హైదరాబాద్; మార్చి 26 (నమస్తేతెలంగాణ ) : ఈ 15 నెలల కాంగ్రెస్ ప్రభుత్వ పాలనా కాలంలో విద్యారంగం దివాలా తీసిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. ఈ రంగంపై కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయం చేయడం ఆ పార్టీ దివాలాకోరుతనాన్ని నిరూపించుకున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యారంగంపై కాంగ్రెస్ సర్కార్ చిన్నచూపు ఎందుకని నిలదీశారు. బుధవా రం శాసనమండలిలో విద్యారంగంపై జరిగిన స్వల్పకాలిక చర్చలో ఆమె పలు అంశాలను లేవనెత్తారు. 15 నెలల్లోనే 1,913 సూళ్లను మూసేశారని, 84 మంది బిడ్డలను ఈ సర్కా రు కాటికి పంపిందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటినుంచి రూ.8 వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయని, రూ.1.50 లక్షల కోట్ల అప్పులు చేసి బడా కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించే ఈ ప్రభుత్వానికి పేదపిల్లల బకాయిలు చెల్లించేందుకు ఎందుకు మనసు రావడం లేదని ప్రశ్నించారు.
యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న 1,050 టీచింగ్ పోస్టులను బీఆర్ఎస్ ప్రభు త్వం నోటిఫై చేసిందని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 15 నెలలైనా వాటి భర్తీకి ఎందుకు నోటిఫికేషన్ ఇవ్వలేదో చెప్పాలని నిలదీశారు. కాంగ్రెస్‌ను గెలిపిస్తే 25 వేల పోస్టులతో మెగా డీఎస్సీ వేస్తామన్న కాంగ్రెసస్ మోసం చేసిందని, ఆ హామీని ఎప్పుడు నిలబెట్టుకుంటుందో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం 58 ఇంటిగ్రేటెడ్ సూళ్ల నిర్మాణానికి అనుమతులు ఇస్తే, అందులో ఒక ఆసిఫాబాద్ మాత్రమే బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గమని, దీనికి కాంగ్రెస్ ఏం సమాధానం చెప్తుందని నిలదీశారు. రాష్ట్ర విద్యా కమిషన్ రాజకీయ కమిషన్లా వ్యవహరించడం ఏమిటని ప్రశ్నించారు. గత తొమ్మిదిన్నరేండ్లలో విద్యావ్యవస్థ నాశనమైందని కమిషన్ ఏ ప్రాతిపదికన చెప్తుందని నిలదీశారు. కాంగ్రెస్ ప్రభుత్వం తన 15 నెలల పాలనలో విద్యారంగానికి చేసింది శూన్యం అని విమర్శించారు. కానీ, తెలంగాణ ఏర్పడిన వెంటనే రాష్ట్రంలో విద్యావికాసం కోసం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పునాది వేశారని, వందలాది గురుకులాలను, ప్రభుత్వ పాఠశాలలను కొత్తగా తెరిచి లక్షలాది మందిని విద్యావంతులుగా తీర్చిదిద్దారని కొనియాడారు.
రాష్ట్ర అసెంబ్లీ ఆవరణంలో మహాత్మా జ్యోతిరావు ఫూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌ను కోరారు. ఈ మేరకు బుధవారం యూనైటెడ్ ఫూలే ఫ్రంట్, తెలంగాణ జాగృతి, బీసీ సంఘాల నాయకులతో కలిసి ఆమె స్పీకర్‌కు వినతిపత్రం అందచేశారు. ఫూలే జయంతిరోజన ఏప్రిల్ 11లోగా విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వివేకానందగౌడ్, కాలేరు వెంకటేశ్, మర్రి రాజశేఖర్‌రెడ్డి, బండారు లక్ష్మారెడ్డి, జాగృతి నాయకుడు శ్రీధర్‌రావు, యునైటెడ్ ఫూలే ఫ్రంట్ కో కన్వీనర్ బొల్ల శివశంకర్, నాయకులు ఆలకుంట హరి, కొట్టాల యాదగిరి, ఆర్వీ మహేందర్, కుమారస్వామి, విజయేందర్ సాగర్, బాలకృష్ణ రాచమల్ల పాల్గొన్నారు.