. పండిన ధాన్యం అమ్ముకునేందుకు కూడా బాధలేదు.
రైతుకు అప్పు చేసే అవసరం లేకుండా పోయింది…
ధాన్యం కొనుగోలు డబ్బులు వస్తున్నయ్. మరోవైపు రైతుబంధు డబ్బులు ఖాతాల్లో పడుతున్నయ్. దాంతో చాలామంది రైతులు అప్పులు తీసుకోవడం లేదు. కచ్చితంగా పట్టుబట్టి ఏం చేసైనా సరే, రాష్ట్రంలో వ్యవసాయ స్థిరీకరణ జరగాలి.. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టం కావాలని ఈ ప్రభుత్వం చేస్తున్నది. దాని ఫలితాలు ఇప్పుడు కనిపిస్తున్నాయి. రైతులను ఒకే దగ్గర సమావేశ పరిచేందుకు 2601 రైతు వేదికలను నిర్మించాం. రైతుబంధు ఇస్తున్నాం.. రైతుబీమా ఇస్తున్నాం.. ఎంత కావాలంటే అంత ఎరువులు ఇస్తున్నాం. కల్తీ విత్తనాలపై పీడీ యాక్ట్ తెచ్చి కఠినంగా వ్యవహరిస్తున్నాం. ఇన్ని చేస్తుంటే మేం ఏం చేయలేదని మాట్లాడుతున్నరు. ఇదేం న్యాయం?