హైదరాబాద్, జూలై 16 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్స్ విడుదల చేయాలని డీవైఎఫ్ఐ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. స్థానిక ఎన్నికలలోపే నోటిఫికేషన్స్ జారీ చేయకపోతే ఉద్యమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించింది. బుధవారం హైదరాబాద్‌లో జరిగిన రౌండ్‌టేబుల్ సమావేశంలో డీవైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు కోట రమేశ్, కార్యదర్శి ఆనగంటి వెంకటేశ్ మాట్లాడుతూ ఎన్నికల ముందు నిరుద్యోగులకు కాంగ్రెస్ ఇచ్చిన ఉద్యోగ కల్పన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణలోని యాభై లక్షల మంది నిరుద్యోగుల ఓట్లతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని తెలిపారు.
మొదటి ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పిందని గుర్తుచేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ల ద్వారా మాత్రమే కాంగ్రెస్ సర్కార్ 55,424 ఉద్యోగాలను భర్తీ చేసిందని చెప్పారు. మిగతా లక్షా యాభై వేల ఉద్యోగాల సంగతి ఎందుకు ప్రస్తావించడంలేదని ప్రశ్నించారు.
తుంగతుర్తి సభలో సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ రెండేండ్లలో రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని ప్రకటించడం నిరుద్యోగ యువతను మోసం చేయడమేనని ధ్వజమెత్తారు. సమావేశంలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పీ లక్ష్మణ్, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి డీ కిరణ్, పీడీఎస్‌యూ నాయకులు మహేశ్, నాగరాజు, నిరుద్యోగ జేఏసీ నాయకులు పాల్గొన్నారు.