Gurukula Schools | హైదరాబాద్, మే 22 (నమస్తే తెలంగాణ) : విద్యార్థులకు మెరుగైన విద్యను అందించేందుకు గురుకులాల్లోని ఖాళీ పోస్టులన్నీ భర్తీ చేస్తామని, అందుకు ఎంత ఖర్చయినా భరిస్తామని ప్రభుత్వం పెద్దలు చెప్తుంటే.. గురుకుల సొసైటీ అధికారులు మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. పొదుపు చర్యల పేరిట ఓ గురుకులంలో సిబ్బందిని తొలగిస్తున్నారు. మరో గురుకులంలో క్షేత్రస్థాయి సమస్యను పరిష్కరించకుండా స్పెషల్ టీచర్లపై భారం మోపుతున్నారు. సంక్షేమ హాస్టళ్ల నిర్వహణ, పర్యవేక్షణకు ప్రత్యేకంగా వార్డెన్లను నియమిస్తున్న ప్రభుత్వం.. గురుకులాల నిర్వహణకు మాత్రం వార్డెన్లను ప్రత్యేకంగా నియమించడం లేదు. గురుకులాల్లో ప్రిన్సిపాళ్లే వార్డెన్లుగా కొనసాగుతున్నారు. వాస్తవానికి గురుకులాల్లోని టీజీటీ (ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్), పీజీటీ (పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్)లు ప్రిన్సిపాళ్లకు సహాయకారులుగా, డిప్యూటీ వార్డెన్లుగా వ్యవహరించాల్సి ఉంటుంది.
ఈ మేరకు నియామక సమయంలోనే టీజీటీ, పీజీటీల నుంచి అంగీకార పత్రాలను తీసుకుంటున్నారు. అనంతరం వారికి రోటేషన్ పద్ధతిలో డిప్యూటీ వార్డెన్ డ్యూటీలను కేటాయిస్తున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకూ గురుకులాల్లోనే ఉండి మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం అందేలా చూడడం వారి బాధ్యత. అందుకోసం వారికి ప్రత్యేక అలవెన్సు కూడా చెల్లిస్తున్నారు. డిప్యూటీ వార్డెన్ల విధులను ప్రిన్సిపాల్ పర్యవేక్షిస్తుంటారు. టీచింగ్ సిబ్బందికి ఇబ్బందుల్లేకుండా చూసేందుకు, డిప్యూటీ వార్డెన్ డ్యూటీలను నిర్వహించేందుకు గతంలో ఎస్సీ గురుకుల సొసైటీ పలుచోట్ల ఔట్సోర్సింగ్ విధానంలో ఏసీటీ (అసిస్టెంట్ కేర్ టేకర్)లను నియమించింది. వారంతా ప్రిన్సిపాల్ పర్యవేక్షణలో డిప్యూటీ వార్డెన్ విధులను నిర్వర్తిస్తూ వచ్చారు. ఇదేవిధంగా ఇతర చోట్ల కూడా ఏసీటీలను నియమించాలన్న డిమాండ్ ఉన్నది. అయితే, ఎస్సీ గురుకుల సొసైటీకి తగినంత బడ్జెట్ లేదని చెప్తున్న ఉన్నతాధికారులు.. పొదుపు చర్యల్లో భాగంగా ప్రస్తుతం ఉన్న ఏసీటీలనే తొలగించాలని నిర్ణయించారు. ఈ మేరకు ఇప్పటికే ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి.
