హనుమకొండ సబర్బన్, ఏప్రిల్ 6 : నమ్ముకున్న దేవాదుల ప్రాజెక్టు నట్టేట ముంచింది. ప్రణాళిక లేని సర్కార్ తీరుతో అన్నదాతలు ఆగమై పోతున్నారు. ఏపుగా పెరిగి మంచి దిగుబడి ఖాయం అనుకున్న దశలో ఒక్కసారిగా పడిపోయిన భూగర్భ జలాలకు తోడు, ప్రాజెక్టు నీళ్లు రాకపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. హనుమకొండ జిల్లాలోని కాకతీయ కాల్వ ఆయకట్టు రైతులు అటో ఇటో బయట పడే పరిస్థితి ఉన్నా, దేవాదుల ఆయకట్టు రైతులు మాత్రం తీవ్ర నష్టానికి గురయ్యారు. ఈ యాసంగిలో జిల్లాలో 1.18 లక్షల ఎకరాల్లో వరి, 55 వేల ఎకరాల్లో మక్కజొన్న వేశారు. మొత్తం 14 మండలాల్లో కమలాపూర్, నడికుడ, పరకాల, శాయంపేట, ఆత్మకూరు, దామెర మండలాలు పూర్తిగా, ఎల్కతుర్తి, హసన్పర్తి, హనుమకొండ మండలాలు సగం వరకు కాకతీయ కాల్వ పరిధిలో ఉన్నాయి.
మిగతా ధర్మసాగర్, ఐనవోలు, ఖాజీపేట, భీమదేవరపల్లి, వేలేరు పూర్తిగా, ఎల్కతుర్తి, హసన్పర్తి మండలాలు కొంత మేరకు దేవాదుల ఆయకట్టు పరిధిలో ఉంటాయి. ఏటా దేవాదుల నీళ్లు క్రమం తప్పకుండా వచ్చేవి. దీనికితోడు భూగర్భ జలాలు కూడా ఎక్కువగానే ఉండేవి. రెండు వనరులు ఉండటంతో రైతులు ఎలాంటి ఇబ్బంది లేకుండా పంటలు పండించుకునే వారు. ఈ సారి ఇందుకు భిన్నంగా దేవాదుల నీరు రాలేదు.
ప్రభుత్వం నుంచి ఓఅండ్ఎం కాంట్రాక్టర్కు బిల్లులు చెల్లించకపోవడంతో మెయింటెనెన్స్ సిబ్బందికి వేతనాలు ఇవ్వలేదు. దీంతో ఏకంగా 37 రోజులపాటు దేవాదుల పంపులు నడువలేదు. ధర్మసాగర్ రిజర్వాయర్లో నీళ్లు లేకపోవడంతో ఆయకట్టుకు అధికారులు నీటిని విడుదల చేయలేదు. ఈ విషయం తెలియని రైతులు పూర్తిస్థాయిలో పంటలు వేసుకున్నారు. తీరా నీళ్లు రాకపోవడంతో ఇప్పుడు ఎండిన పొలాలను చూసి కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. వేసిన పంటలో సగం కూడా చేతికి వచ్చే పరిస్థితి లేకపోవడంతో పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదని ఆవేదన చెందుతున్నారు.
నేను 5 ఎకరాల్లో వరి వేసిన. నీళ్లు లేక రెండెకరాలు పూర్తిగా ఎండిపోయింది. మిగతాది కూడా చేతికొస్తుందనే ఆశ లేదు. కిలో మీటర్ దూరం నుంచి నీళ్లు కొనుగోలు చేసి రూ.70 వేలు ఖర్చు చేసి పైప్లైన్ వేసిన, నా పొలం దేవాదుల కాల్వ పక్కనే ఉన్నది. ఏటా తప్పకుండా నీళ్లు వచ్చేవి. నా బావి నీళ్లకు దేవాదుల నీళ్లు తోడయితే పంట పూర్తయ్యేది. ఈ సారి దేవాదుల పంపులు నడవక పోవడంతో నీళ్లు రాలేదు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరువే. మార్పు కావాలని కాంగ్రెస్ పార్టీకి ఓటేసినందుకు బాగ బుద్ధి చెప్పారు.
– ఇరిగేసి మహేందర్రావు, రైతు, గోపాల్పూర్, ఎల్కతుర్తి మండలం
నాకు ఇందిరానగర్ శివారులో 1.10 ఎకరాల పొలం ఉన్నది.బోరుతోపాటు దేవాదుల నీళ్లు రాకపోతయా అని వరి నాటు వేసిన. మొన్నటిదాక మంచగనే పారింది. పొట్ట దశనుంచి ఈనే దశ వరకు బోరు బాగానే పోసింది. తీరా పూర్తిగా ఈనగానే బోరు నీళ్లు తగ్గి పోయాయి. అయినా, దేవాదుల నీళ్లు వస్తాయనే ధీమా ఉండే. ఈ సారి దేవాదుల నీళ్లు రాలేదు. ధర్మసాగర్ రిజర్వాయర్ నుంచి కొన్ని రోజులే నీళ్లియ్యడంతో ప్రాజెక్టు మొదటగా ఉన్న గ్రామాల రైతులే వాడుకున్నారు. మా వరకు నీటి చుక్కకూడ రాలేదు. కాల్వల వెంట ఎన్నిసార్లు తిరిగినా నీళ్లు మాత్రం రాలేదు.
– పర్లపల్లి పృథ్వీరాజ్, రైతు, ఎల్కతుర్తి మండలం