Congress Govt | హైదరాబాద్, మే 17 (నమస్తే తెలంగాణ): అయితే మంత్రివర్గ ఉపసంఘం! లేదంటే అధికారుల కమిటీ! ఇంకొంచెం ముందుకెళ్తే అధికారులు, ప్రజాప్రతినిధుల మేళవింపుతో మరో అత్యున్నత స్థాయి కమిటీ! ఇలా కమిటీ వెయ్… సాగదియ్! అన్నట్టుగా ఉన్నది రాష్ట్ర ప్రభుత్వ తీరు! ఉద్యోగ సంఘాల డిమాండ్లపై ప్రతిసారీ ఏదో ఒక కమిటీని సర్కారు ముందుకు తెచ్చి సాగదీస్తున్నది. తమ డిమాండ్లు నెరవేరకపోవడంతో ఉద్యోగ సంఘాల జేఏసీ కార్యాచరణ ప్రకటించడం.. సర్కారు చర్చలు జరపడం.. సమస్యలు వినడం.. కమిటీ వేయడం.. ఈ కమిటీకి సమస్యలు చెప్పుకోమనడం.. తీరా కాలయాపన చేయడం సర్వసాధారణమైంది.
సీనియర్ అధికారులతో త్రిసభ్య కమిటీతో కలిపి 17 నెలల్లో ఉద్యోగ సంఘాల డిమాండ్లపై సర్కారు మూడు కమిటీలు వేసింది. త్రిసభ్య కమిటీ వేసినా జేఏసీ డిమాండ్లు పరిష్కారమయ్యేలా కనిపించడంలేదు. ఈ కమిటీకిచ్చిన వారం రోజుల గడువు ముగిసింది. ఈ మంగళవారం వస్తే పక్షం రోజులవుతున్నది. కానీ కమిటీ ఇంకా నివేదికను సర్కారుకు అందజేయలేదు. మరో రెండురోజుల్లో జేఏసీతో ఈ కమిటీ మరోసారి చర్చలు జరపనున్నది. దీంతో మళ్లీ సాగదీతేనా? కాలయాపనేనా? అని ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు విస్మయం వ్యక్తంచేస్తున్నారు.
తమ సమస్యలు, డిమాండ్లను పరిష్కరించకపోవడంతో పాటు సర్కారు తమను తీవ్రంగా అవమానిస్తుండటంతో ఉద్యోగ సంఘాల నేతలు రగిలిపోతున్నారు. ప్రజా ప్రభుత్వంలో తమకు ఎదురవుతున్న అవమానాలను తలుచుకొని కుమిలిపోతున్నారు. ‘మా డిమాండ్ల సాధనకు ఎక్కని ఆఫీసులేదు.. తొక్కని గడపలేదు. ప్రభుత్వాన్ని కలిసేందుకు మాకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వడంలేదు. చర్చలకు ఆహ్వానించలేదు. సావధానంగా కూర్చోబెట్టి మాతో చర్చించిన, మాట్లాడిన దాఖలాల్లేవు. అసలు ఈ రాష్ట్రంలో ఉద్యోగులు, ఉద్యోగ సంఘాలకు గౌరవమే దక్కడంలేదు. సంఘాలకు కనీస గుర్తింపునివ్వడంలేదు. ఉద్యోగులుగా మేము పోరాటం చేయాల్సి రావడం బాధాకరం’ అంటూ ఓ ఉద్యోగ సంఘం నేత వాపోయారంటే పరిస్థితి ఎలా ఉన్నదో అర్థం చేసుకోవచ్చు. ‘మేం ఉద్యోగులకు నచ్చజెప్పలేకపోతున్నం.
ఉద్యోగ సంఘాలు ప్రభుత్వంతో రాజీ పడ్డాయని ఉద్యోగులు మమ్మల్ని నిందిస్తున్నరు. ఏ జిల్లా కలెక్టర్ కూడా ఉద్యోగ సంఘాలతో ఒక్కసారి కూడా సమావేశం కాలేదు. సమస్యలను పరిష్కరించలేదు. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ ఏర్పాటు చేయాలని జీఏడీలో ఇప్పటివరకు వందసార్లు వినతిపత్రాలిచ్చినం. ఆఫీసర్ల కమిటీ వేయాలని సీఎస్ వద్దకు దాదాపు 20 సార్లు వెళ్లినం. ముఖ్యమైన సమస్యలను మంత్రులు, అధికారులు పరిష్కరించకపోతే మాకెవరు దిక్కు’ అంటూ మరో నేత అసంతృప్తి వెళ్లగక్కారు. అయినా సర్కారు ఉద్యోగ సంఘాలను ఖాతరు చేయడం లేదు. పైగా పలుమార్లు తీవ్రంగా అవమానించింది.