Congress | హైదరాబాద్, సెప్టెంబర్ 16 (నమస్తే తెలంగాణ): సీఎం రేవంత్‌రెడ్డిపై ఆయన క్యాబినెట్ సహచరులు గుర్రుగా ఉన్నారంటూ గాంధీభవన్‌లో చర్చ జోరందుకున్నది. తమను మంత్రులుగా పరిగణించడం లేదంటూ సన్నిహితుల వద్ద వారు గోడు వెళ్లబోసుకుంటున్నట్టు చెప్తున్నారు. ప్రజల దృష్టిలో తమను పిచ్చోళ్లను చేస్తూ ఆయన మాత్రం హీరో కావాలనుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. ఇందుకు పలు సంఘటనలను ఉదహరిస్తున్నారు. ముఖ్యమంత్రి లోపల తమతో చర్చించేది ఒకటి.. బయట ప్రకటించేది, అమలు చేసేది మరొకటని వాపోతున్నారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత డీజీపీ నియామకంపై సీఎం రేవంత్‌రెడ్డి పలువురు మంత్రులతో కీలక సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి సీవీ ఆనంద్ పేరును ప్రస్తావించగా మంత్రులంతా అందుకు అంగీకరించినట్టు సమాచారం. కానీ ఆ మరుసటి రోజు డీజీపీగా జితేందర్‌ను నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ ఘటనతో మంత్రులకు తొలి షాక్ తగిలినట్టు తెలిసింది. ఆ తరువాత రుణమాఫీ, కరెంట్ కోతలు, ఆరు గ్యారెంటీల అమలు, ఉద్యోగాల భర్తీతోపాటు ఇటీవలి హై డ్రా నిర్ణయం వరకు మంత్రులకు వరుస షాక్ లు తగులుతూనే ఉన్నాయని అంటున్నారు.
ప్రభుత్వంలో పలు కీలక నిర్ణయాలు మంత్రులకు తెలియకుండానే జరిపోతున్నట్టు సమాచారం. ముఖ్యంగా హైడ్రా ఏర్పాటు వంటి కీలక నిర్ణయం మంత్రులెవరికీ తెలియదని అంటున్నారు. చాలా నిర్ణయాలు అమల్లోకి వచ్చిన తర్వాత లేదా పేపర్లు, టీవీల్లో చూసి తమ తెలుసుకోవాల్సిన దౌర్భాగ్యం తమకు పట్టిందని ఓ కీలక మంత్రి తన సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలిసింది. రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు, తెలంగాణ తల్లి విగ్రహానికి భూమి పూజ, రుణమాఫీ కార్యక్రమాల నిర్వహణ వంటివి తమకు తెలియకుండానే నిర్ణయాలు జరిగిపోయినట్టు మంత్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు తెలిసింది.
ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత వ్యక్తమవుతుందనుకునే అంశాల్లో సీఎం రేవంత్‌రెడ్డి అతి తెలివిగా వ్యవహరిస్తున్నారనే అభిప్రాయాలు పార్టీలో వినిపిస్తున్నాయి. ఇలాంటి విషయాలపై ముందుగా మంత్రులను ముందుకు ఎగదోసి వారితో మాట్లాడిస్తున్నారని తెలిసింది. మంత్రులు చెప్పే మాటలపై ప్రజల్లో స్పందనను బట్టి ఆ తర్వాత సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతున్నారని చెప్తున్నారు. రుణమాఫీ, ఎమ్మెల్యేల ఫిరాయింపులు, కౌశిక్‌రెడ్డి, గాంధీల వివాదంపై తొలుత మంత్రులను ముందుకు తోసినట్టు తెలిసింది. మంత్రులకు ఇష్టం లేకపోయినా వారితో మీడియా సమావేశాలు పెట్టించి ఏదో ఒకటి మాట్లాడిస్తున్నారని చెప్తున్నారు. తీరా మంత్రులు మాట్లాడిన తర్వాత వారికి పూర్తి విరుద్ధంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతున్నారనే చర్చ జరుగుతున్నది. దీంతో మంత్రులు సీఎం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం.
తెలంగాణ బిడ్డలను కాదని ఆంధ్రాప్రాంతం వారికి పదవులు కట్టబెడుతూ ఉత్తర్వులు వచ్చేదాకా తమకు తెలియటం లేదని మంత్రులు రగిలిపోతున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి ఏకపక్షంగా వ్యవహరిస్తూ రాష్ర్టాన్ని ఆంధ్రప్రదేశ్ పునరావాస కేంద్రంగా మారుస్తున్నారని భగ్గుమంటున్నారు. రేవంత్‌రెడ్డి సమైక్యపాలకులను తలదన్నేలా తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీస్తున్నారని పార్టీలో సీనియర్ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పార్టీ పదవులు, ప్రభుత్వ పదువులు అన్నీ తన ఇష్టానుసారం, తన ఇష్టమైనవారికే కట్టబెడుతూ సీఎం తమ ఉనికినే ప్రశ్నార్థకం చేస్తున్నారని మంత్రులు మండిపడుతున్నారని సమాచారం. ఏపీకి చెందిన నిమ్మగడ్డ రమేశ్‌కుమార్, ఆదిత్యనాథ్‌దాస్, అనిలా వావిల్ల, రఘునాథ్‌రెడ్డి, శ్రీనివాస్‌రాజు, శ్రీరాం కర్రీ, ఆంజనేయరెడ్డి వంటివారిని నియమించే సమయంలో కనీసం తమకు మాట మాత్రమైనా చెప్పలేదని సంబంధిత శాఖల మంత్రులు కుతకుతలాడిపోతున్నారని చర్చించుకుంటున్నారు.
సీఎం తీరు వల్ల తాము ప్రజల్లో చులకనవుతున్నామని మంత్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు తెలిసింది. తమతో ఒక విధంగా మాట్లాడించి, ఆయన మాత్రం ఇంకో విధంగా మాట్లాడుతూ.. తమను పిచ్చోళ్లను చేస్తున్నారని వాపోతున్నారట. ఇందుకు రుణమాఫీ, అరికెపూడి గాంధీ వివాదాన్ని ఉదాహరణగా చూపుతున్నారు. రుణమాఫీ పూర్తి కాలేదని తాము చెప్తుంటే.. సీఎం మాత్రం పూర్తయిపోయిందని చెప్పడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతుల దృష్టిలో తాము విలన్లుగా మారిపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అరికెపూడి గాంధీ బీఆర్ఎస్కు చెందిన ఎమ్మెల్యే అని మంత్రులు శ్రీధర్‌బాబు, భట్టి విక్రమార్క చెప్పగా.. సీఎం రేవంత్‌రెడ్డి మాత్రం ఆయన తమ పార్టీకి చెందిన వారేనని చెప్పుకొచ్చారు. పైగా కౌశిక్‌రెడ్డి ఇంటిపై దాడి చేసింది తమ వాళ్లేనంటూ కుండబద్దలు కొట్టారు.