తెలంగాణ తల్లి విగ్రహ రూపురేఖలను కాంగ్రెస్ ప్రభుత్వం మార్చడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు మంగళ వారం రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ తల్లి విగ్రహాలకు ప్రజలు క్షీరాభిషేకాలు నిర్వహించారు. బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాంగ్రెస్ అవమానపర్చిందని, విగ్రహం రూపురేఖలను మార్చి అపచారం చేసిందని నేతలు ఆగ్రహం వ్యక్తంచేశారు.
హైదరాబాద్, డిసెంబర్ 10 (నమస్తే తెలంగాణ): తొమ్మిది మంది కవులు, కళాకారులను సన్మానించడమే కాకుండా వారికి ఇంటి స్థలం, రూ. కోటి ఇస్తామని ముఖ్యమంత్రి ప్రకటించడం సంతోషమే కానీ వారిలో ఒక్క మహిళ కూడా ఎందుకు లేరని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు. ‘విమలక, పీవోడబ్ల్యూ సంధ్య, మా భూమి సంధ్య, బెల్లి లలిత, మల్లు స్వరాజ్యం, సదాలక్ష్మి గుర్తుకు లేదా ? అంటూ నిలదీశారు. సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం పెట్టినందున మహిళలకు నెలకు రూ.2500 ఇవ్వరా?’ అని ప్రశ్నించారు. పార్టీ పిలుపు మేరకు మంగళవారం ఆమె వందల మంది కార్యకర్తలు, నాయకులతో కలిసి తెలంగాణ భవన్లో తెలంగాణ తల్లి విగ్రహానికి పంచామృతాలతో అభిషేకం చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ..
తెలంగాణ ఆత్మకు ప్రతీక అయిన తెలంగాణ తల్లి రూపాన్ని మార్చి రాష్ట్ర వారసత్వాన్ని రూపుమాపాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ అస్తిత్వాన్ని, వారసత్వాన్ని, ప్రజల భావోద్వేగాలను కేవలం జీవోతో మార్చలేరని తేల్చిచెప్పారు. తెలంగాణ తల్లి చేతిలో ఉన్న జొన్నలు, మకలు తెలంగాణకు ప్రతీక అనటాన్ని ఆక్షేపించారు. ఇతర రాష్ట్రాల్లోనూ అవి పండుతున్నప్పుడు ఈ కొత్త విగ్రహంలో ఏం ప్రత్యేకత ఉన్నదని ప్రశ్నించారు. ప్రపంచంలో మనకు మాత్రమే ప్రత్యేకమైన బతుకమ్మను తెలంగాణ తల్లి నుంచి దూరం చేశారని, ఆ స్థానంలో కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తును పెట్టి ఇదే తెలంగాణ తల్లి అనడం దారుణమని ధ్వజమెత్తారు.
‘బతుకమ్మను చేతిలో పట్టుకుని ఉన్న తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చి కాంగ్రెస్ తల్లిని పెట్టుకోవడం వల్ల ప్రజల మనసులు నొచ్చుకున్నాయి. సచివాలయంలో పెట్టిన కాంగ్రెస్ తల్లిని తిరసరిస్తున్నాం’ అని కవిత పేర్కొన్నారు. తెలంగాణలో ఉద్యమకారులతో పెట్టుకున్న ఎవ్వరూ బాగుపడలేదని, ఈ విషయాన్ని చంద్రబాబు నాయుడును అడిగి తెలుసుకోవాలని సీఎంకు సూచించారు.
ఆశా వరర్లకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆశా వరర్లను గౌరవంగా ప్రగతిభవన్‌కు పిలిపించి మాట్లాడి వారి వేతనాలను పెంచారని, ఇప్పుడు రేవంత్‌రెడ్డి వారిమీద దాష్టికం ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు. ఒక పక పేదతల్లి విగ్రహాన్ని పెట్టామని చెబుతున్న సీఎం రేవంత్‌రెడ్డి ఆశా వరర్ల మీద దౌర్జన్యం చేశారని ధ్వజమెత్తారు. కార్యక్రమంలో మాజీ మంత్రి కొప్పుల, మాజీ ఎమ్మెల్యే ఆనంద్, రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్లు అయాచితం శ్రీధర్, దేవీప్రసాద్, మేడే రాజీవ్‌సాగర్, పల్లె రవి, గెల్లు శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు.
సిద్దిపేటలో బతుకమ్మలతో నిరసన చేపడుతున్న మహిళలు, బీఆర్ఎస్ శ్రేణులు తదితరులు
కామారెడ్డి జిల్లా బాన్సువాడలో తెలంగాణ తల్లి విగ్రహానికి క్షీరాభిషేకం చేస్తున్న నిజామాబాద్ రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్
జనగామ జిల్లా దేవరుప్పుల మండలం సీతారాంపురంలో తెలంగాణ తల్లి విగ్రహానికి క్షీరాభిషేకం చేస్తున్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, స్థానిక నేతలు
మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో తెలంగాణ తల్లి చిత్రపటానికి క్షీరాభిషేకం చేస్తున్న మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, బీఆర్ఎస్ నాయకులు తదితరులు
మంచిర్యాలలో తెలంగాణ తల్లి విగ్రహానికి నమస్కరిస్తున్న దివాకర్‌రావు
కొత్తగూడెంలో తెలంగాణ తల్లి విగ్రహానికి క్షీరాభిషేకం చేస్తున్న మాజీమంత్రి వనమా
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేస్తున్న మాజీ మంత్రి జోగురామన్న, బీఆర్ఎస్ నాయకులు, మహిళలు
సూర్యాపేటలో తెలంగాణ తల్లి విగ్రహానికి క్షీరాభిషేకం చేస్తున్న మాజీ ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, బీఆర్ఎస్ నాయకులు తదితరులు
నారాయణపేట జిల్లా మక్తల్‌లో తెలంగాణ తల్లి ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేస్తున్న మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు తదితరులు
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని వన్ టౌన్ పోలీస్‌స్టేషన్ చౌరస్తాలో తెలంగాణ తల్లి ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేస్తున్న బీఆర్ఎస్ నాయకులు తదితరులు