Inter Colleges | హైదరాబాద్, మే 25 (నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో ఇంటర్మీడియట్ కాలేజీల గుర్తింపు ప్రక్రియ(అఫిలియేషన్లు) ముందుకుసాగడం లేదు. దీంతో అఫిలియేషన్లు పూర్తయ్యేదెప్పుడు.. విద్యార్థులకు అడ్మిషన్లు కల్పించేదెప్పుడు అని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలోని జూనియర్ కాలేజీలకు ఇంటర్‌బోర్డు ఏటా అనుబంధ గుర్తింపు జారీచేస్తుంది. ఆదివారం వరకు 746 కాలేజీలకు మాత్రమే ఇంటర్‌బోర్డు గుర్తింపును జారీచేసింది.
ఈ ఏడాది 3,064 కాలేజీలు ఇంటర్‌బోర్డు అనుబంధ గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకోగా ఇప్పటి వరకు 25% కాలేజీలకు మాత్రమే అఫిలియేషన్లు దక్కాయి. పదో తరగతి ఫలితాలు విడుదల కావడంతో ఈ నెల 1 నుంచే ఫస్టియర్ అడ్మిషన్లు స్వీకరిస్తున్నారు. మొదటి విడత అడ్మిషన్ల దరఖాస్తుల గడువు ఈనెల 31తో ముగియనున్నది. జూన్ 2 నుంచి క్లాసులు ప్రారంభంకానున్నాయి. అఫిలియేషన్లు పూర్తికాకపోవడం, కొత్త విద్యాసంవత్సరం తరుముకొస్తుండటంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొన్నది.
రాష్ట్రంలోని పలు ప్రైవేట్, కార్పొరేట్ కాలేజీలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. ఇంటర్‌బోర్డు నుంచి గుర్తింపు జారీకాకముం దే అడ్మిషన్లు తీసుకుంటున్నాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు కేవలం 171ప్రైవేట్ కాలేజీలకు మాత్రమే ఇంటర్‌బోర్డు గుర్తింపు ఇచ్చింది. దాదాపు 1,250 కాలేజీలకు ఇంకా గుర్తింపు ఇవ్వలేదు. ఈ కాలేజీల గుర్తింపు పెండింగ్‌లో నే ఉంది. అఫిలియేషన్ లేకుండా అడ్మిషన్లు తీసుకోవడం ఇంటర్‌బోర్డు నిబంధనలకు విరుద్ధం. ఆయా కాలేజీలపై చర్యలు తీసుకుంటామని బోర్డు హెచ్చరించింది. అయినా కూడా ఖాతరు చేయడంలేదు.