హైదరాబాద్, జూన్ 11 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థలను ఆర్థికంగా బలోపేతం చేయాలనే లక్ష్యానికి క్షేత్రస్థాయిలో ఉన్న డాటా శాపంగా మారింది. క్షేత్రస్థాయిలో నమ్మకమైన, సకాలంలో లభించే కచ్చితమైన సమాచారం(డాటా) లేకపోవడం వల్ల రాష్ట్ర ఆర్థిక సంఘాల (ఎస్ఎఫ్సీ) పనితీరు తీవ్రంగా దెబ్బతింటున్నది. గ్రామ పంచాయతీల్లో ఆదాయ, వ్యయాలకు సంబంధించిన సరైన గణాంకాలు లేకపోవడం, వివిధ ప్రభుత్వశాఖల మధ్య సమన్వయలోపం, కాలం చెల్లిన గణాంకాల ఆధారంగా నిధుల పంపిణీ జరుగడంవల్ల క్షేత్రస్థాయికి నిధులు సకాలంలో అందడం లేదు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 243-I ప్రకారం ఏర్పాటయ్యే ఎస్‌ఎఫ్‌సీలు స్థానిక సంస్థల ఆర్థిక స్థితిగతులను అంచనా వేయడంలో, నిధుల పంపిణీ, నిబంధనలను సిఫార్సు చేయడంలో అత్యంత కీలక పాత్ర పోషిస్తాయి.
అయితే, తెలంగాణతోపాటు దేశంలోని అత్యధిక రాష్ట్రాల్లో ఎస్ఎఫ్సీల పనితీరు అధ్వానంగా ఉన్నదని, అవి ఇచ్చే ఆర్థిక నివేదికలు అతుకులబొంతలా ఉంటున్నాయని కేంద్ర పంచాయతీరాజ్‌శాఖ విడుదల చేసిన తాజా నివేదిక స్పష్టం చేసింది. డాటా వ్యవస్థను బలోపేతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం నియమించిన ప్రత్యేక కమిటీ తన నివేదికను సమర్పించింది. తెలంగాణ వంటి రాష్ట్రాల్లో పంచాయతీరాజ్ వ్యవస్థను మరింత పారదర్శకంగా, ఆర్థికంగా బలోపేతం చేయడానికి కమిటీ పలు సూచనలు, ప్రతిపాదనలు చేసింది.
తెలంగాణలో గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలకు సంబంధించిన నిధులు, ఆస్తుల వివరాలు ఒకేచోట లభించడం లేదు. నేటికీ 2011 జనాభా లెకలు, సీపెక్ సర్వే వంటి పాత గణాంకాల ఆధారంగానే లెకలు కడుతున్నాయి. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మున్సిపల్‌శాఖ, ప్రజారోగ్య ఇంజినీరింగ్, ఆర్అండ్బీ వంటి విభిన్నశాఖలు తమకు తోచినట్టుగా డాటాను నిర్వహిస్తున్నాయి. ఏ శాఖకు ఆ శాఖ ప్రత్యేకంగా పనిచేస్తుండటం వల్ల, రాష్ట్ర ఆర్థిక సంఘం నిధుల కేటాయింపుల కోసం వివరాలు సేకరించాలంటే ప్రతి శాఖ చుట్టూ తిరగాల్సి వస్తున్నది. ముకలు ముకలుగా ఉన్న సమాచారం వల్ల నివేదికల తయారీలో తీవ్ర జాప్యం ఏర్పడుతున్నది. ప్రస్తుతం గ్రామ పంచాయతీల్లో ఆర్థిక రికార్డులు కేవలం స్థూల మొత్తాల రూపంలోనే ఉంటున్నాయి.
తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం, వీధి దీపాలు, అంతర్గత రోడ్ల వంటి అత్యంత ప్రాథమిక అవసరాలకు విడివిడిగా ఎంత ఖర్చు చేశారనే బ్రేక్ డౌన్ రికార్డులు ఉండటం లేదు. దీనివల్ల, కేటాయించిన ప్రజాధనం వల్ల క్షేత్రస్థాయిలో ప్రజా సేవలు ఎంతవరకు మెరుగయ్యాయో శాస్త్రీయంగా అంచనా వేయడం ఆర్థిక సంఘానికి సాధ్యం కావడం లేదు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ నివేదిక ప్రకారం.. రాష్ట్రాలు తమ ఆర్థిక సంఘాల నివేదికలను సమర్పించడంలో సగటున 16 నెలలు ఆలస్యం చేస్తున్నాయి. తెలంగాణలోనూ సకాలంలో ఆర్థిక సంఘాల ఏర్పాటు, నివేదికల సమర్పణ జరుగకపోవడం వల్ల పాత సిఫార్సుల ఆధారంగానే నిధుల కేటాయింపులు సాగుతున్నాయి.
రాష్ట్రాలు ఇచ్చే నివేదికల్లో నాణ్యత లేకపోవడం, ఒకే విధానం లోపించడం వల్ల.. కేంద్ర ఆర్థిక సంఘం కూడా వీటిని పరిగణనలోకి తీసుకోలేకపోతున్నది. 73, 74వ రాజ్యాంగ సవరణల ద్వారా స్థానిక సంస్థలకు లభించాల్సిన ఆర్థిక స్వయంప్రతిపత్తి కేవలం కాగితాలకే పరిమితమవుతున్నదని ఈ నివేదిక స్పష్టంచేసింది. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి, ప్రతి గ్రామపంచాయతీ స్థాయిలో పారదర్శక అకౌంటింగ్ వ్యవస్థను బలోపేతం చేయాలని, బడ్జెట్లోనే పంచాయతీలవారీగా నిధుల కేటాయింపులను స్పష్టం చేయాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. లేనిపక్షంలో కేంద్రం నుంచి వచ్చే భారీ గ్రాంట్లు నిలిచిపోయే ప్రమాదం ఉన్నదని హెచ్చరిస్తున్నారు.