Telangana | హైదరాబాద్, సెప్టెంబర్ 10 (నమస్తే తెలంగాణ): కాంపొజిట్ స్కూల్ గ్రాంట్. పాఠశాలల్లో చాక్‌పీసులు, డస్టర్లు కొనాలన్నా.. ఇంటర్నెట్, విద్యుత్తు బిల్లులు చెల్లించాలన్నా .. పంద్రాగస్టుకో, జనవరి 26కో స్వీట్లు పంపిణీ చేయాలన్నా ఈ నిధులే ఆధారం. ఇలాంటి స్కూల్ గ్రాంట్ నిధులు ఇంతవరకు మంజూరు కాలేదు. విద్యాసంవత్సరం ప్రారంభమై నాలుగు నెలలు గడుస్తున్నా సర్కారు ఒక్క రూపాయి విదిల్చలేదు. దీంతో టీచర్లే తలా కొంత వేసుకుని.. జేబు నుంచి ఖర్చుచేయాల్సిన పరిస్థితి నెలకొన్నది. దీంతో టీచర్లంతా సర్కారు తీరుపై భగ్గుమంటున్నారు.
గత సర్కారు జూలైలోనే 50శాతం నిధులను విడుదల చేసింది. కానిప్పుడు ఇంకా నిధులు విడుదల కాకపోవడంతో పాఠశాల నిర్వహణ అధ్వానంగా తయారైంది. స్కూల్ గ్రాంట్ నిధుల్లో నుంచి విద్యుత్తు బిల్లులు చెల్లించేవారు. అయితే ఇటీవలే సర్కారు విద్యాసంస్థలకు ఉచిత విద్యుత్తును ప్రకటించింది. దీంతో స్కూల్ గ్రాంట్‌గా ఇచ్చే నిధుల్లో కొంతమేర కోతలు పెట్టే ప్రతిపాదనలు విద్యాశాఖ పరిశీలనలో ఉన్నాయి. ఇదే జరిగితే ఒక్కో స్కూల్‌కు రూ.3 నుంచి నాలుగు వేలు కోతపడనున్నది. ఒక్క స్కూల్ గ్రాంటే కాకుండా పారిశుద్ధ్య నిధులు, ఇతర గ్రాంట్లను కూడా ప్రభుత్వం విడుదల చేయడంలేదు.
పాఠశాలల్లో పారిశుద్ధ్య నిర్వహణకు కేటాయించిన నిధులను విడుదల చేయాలని తెలంగాణ గెజిటెడ్ హెడ్మాస్టర్స్ అసోసియేషన్ (టీఎస్‌జీహెచ్‌ఎంఏ) ప్రభుత్వాన్ని కోరింది. ఇప్పటివరకు పారిశుధ్య నిధులింకా విడుదలకాలేదని, తక్షణమే ఈ నిధులను అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలకు అందేలా చూడాలని అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రాజభాను చంద్రప్రకాశ్, ప్రధాన కార్యదర్శి రాజుగంగారెడ్డి, కోశాధికారి బీ తుకారాం ప్రభుత్వాన్ని కోరారు. మంగళవారం పాఠశాల విద్యాశాఖ అధికారులను కలిసి వినతిపత్రాన్ని సమర్పించారు. నిధుల వినియోగానికి సంబంధించిన మార్గదర్శకాలను, ఎప్పటినుంచి ఈ నిధులను వినియోగించుకోవాలో స్పష్టంచేయాలని ప్రభుత్వాన్ని కోరారు.