మంచిర్యాల, జూలై 6(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : దేశంలో ఎక్కడా లేనివిధంగా ఆదిలాబాద్‌లో 10వేల ఎకరాల్లో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుచేస్తామని ముఖ్యనేత ప్రకటించడం, ప్రభుత్వ పెద్దలు సీక్రెట్‌గా వచ్చి ఏరియల్ సర్వేలు పోవడం, క్షేత్రస్థాయిలో భూసేకరణకు చకచకా సాగుతుండటం.. బ్యాంకుల్లో తనఖా ఉన్న భూములు, సాగునీటి కాలువలకు సంబంధించిన భూములని చూడకుండా నోటిఫికేషన్లు ఇవ్వడం.. డీపీఆర్‌పై స్పష్టత లేకపోవడం… ఇలా తవ్వినకొద్దీ ఆదిలాబాద్ ఇండస్ట్రియల్ పార్క్ బాగోతాలు బయటపడుతున్నాయి. రెడ్‌జోన్ పరిశ్రమల పేరుతో మైనింగ్ చేయడంతోపాటు తనఖా భూముల పేరుతో పరిహారం నొక్కేయడం.. లేఅవుట్ డెవలప్మెంట్, భవ్య స్కీములను అడ్డుపెట్టుకొని మొత్తంగా దాదాపు రూ.20వేల కోట్ల స్కామ్‌కు తెరతీశారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే తనఖా భూముల స్కామ్ బయటపడిన నేపథ్యంలో.. ప్రభుత్వ పెద్దలు, స్థానిక నాయకుడు కలిసి రేపటి దందాకు ఇప్పటినుంచే పావులు కదుపుతున్నారనే అనుమానాలు బలపడుతున్నాయి.
పది వేల ఎకరాల్లో ఏర్పాటుచేస్తామన్న ఇండస్ట్రియల్ పార్క్ కోసం భూసేకరణ చకచకా సాగుతున్నది. ఇప్పటికే 2,026 ఎకరాల సేకరణకు నోటిఫికేషన్ వెలువడగా, మరో 1,022 ఎకరాల సేకరణకు అడుగులు పడుతున్నాయి. దాదాపు 6వేల ఎకరాలు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా సేకరించాలని, ఆ తర్వాత 10వేల ఎకరాలకు ఈ పార్క్‌ను విస్తరించేలా భూసేకరణ చేయాలని ముఖ్యనేత నుంచి ఆదేశాలున్నట్టు తెలిసింది. ఈ వ్యవహారంలో స్థానిక ఎమ్మెల్యే పాయల్ శంకర్‌కు మేలు చేసేలా భూసేకరణ జరుగుతున్నదన్న ఆరోపణలున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో జీఎస్ బయోటెక్ లిమిటెడ్(పాయల్ శంకర్‌కు ముందునుంచీ సన్నిహిత సంబంధాలున్న కంపెనీ) పేరుతో జిల్లాలో 2,200 ఎకరాలు ఉండగా.. ఒక్క ఆదిలాబాద్ జిల్లాలోనే 1,260 ఎకరాలున్నట్టు సమాచారం. భూసేకరణ చేస్తున్న భోరజ్, భీంపూర్, తాంసి మండలాల్లోనే ఎక్కువ శాతం ఈ భూములున్నాయి. ప్రస్తుతం భూసేకరణ చేస్తున్న భోరజ్ మండలం హథీఘాట్ గ్రామంలో
340 ఎకరాలు, గూడ గ్రామంలో 240 ఎకరాలు జీఎస్ బయోటెక్ లిమిటెడ్ పేరుతో ఉన్నాయి. దాదాపు ఇప్పుడు సేకరిస్తున్న భూముల్లో 600 ఎకరాలుండగా, రానున్న రోజుల్లో విస్తరించనున్న ఇండస్ట్రియల్ పార్క్‌లో మరో 600 పైచిలుకు ఎకరాలు ఆయనకు సంబంధించినవే సేకరిస్తారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇలా ఉన్న భూములతో పాటు బ్యాంక్‌లకు తనఖా పడిన భూముల నుంచి బంధువులు, బినామీల పేర్లపైకి మార్చి.. రూ.కోట్లు కొల్లగొట్టే ప్లాన్‌లో ఉన్నారని తెలుస్తున్నది.
ఉదాహరణకు: ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం గిమ్మ(బి)లోని 39వ సర్వే నెంబర్లో 33.31 ఎకరాల భూమిని 2006లో సుమన్ అగర్వాల్ కొనుగోలు చేశారు. పీ గణేశ్ అనే వ్యక్తి నుంచి 2006లో భూమి కొనుగోలు చేసి 2007లో ఎస్బీహెచ్(ఇప్పుడు ఎస్బీఐ) బ్యాంక్‌కు మార్టిగేజ్ చేశారు. బ్యాంక్‌కు మార్టిగేజ్ చేసేస్తే డిఫాల్లరయ్యారు. ఇప్పుడు అకస్మాత్తుగా తుడుం గణేశ్(స్థానిక ఎమ్మెల్యే బామ్మర్ది) పేరుపైకి ఈ భూమిని బదలాయించారు. గణేశ్ అనే పేరు ఒక్కటే కావడంతో ఇంటి పేరు లేకుండా గణేశ్ పేరుతో పహానీలు సృష్టించారని, ఆ గణేశ్‌ను ఈ గణేశ్‌గా చూపించి పాస్‌బుక్ తీసుకున్నట్టు ఆరోపణలున్నాయి. కాకపోతే గతంలోనే బ్యాంక్‌లో మార్టిగేజ్ అయ్యాక ఈ భూమి ఎలా బదలాయించబడిందనే క్లారిటీ లేదు. ఇలా టీ గణేశ్ పేరు మీదకు వచ్చిన భూమిని ఉగ్గె సత్యనారాయణకు రిజిస్ట్రేషన్ చేశారు.
