యాచారం, ఫిబ్రవరి 3: పరిహారం తేల్చేవరకు అసైన్డ్ భూములను తీసుకోవద్దని రైతులు, గ్రామస్తులు ఆందోళనకు దిగారు. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం కొత్తపల్లి చౌరస్తా వద్ద రైతులు, గ్రామస్తులు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కొత్తపల్లిలో ఇటీవల సర్వే చేసిన 1800 ఎకరాల అసైన్డ్ భూములకు ఫెన్సింగ్ వేసేందుకు రెవెన్యూ, టీజీఐఐసీ అధికారులు సిబ్బందితో కలిసి మంగళవారం వెళ్లారు.
గ్రామంలోని 400 మంది రైతులకు చెందిన 1800 ఎకరాలను ఆర్ఐ మురళీకృష్ణ ఆధ్వర్యంలో రెవెన్యూ అధికారులు సర్వే చేసిన విషయం తెలిసిందే.. ఈ భూములకు ఫెన్సింగ్ వేసే పనుల్లో భాగంగా గుంతలు తీస్తుండగా రైతులు అడ్డుకున్నారు.