ఆత్మకూరు, ఫిబ్రవరి 23: దిగుబడులు రాక.. చేసిన అప్పులు తీర్చే పరిస్థితి లేక తీవ్రమనస్తాపానికి గురయ్యాడు ఓ రైతు. ఈ క్రమంలో ఒత్తిడికి గురైన ఆయన ఆదివారం గుండెపోటుతో మరణించాడు. ఈ విషాదకర ఘటన హనుమకొండ జిల్లాలో చోటుచేసుకున్నది. స్థానికులు, కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆత్మకూరు మండలం అక్కంపేటకు చెందిన రైతు కడుదల విజేందర్ (36)కు రెండెకరాల వ్యవసాయ భూమి ఉన్నది.
అందులో పత్తి, మక్కజొన్న వేశాడు. పెట్టుబడి కోసం రూ.4 లక్షల అప్పు చేశాడు. పంట దిగుబడి రాకపోవడంతో విజేందర్ మనస్తాపానికి గురయ్యాడు. ఈ క్రమంలో ఆదివారం ఒక్కసారిగా ఛాతిలో నొప్పి వస్తుందని చెప్పడంతో చికిత్స నిమిత్తం కుటుంబసభ్యులు ఎంజీఎం దవాఖానకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కూతుర్లు ఉన్నారు.