హైదరాబాద్, డిసెంబర్ 29(నమస్తే తెలంగాణ) : పురపోరుకు రంగం సిద్ధమైంది. రాష్ట్రంలోని 98శాతం మున్సిపల్ పాలకవర్గాల పదవీ కాలం ముగియడంతో ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సం ఘం సమాయత్తమైంది. ఈ మేరకు రాష్ట్రంలోని 117 మున్సిపాలిటీలు, ఆరు మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించి వార్డులవారీగా ఓటర్ల జాబితాను సిద్ధం చేసేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణికుముదిని సోమవారం షెడ్యూల్ విడుదల చేశారు. అసెంబ్లీ నియోజకవర్గాల ఓటర్ల జాబితా(01.10.2025 అర్హత తేదీ) ఆధారంగా జాబితాను రూపొందించాలని స్పష్టంచేశారు. మున్సిపాలిటీల్లోని వార్డులవారీగా ఫొటోలతో కూడిన ఓటర్ల జాబితాను సిద్ధం చేసే బాధ్యతను కమిషనర్లకు అప్పగిస్తూ ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. జనవరి 10న తుది జాబితా ప్రకటించే దిశగా కార్యాచరణ సిద్ధమైంది.
డిసెంబర్ 30-31: కేంద్ర ఎన్నికల సంఘం డాటా ఆధారంగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో వార్డులవారీగా ఓటర్ల వివరాల పునర్వ్యవస్థీకరణ
జనవరి 1, 2026: ముసాయిదా జాబి తా ప్రదర్శన, అభ్యంతరాల స్వీకరణ
జనవరి 5, 6 : కమిషనర్లు, జిల్లా ఎన్ని కల అధికారులతో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం.
జనవరి 10 : తుది జాబితా ప్రచురణ.
డెడికేషన్ కమిషన్ ఇచ్చిన కులగణన లెక్కల ప్రకారం బీసీల రిజర్వేషన్లు, 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్ల కేటాయింపుపై కసరత్తు చేస్తున్నారు. జీహెచ్ఎంసీ, ఖమ్మం, వరంగల్ మినహా అన్ని కార్పొరేషన్ల పాలకవర్గాల గడువు ముగిసింది. సిద్దిపేట, జడ్చర్ల, నకిరేకల్, కొత్తూరు, అచ్చంపేట మినహా మిగతా మున్సిపాలిటీల గడువు కూడా తీరింది. ఇవి మినహా మిగతా పురపాలికలకు తక్షణమే ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్నది. ఓఆర్ఆర్ పరిధిలోని 27 మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో విలీనం చేశా రు. ఇందులో జీహెచ్ఎంసీకి వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు గడువు ఉన్నది.
మున్సిపల్ ఎన్నికలకు సిద్ధంగా ఉన్నట్టు పురపాలక పట్టణాభివృద్ధిశాఖ కమిషనర్ శ్రీదేవి ప్రభుత్వానికి లేఖ రాశారు. పురపాలకశాఖ కార్యదర్శికి ఆమె రెండ్రోజుల క్రితం లేఖ రాశారు. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో వార్డుల డీలిమిటేషన్ ప్రక్రియ ఇప్పటికే మొదలైందని, వచ్చే నెల 9వరకు పూర్తవుతుందని తెలిపారు.
రాష్ట్రంలోని అన్ రిజిస్టర్డ్, అన్ రికగ్నైజ్డ్ రాజకీయ పార్టీలు విరాళాలు, ఎన్నికల ఖ ర్చుల పత్రాలను నిర్ణయించిన గడువులో పు సమర్పించాలని రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ సీ సుదర్శన్‌రెడ్డి ఆదేశించారు.
