హైదరాబాద్, మే 19 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో మూడు నెలల్లో సారా నిర్మూలనే లక్ష్యంగా ఎక్సైజ్ శాఖ ఆదివారం దాడులకు శ్రీకారం చుట్టింది. తొలిరోజే రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో రూ.లక్షలాది విలువైన సారా, బెల్లం పానకాన్ని ధ్వంసం చేశారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ఎక్సైజ్, ఎన్ ఫోర్స్మెంట్ యంత్రాంగం ఆధ్వర్యంలో 24 గంటల్లోనే రూ.25 లక్షల విలువైన సారా, వాహనాలు, సెల్ఫోన్లను స్వాధీనం చేసుకొని, పలువురిని అదుపులోకి తీసుకున్నారు.
మహారాష్ట్రలోని లాతూర్ నుంచి నాగర్‌కర్నూల్ జిల్లా తెలకపల్లికి అక్రమంగా తరలివస్తున్న రూ.5 లక్షల విలువైన బెల్లంతోపాటు రూ.10 లక్షల విలువ చేసే వాహనాలను వారు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ నుంచి వనపర్తి జిల్లాలోని కల్వకుర్తి, కొల్లాపూర్ ప్రాంతాలకు అక్రమంగా తరలివెళ్తున్న బెల్లం, రెండు వాహనాలను, సెల్‌ఫోన్లనూ స్వాధీనం చేసుకొని ఇద్దరిని అరెస్టు చేశారు.
వీటి విలువ రూ.10.83 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. ఇంకా వరంగల్, భద్రాద్రి కొత్తగూడెం, భూపాలపల్లి జిల్లాల్లోనూ ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించారు. ఆయా దాడుల్లో పాల్గొన్న అధికారులు, సిబ్బందిని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కమలాసన్‌రెడ్డి అభినందించారు. ఇదే తీరులో అన్ని జిల్లాల్లో వచ్చే మూడు నెలల్లో సారాను అంతం చేసి లక్ష్యాన్ని చేరుకోవాలని పిలుపునిచ్చారు.