నమస్తే తెలంగాణ నెట్వర్క్, మే 26 : అకాల వర్షానికి అన్నదాత ఆగమయ్యాడు. ఆరుగాలం కష్టించి పండించిన పంట నీటిపాలైంది. కొనుగోళ్లలో నిర్లక్ష్యం, లారీలు, హమాలీ, గన్నీ బ్యాగుల కొరతతో ధాన్యం తడిసింది. మంగళవారం రాత్రి 8 గంటల తర్వాత కరీంనగర్ జిల్లా కేంద్రంలోని పలుచోట్ల ఈదురుగాలులతో వాన పడగా, రైతులు ధాన్యాన్ని కాపాడుకునేందుకు ఇబ్బందులు పడ్డారు. కరీంనగర్ వ్యవసాయ మార్కెట్లో ఎక్కడిక్కడ ధాన్యం తడిసిపోగా, రైతులు కంటతడి పెట్టారు. ఓ వైపు కరెంట్ లేకపోవడం, మరోవైపు చీకట్లు కమ్ముకోవడంతో సెల్ఫోన్ లైట్ల వెలుతురులో కొట్టుకుపోయిన వడ్లను ఎత్తుకోవాల్సి వచ్చింది.
కండ్లముందే ధాన్యం కొట్టుకుపోవడం రోదించారు. సోమవారం అర్ధరాత్రి యాదగిరిగుట్ట, భువనగిరి, తురపల్లి, బొమ్మలరామారం మండలాల్లో కురిసిన వర్షానికి కల్లాల్లో వడ్లు తడిసిపోయాయి. కల్లాల్లోకి నీరు చేరడంతో రైతులు చేతులతోనే ఎత్తిపోసిన పరిస్థితులు కనిపించాయి. వారాలు, నెలలు గడుస్తున్నా ధాన్యం కొనడం లేదని, ఫలితంగా వర్షాలకు తడస్తున్నదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం స్వర్ణ మంగళవారం రాత్రి కురిసిన వర్షానికి కొనుగోలు కేంద్రంలోని ధాన్యం తడిసింది.
తడిసిన పంటలను ప్రభుత్వం కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. పంటలను ప్రభుత్వం కొనుగోలు చేయకపోతే ఆత్మహత్యలే శరణ్యం అంటున్నారు. మంచిర్యాల జిల్లాలో మంగళవారం సాయంత్రం గాలివాన బీభత్సం సృష్టించింది. రైతులు ధాన్యం కుప్పలపై టార్పాలిన్లు కప్పారు. జన్నారం మండలం పొనకల్లో మంగళవారం మధ్యాహ్నం ఈదురుగాలులతో వర్షం పడింది. స్థానిక మార్కెట్యార్డుతోపాటు పొనకల్, అక్కపల్లిగూడలోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం బస్తాలు తడిసిపోయాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం లింగాలలో పిడుగు పడటంతో రైతు తిప్పారపు రాజు(32) మరణించాడు.