హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 5 (నమస్తే తెలంగాణ): ఆలయాల నిర్వహణ, భక్తులకు సౌకర్యాల కల్పన బాధ్యతను నిర్వహించాల్సిన దేవాదాయ, ధర్మాదాయశాఖలో పరిపాలన విచిత్రంగా తయారైందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హైదరాబాద్ బొగ్గులకుంటలోని ప్రధాన కార్యాలయ అధికారులు నిర్లక్ష్యం, ఆశ్రిత పక్షపాతంతో పనులను గాలికి వదిలేశారని ఆరోపణలు తీవ్రమవుతున్నాయి. దేవాదాయశాఖ కమిషనర్లను పదేపదే మార్చడం, ఇన్చార్జులుగా వస్తున్నవారు పట్టనట్టు వ్యవహరించడంతో పాలనావ్యవహారాలు అటకెక్కుతున్నాయని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఉత్తర తెలంగాణలోని ప్రముఖ దేవస్థానంలో పందిళ్ల ఏర్పాటు టెండర్లకు కమిషనర్ కార్యాలయం నుంచి అనుమతులు రాలేదు. ఈ లోపు అలయ అధికారులే పందిళ్లు వేయించారు. కానీ కాంట్రాక్టర్లకు ఎంత మొత్తం డబ్బులు ఇవ్వాలో తెలియక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. కాంట్రాక్టర్లకు డబ్బులు చెల్లించిన తర్వాత తేడాలొస్తే ఎలా అని అధికారులు మాట్లాడుకుంటున్నారు. ఉన్నతాధికారుల నుంచి అనుమతులు రాలేదని, వచ్చిన తర్వాత డబ్బులు చెల్లిస్తామని కాంట్రాక్టర్లకు ఆలయాల అధికారులు నచ్చచెప్పాల్సి వస్తున్నది. పనులు పూర్తయిన తర్వాత బిల్లులు జాప్యం చేయడమేంటని, న్యాయం కోసం కోర్టుకు పోతామని కొందరు కాంట్రాక్టర్లు అధికారులను బెదిరిస్తున్నట్టు సమాచారం. ప్రధాన కార్యాలయం నుంచి స్పష్టతలేక, కాంట్రాక్టర్లకు సమాధానం చెప్పలేక అధికారులు నలిగిపోతున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా 324 మంది మతపరమైన ఉద్యోగుల నియామకానికి దేవాదాయశాఖ నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు దేవాలయాల వారీగా నోటిఫికేషన్లు ఇవ్వాలంటూ ప్రధాన కార్యాలయం నుంచి ఆలయాల అధికారులకు ఆదేశాలు అందాయి. కానీ విధివిధానాలు స్పష్టంగా పేర్కొనలేదు. నామమాత్రంగా నియామకాలు చేసుకోవాలని చెప్పడంతో ఆలయ అధికారులు సందిగ్ధంలో పడ్డారు. ఒక దేవాలయంలో వయోపరిమితి 38 ఏండ్లుగా, మరో దేవాలయం 46 ఏండ్లుగా నోటిఫికేషన్లు ఇవ్వడంతో గందరగోళం నెలకొన్నది. దీంతో దేవాదాయశాఖ నుంచి మరోసారి 46 ఏండ్ల గరిష్ఠ పరిమితితో సర్క్యులర్ పంపగా కొన్ని ఆలయాలు రెండోసారి నోటిఫికేషన్ ఇవ్వాల్సి వచ్చిందని అధికారులు వాపోతున్నారు.
అంతేకాకుండా నోటిఫికేషన్ ఎప్పుడు ఇవ్వాలి, దరఖాస్తులు ఎప్పుడు ముగించాలి, రాతపరీక్షలు, ఇంటర్వ్యూలు ఉంటాయా అనే విషయాలపై ఆలయ అధికారులకు స్పష్టత లేదు. ఎవరి ఇష్టమొచ్చినట్టు నోటిఫికేషన్లు ఇచ్చారు. ఇప్పటికీ రాతపరీక్షలు, ఇంటర్వ్యూలపై స్పష్టత రాకపోవడంపై ఆలయ ఉద్యోగులు, అభ్యర్థుల్లో నియామక విధానం ఎలా ఉంటుందో అనే సందేహాలు నెలకొన్నాయి. వాస్తవానికి దేవాదాయశాఖ ప్రధాన కార్యాలయం నుంచి ఈ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ వెలువడాలి. అలా కాకుండా మొట్టమొదటిసారి ఆలయాల వారీగా నోటిఫికేషన్ ఇవ్వడం చర్చకు దారితీసింది.
దేవాదాయశాఖలో మూడువేలకుపైగానే దస్ర్తాలు పేరుకుపోయాయని ఉద్యోగులు చెప్తున్నారు. పాలనా వ్యవహారాలు చూసే అధికారులు, ఉద్యోగులపై కొత్తగా బాధ్యతలు తీసుకున్న కమిషనర్ హరీశ్ సీరియస్ అయ్యారని తెలిసింది. అసలు ఇన్ని ఫైల్స్ ఎందుకు పెండింగ్‌లో పెట్టారు? దేవాదాయ భూముల విషయంలోనూ స్పష్టత ఎందుకు లేదు? అని ప్రశ్నించారని సమాచారం. అంతేకాకుండా ప్రమోషన్లు, బదిలీల విషయంలో ఎందుకు తాత్సారం చేశారు? అని ప్రశ్నించగా అధికారులు నీళ్లు నమిలినట్టు తెలిసింది. దీంతో కమిషనర్ హరీశ్ తీవ్ర అసహనం వ్యక్తంచేసినట్టు సమాచారం. పెండింగ్ ఫైల్స్ అన్నింటిని నెలలోపు కొలిక్కి తీసుకురావాలని, ఉద్యోగులు, భక్తులను ఇబ్బందులు పెట్టవద్దని చెప్పినట్టు తెలిసింది. ఇప్పటికైనా ఫైల్స్ క్లియర్ చేస్తూ, స్పష్టమైన పాలన అందించాలని ఆలయాల అధికారులు కోరుతున్నారు.
సిద్దిపేట జిల్లాలోని ఓ ప్రముఖ దేవస్థానంలో తలనీలాల టెండర్‌కు నిరుడు నవంబర్ 1 నుంచి ఈ ఏడాది అక్టోబర్ 31 వరకు కాలపరిమితి ఉన్నది. సదరు కాంట్రాక్టర్ రూ.62.37 లక్షలకు టెండర్ దక్కించుకున్నారు. ఈ టెండర్ అప్రూవల్ కోసం దేవాలయ అధికారులు ఆ శాఖ కమిషనర్‌కు ప్రతిపాదనలు పంపారు. ఒకట్రెండు నెలల్లోనే కమిషనర్ నుంచి అప్రూవల్ రావాలి. కానీ పాత టెండర్ కాలపరిమితి ముగిసి, కొత్త టెండర్లు పిలువాల్సిన సమయంలో ఈ సంవత్సరం నవంబర్ 22న కమిషనర్ కార్యాలయం నుంచి ఆమోదం లభించింది. మరీ ఇంత అలసత్వమా అని ఉద్యోగులతోపాటు కాంట్రాక్టర్లు విస్మయం వ్యక్తంచేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆలయాలోన్లి టెండర్లలో ఇదే పరిస్థితి కొనసాగుతున్నది.