యాదాద్రి భువనగిరి : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ( Congress Government ) అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు రైతులు పడుతున్న బాధలు అన్నీ ఇన్ని కావు. నారు వేసినప్పటి నుంచి పంట ఇంటి కొచ్చేంత వరకు అడుగడుగునా కష్టాలే.
ప్రభుత్వానికి ముందుచూపు లేకపోవడం వల్ల రైతుల ఇబ్బందులు నానాటికి పెరిగి పోతున్నాయి. ప్రభుత్వ నిర్లక్షాన్ని నిరసిస్తూ ఓ రైతు తోపుడు బండిపై ధాన్యం తరలించి వినూత్న నిరసన ( Innovative Protest ) తెలిపారు.
లారీల కొరతతో ధాన్యం కొనుగోలు నిలిచిపోవడంతో కందాడి మహిపాల్ రెడ్డి( Mahipal reddy ) అనే రైతు ఆలేరు మండలం కొలనుపాక నుంచి ఆలేరు మార్కెట్ యార్డుకు కాలికి చెప్పులు లేకుండా ధాన్యాన్ని తోపుడు బండిపై తరలించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశాడు.
‘ రైతు గుండె రగులుతోంది.. రేవంత్ సీట్ కదులుతోంది’ ‘ రైతు కన్నీటి శాపం.. కాంగ్రెస్ ప్రభుత్వానికి వినాశనం’ అంటూ తోపుడు బండీపై ప్లకార్డులు ప్రదర్శించాడు. ‘ కుర్చీ దిగుతావా.. కొనుగోలు చేస్తావా..తేల్చుకో రేవంత్ రెడ్డి’ ‘ రైతు పాలిట యముడు ’ అంటూ బండిపై నినాదాలతో మార్కెట్‌యార్డుకు తరలించి నిరసన తెలిపాడు.