హైదరాబాద్, సెప్టెంబర్ 24 (నమస్తే తెలంగాణ): చేపపిల్లల పంపిణీ జోరుగా సాగుతున్నది. ఇప్పటికే అన్ని జిల్లాలో పంపిణీ ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 10 కోట్ల చేప పిల్లలను చెరువులు, కుంటలు, రిజర్వాయర్లలో విడుదల చేశారు. అత్యధికంగా మెదక్ జిల్లాలో 1.34 కోట్లు, మేడ్చల్ జిల్లాలో 1.12 కోట్ల చేప పిల్లలను పంపిణీ చేశారు. ప్రతి జిల్లాలోనూ సంబంధిత మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు చేపల పిల్లల పంపిణీ కార్యక్రమానికి హాజరై పండుగలా నిర్వహిస్తున్నారు. మత్తళ్లు దుంకుతున్న చెరువులు, కుంటల్లో చేపపిల్లలను ఆలస్యంగా విడుదల చేస్తున్నారు. మత్తడి సమయంలో చేపలు వేస్తే నీటితో పాటే వెళ్లిపోయే అవకాశం ఉండడంతో అధికారులు ఈ మేరకు చర్యలు తీసుకుంటున్నారు. మత్తడి దుంకడం ఆగగానే యథావిధిగా చేపపిల్లల్ని విడుదల చేస్తున్నారు. ఈ ఏడాది రూ. 68 కోట్లతో 88 కోట్ల చేపపిల్లల్ని, రూ.25 కోట్లతో 10 కోట్ల రొయ్య పిల్లల్ని విడుదల చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది.