గంభీరావుపేట, జూలై 18 : దశాబ్దాల కాలం నుంచి తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసిన ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహ ఏర్పాటును అధికారులు అడ్డుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న జయశంకర్ విగ్రహ ఏర్పాటు గద్దెను శుక్రవారం ఇరిగేషన్ అధికారులు కూలగొట్టారు. ఆగస్టు 6న జయశంకర్ జయంతి రోజున ఆవిష్కరణ చేద్దామని నమాజ్ చెరువు కట్ట శివారున విగ్రహ ఏర్పాటు పనులను ఈ నెల 11న ప్రారంభించారు.
విగ్రహ ఏర్పాటుకు అనుమతులు లేవంటూ నిర్మాణంలో ఉన్న గద్దెను ఇరిగేషన్ డీఈ నర్సింగ్ ఆధ్వర్యంలో నేలమట్టం చేశారు. దీంతో విశ్వబ్రాహ్మణ సభ్యులు రోడ్డుపై ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్ర సాధనకు కృషి చేసిన సారు విగ్రహ ఏర్పాటుకు అనుమతులు లేవని కూల్చేయడం సిగ్గుచేటని, తిరిగి అక్కడే విగ్రహ ఏర్పాటు చేసేవరకు పోరాటం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.