వరంగల్ ప్రతినిధి (నమస్తే తెలంగాణ), జూన్ 12: బొగ్గు కుంభకోణంతోపాటు సింగరేణిలో జరుగుతున్న అవినీతి, అక్రమాలను బయటపెట్టేందుకు బీఆర్ఎస్ఎల్పీ ఉపనేత హరీశ్‌రావు శుక్రవారం చేపట్టిన ‘సింగరేణి రక్షణ యాత్ర’ అక్కడి అధికారుల్లో వణుకు పుట్టించింది. హరీశ్‌రావు బృందానికి సింగరేణిలోని అవినీతి కంటపడకుండా ఉండేందుకు నానా తంటాలు పడ్డారు. అధికారులు మట్టి దిబ్బలపై కొద్దిపాటి బొగ్గును పూతలా వేసి బొగ్గు రాశులను తలపించేలా చేశారు.
భూపాలపల్లి సింగరేణిలోని ఓసీ-2 గనిలో బొగ్గు నిల్వల బాగోతం అధికారుల గుట్టు బయటపెట్టింది. లేని బొగ్గును ఉన్నట్టు చూపేందుకు అధికారులు మట్టి దిబ్బలపై బొగ్గును పైపూతగా పేర్చి గుట్టలుగా మార్చారు. అక్కడ ఉన్నది బొగ్గు గుట్టలుగా నమ్మించే ప్రయత్నాలు చేశారు. హరీశ్‌రావు నేతృత్వంలోని బీఆర్ఎస్ బృందం భూపాలపల్లిలోని సింగరేణి పర్యటనకు వస్తుందని తెలిసిన వెంటనే అధికారులు బొగ్గు నిల్వలు ఉన్నట్టు చూపేందుకు నానా తంటాలు పడ్డారు. రాత్రికి రాత్రికే ఓసీ-2 గనిలోని మట్టి దిబ్బలపై పనికి రాని బొగ్గు పోసే ప్రయత్నం చేశారు. భూపాలపల్లి ఏరియాలోని కేటీకే ఓసీ-2 ప్రాజెక్ట్‌లోని బొగ్గు నిల్వలు చూపించేందుకు సింగరేణి అధికారులకు భయమెందుకనే ప్రశ్నలు వెల్లువెత్తాయి.
భూపాలపల్లిలోని ఓసీ-2 గని వద్ద ఉద్రిక్తత నెలకొన్నది. సింగరేణి రక్షణ యాత్ర చేపట్టి భూపాలపల్లికి వచ్చిన హరీశ్‌రావు బృందాన్ని ఓసీ-2 గని సందర్శించకుండా అడ్డుకున్నారు. పెద్ద ఎత్తున పోలీసులను మోహరించారు. అక్కడికి చేరుకున్న హరీశ్‌రావు బృందానికి గని సందర్శనకు అనుమతి లేదని సెక్యూరిటీతోపాటు పోలీసులు అడ్డుకున్నారు. హరీశ్ బృందం.. పోలీసులతో వాగ్వాదానికి దిగింది. టీబీజీకేఎస్ గౌరవాధ్యక్షుడు కొప్పుల ఈశ్వర్, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, శాసపమండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు పుట్ట మధు, పెద్ది సుదర్శన్‌రెడ్డి, గెల్లు శ్రీనివాస్, ఎర్రోళ్ల శ్రీనివాస్ ఉన్నారు.