హైదరాబాద్, మార్చి 31 (నమస్తే తెలంగాణ): ఒకేసారి మూడునెలల రేషన్ బియ్యం పంపిణీ చేయనున్నట్టు పౌరసరఫరాల శాఖ తెలిపింది. బుధవారం నుంచి ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన బియ్యాన్ని పంపిణీ చేయనున్నట్టు పేర్కొన్నది. ఇందుకు సంబంధించి అవసరమైన బియ్యం స్టాక్‌ను రేషన్‌షాపులకు అలాట్ చేసినట్టు వెల్లడించింది.
రాష్ట్రంలో 1.05 కోట్ల రేషన్‌కార్డులు ఉండగా, 3.39 కోట్ల మంది లబ్ధిదారులు ఉన్నారని వివరించింది. వీరికి పంపిణీ కోసం ప్రతినెలా సుమారు 2లక్షల టన్నుల బియ్యం అవసరమవుతాయని, దీంతో మూడునెలలకు 6లక్షల టన్నుల సన్న బియ్యాన్ని అందుబాటులో ఉంచినట్టు పేర్కొన్నది.
కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ పంపిణీ చేస్తున్నట్టు తెలిపింది. కాగా, ప్రస్తుతం గోదాముల్లో బియ్యం నిండుగా ఉండటం, రాబోయే సీజన్లకు సంబంధించి ధాన్యాన్ని నిల్వ చేసే పరిస్థితి లేకపోవడంతో గోదాములను ఖాళీ చేయించాలనే ఉద్దేశంతో కేంద్రం ఒకేసారి మూడునెలల రేషన్ బియ్యాన్ని పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.