విద్యార్థులకు బోధనతోపాటు కళల్లో కూడా తర్ఫీదు ఇవ్వాలని విద్యాహకు చట్టం స్పష్టం చేస్తుండటంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం గురుకులాల్లో పెద్ద ఎత్తున ఆర్ట్స్, క్రాఫ్ట్స్, మ్యూజిక్ టీచర్లతోపాటు దాదాపు 2,500 మంది లైబ్రేరియన్లను కూడా నియమించింది. కళా నైపుణ్యాల్లో విద్యార్థులకు ఇవ్వాల్సిన వీరిని స్పెషల్ టీచర్లుగా పిలుస్తున్నారు. కానీ, ప్రస్తుతం గురుకుల సొసైటీలు వారిని ఆ విధులకు కాకుండా రంగులతో గోడలను అందంగా తీర్చిదిద్దడం, విద్యార్థులు బయటకు వెళ్లినప్పుడు వారికి ఎసార్టుగా వ్యవహరించడం, నైట్ కేర్, నైట్ స్టడీ, సమ్మర్ క్యాంప్ లాంటి ఇతర పనులకు వినియోగించుకుంటున్నాయి. సూటిగా చెప్పాలంటే సావెంజర్ పని తప్ప అటెండర్లు చేసే పనులకు కూడా తమనే ఉపయోగించుకుంటున్నారని స్పెషల్ టీచర్లు వాపోతున్నారు. కాగా, వచ్చే విద్యాసంవత్సరం నుంచి స్పెషల్ టీచర్లనే డిప్యూటీ వార్డెన్లుగా నియమించాలని బీసీ గురుకుల సొసైటీ నిర్ణయించింది. ఈ మేరకు ఇటీవల ఉత్తర్వులు కూడా జారీ చేసింది. దీనిపై స్పెషల్ టీచర్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తమతో డిప్యూటీ వార్డెన్ డ్యూటీలు చేయిస్తే కళల్లో విద్యార్థులకు ఎలా శిక్షణ ఇవ్వాలని ప్రశ్నిస్తున్నారు. ఈ విషయమై ఇటీవల గురుకుల సొసైటీ కార్యదర్శిని కూడా కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. కానీ, అవసరం మేరకు ఏపనైనా చేయాల్సిందేనని, సొసైటీలోని ఉద్యోగుల విధులను మార్చే అధికారం తనదేనని సొసైటీ కార్యదర్శి స్పష్టం చేసినట్టు స్పెషల్ టీచర్లు వాపోతున్నారు. ఉద్యోగుల విధులను మార్చే అధికారం గురుకుల సొసైటీ సెక్రటరీకి ఉన్నప్పటికీ అది జాబ్‌చార్ట్‌కు విరుద్ధంగా ఉండకూడదని స్పెషల్ టీచర్లు చెప్తున్నారు.
బీసీ సొసైటీ నిర్ణయంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఇటీవల పలువురు స్పెషల్ టీచర్లు ప్రభుత్వ పెద్దలను కలిసి, తమ గోడు వెళ్లబోసుకున్నారు. తమకు అదనపు బాధ్యతలు అంటగట్టడం వలన విద్యార్థుల్లో సృజనాత్మకతను, కళా నైపుణ్యాలను మెరుగుపరిచే ప్రక్రియ పూర్తిగా అటకెక్కుతుందని విన్నవించారు. గురుకులాలు నెలకొల్పిన నాటినుంచి అందుబాటులో ఉన్న టీచింగ్ సిబ్బందికే రొటేషన్ పద్ధతిలో డిప్యూటీ వార్డెన్ డ్యూటీలను వేస్తున్నారని గుర్తుచేస్తూ.. ఆ బాధ్యతలను కొత్తగా తమకు అప్పగించడం సరికాదని ప్రాధేయపడ్డారు. అయినప్పటికీ సదరు ప్రభుత్వ పెద్దలు ఏమాత్రం కనికరించలేదని స్పెషల్ టీచర్లు వాపోతున్నారు. అక్కడితో ఆగకుండా ఆర్ట్ టీచర్లు మురికివాడల్లో, రోడ్లపై అందమైన బొమ్మలు వేయాలని చెప్పారని, ఆ మేరకు అప్పటికప్పుడు ఓ జిల్లా కలెక్టర్‌కు ఫోన్‌చేసి ఆ దిశగా చర్యలు చేపట్టాలంటూ పరిహాసించారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
హైదరాబాద్, మే 22 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో 30మంది ఏఎస్పీలు బదిలీ అయ్యారు. ఈ మేరకు గురువారం హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వెంటనే ఈ ఉత్తర్వులు అమలులోకి వస్తాయని హోంశాఖ పేర్కొన్నది. కాగా, రెండ్రోజుల క్రితం 77మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ పోలీసుశాఖ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.