Medigadda | హైదరాబాద్, మే11 (నమస్తే తెలంగాణ): కాళేశ్వరం ప్రాజెక్టులో కీలక మేడిగడ్డ బరాజ్‌ను డ్యామ్ కమ్ బరాజ్లానే డిజైన్ చేశామని, నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు ఉండవని న్యాయవిచారణ కమిషన్ చైర్మన్, జస్టిస్ పీసీ ఘోష్‌కు రామగుండం ఇరిగేషన్ సర్కిల్ రిటైర్డ్ ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు వివరించారు.
కాళేశ్వరం ప్రాజెక్టు క్షేత్రస్థాయి పరిశీలనకు వచ్చిన జస్టిస్ ఘోష్, సంబంధిత అధికారులతో వరుసగా భేటీ అవుతున్నారు. ప్రాజెక్టుపై సందేహాలు, సాంకేతిక వివరాలను అడిగి తెలుసుకుంటున్నారు. ఇందులో భాగంగా మూడో రోజు శనివారం రిటైర్డ్ ఈఎన్సీ వెంకటేశ్వర్లును పిలిపించుకొని పలు వివరాలు తెలుసుకున్నారు. బరాజ్ అని చెప్పి డ్యామ్లా నిర్మించారా? అది ముందే తెలుసా? దానివల్ల ఏమైనా సమస్యలు ఉన్నాయా? అని ఆరాతీసినట్లు తెలిసింది.
మేడిగడ్డ బరాజ్‌ను డ్యామ్ కమ్ బరాజ్లానే డిజైన్ చేశామని, నిర్వహణలో ఎలాంటి ఇబ్బందీ ఉండబోదని రిటైర్డ్ ఈఎన్సీ వెల్లడించినట్టు సమాచారం. రెండు రోజులుగా రాష్ట్రంలో పర్యటించిన ఘోష్ శనివారం తిరిగి వెళ్లిపోయారు. మళ్లీ ఈ నెల 25, 26 తేదీల్లో వస్తానని నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులకు చెప్పినట్టు తెలిసింది.