ఉస్మానియా యూనివర్సిటీ, నవంబర్ 13: రైతుల భూమిని అక్రమంగా సేకరించేందుకు ప్రయత్నిస్తున్న అధికారులను అడ్డుకున్నందుకు 16మంది రైతులతో సహా మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డిని అరెస్టు చేయటంపై నిరసనలు వెల్లువెత్తాయి. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ఆవరణలో సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను బుధవారం బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో దహనం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థి నాయకులు మాట్లాడుతూ ఫార్మా సిటీ కోసం కేసీఆర్ సర్కారు సేకరించిన 12 వేల ఎకరాలు సిద్ధంగా ఉన్నప్పటికీ, వాటిని కాదని తన అల్లుడి కోసం రేవంత్ ఫార్మాక్లస్టర్‌ల పేరిట రైతుల భూములను గుంజుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. అల్లుడి కంపెనీ కోసం ప్రజలపై లాఠీచార్జి చేసి జైలుకు పంపుతున్నారని దుయ్యబట్టారు. దీనికి లగచర్ల ఘటనే ప్రత్యక్ష నిదర్శనమని పేర్కొన్నారు. అక్రమంగా అరెస్టు చేసిన రైతులు, మాజీ ఎమ్మెల్యేను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.