ఆయన అందులో 5.31 గుంటలు ఇతరులకు విక్రయించారు. అలా ఐదెకరాలు ఇతరులకు విక్రయించాక కూడా తాజాగా ఇచ్చిన భూసేకరణ నోటిఫికేషన్లో ఈ సర్వే నెంబర్లోని 33.31 ఎకరాలు డెక్కన్ సిమెంట్స్ పేరుకు మారాయి. ఈ తరహాలో సదరు కంపెనీ, అక్రమ మార్గంలో బదలాయించుకున్న భూములను ఇండస్ట్రియల్ పార్క్‌కు అప్పగించి కోట్ల రూపాయలు పరిహారంగా తీసుకొనేందుకు సిద్ధమయ్యారు.
20 ఏండ్ల క్రితం ఎకరాకు రూ.20వేల-రూ.40వేలకు పొందిన భూములను తిరిగి చేజిక్కించుకొని ఎకరానికి రూ.15లక్షల నుంచి రూ.18లక్షల చొప్పున పరిహారం రూపంలో పొందనున్నారని తెలిసింది. ఇలా స్థానిక ఎమ్మెల్యేకు సహకరించి రానున్న రోజుల్లో రెడ్ జోన్ పరిశ్రమల పేరుతో మైనింగ్ చేయడం.. ఇక్కడున్న సున్నపురాయి, మాంగనీస్ ఖనిజాలను సొమ్ము చేసుకొనేందుకే సర్కారీ పెద్దలు సైతం ఇందుకు సహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఎమ్మెల్యేతోపాటు ప్రభుత్వ పెద్దలు కలిసి పలు రకాలుగా పార్క్‌ను దోచుకొనేందుకు సిద్ధమయ్యారనే గుసుగుసలు వినిపిస్తున్నాయి.
ఇది ఇప్పటికే బయటపడిన వ్యవహారమే.. ఇండస్ట్రియల్ పార్క్ పేరుతో సేకరిస్తున్న భూముల్లో దాదాపు రెండువేల ఎకరాలు రెండు దశాబ్దాల క్రితమే ఓ సంస్థ కొనుగోలు చేసింది. ఆ భూములను బ్యాంకుల్లో తనఖా పెట్టి డిఫాల్టర్ అయ్యింది. చివరకు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్(ఎన్సీఎల్టీ) నిర్వహించిన ఈ-వేలంలో బెంగళూరుకు చెందిన ఆ భూములు దక్కించుకొన్నది. కానీ రెవెన్యూ రికార్డుల్లో ఇప్పటికీ ఆ భూములు ఆ రైతుల పేరుతోనే ఉండటంతో వాటిని అడ్డుపెట్టుకొని స్థానిక ఎమ్మెల్యే బంధువులు, బినామీల పేర్లపైకి ఆ భూములను మార్చుకొని, వారి నుంచి డెక్కన్ సిమెంట్స్ కంపెనీకి ఆ భూములను బదలాయించారు. ఇలా 20 ఏండ్ల క్రితం ఎకరాకు రూ.20వేల నుంచి రూ.40వేలకు కొనుగోలు చేసి.. ఇప్పుడు ఎకరానికి రూ.15 లక్షల నుంచి రూ.18 లక్షల చొప్పున పరిహారం పొందనున్నారు.
ఆదిలాబాద్‌లో 10వేల ఎకరాల్లో ఇండస్ట్రియల్ పార్క్ తీసుకువస్తామని ప్రభుత్వ ముఖ్యనేత ఇప్పటికే ప్రకటించారు. ఇప్పటికే 2026 ఎకరాల్లో భూసేకరణ మొదలు కాగా, మరో 1022 ఎకరాల విస్తరణను జీవో విడుదల చేశారు. కాగా 2026 ఎకరాల్లో ప్రతిపాదిత ఇండస్ట్రియల్ పార్క్‌లో ఏ పరిశ్రమలు పెడుతారో స్పష్టత లేని డీపీఆర్‌లో లే అవుట్ అభివృద్ధికి రూ.3వేల ఖర్చు చేసేలా అంచనాలు రూపొందించినట్లు సమాచారం. ఈ లెక్కన సర్కార్ ముఖ్యనేత చెప్పినట్లు 6వేల ఎకరాల నుంచి 10 వేల ఎకరాల భూ సేకరణ చేస్తే లే అవుట్ అభివృద్ధి పేరుతో రూ.10వేల కొట్ల నుంచి రూ.15వేల కోట్లు పనుల పేరుతో వాటాలు పంచుకొనే కుట్రలు దాగి ఉన్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డీపీఆర్‌పై స్పష్టత లేకపోవడం అనేక అనుమానాలకు తావిస్తున్నది.
లే అవుట్ డెవలప్మెంట్, భవ్య స్కీమ్‌ల్లో దండుకోవడం అయిపోయాక.. ముందు చెప్తున్నట్టు రెడ్‌జోన్ పరిశ్రమల పేరుతో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుచేస్తున్న వేలాది ఎకరాల్లో ఉన్న ఖనిజ నిక్షేపాలను మైనింగ్ చేయడమే అసలు ఉద్దేశంగా కనిపిస్తున్నది. మాంగనీస్, సున్నపురాయి నిక్షేపాలను యథేచ్ఛగా తవ్వుకొని సొమ్ము చేసుకోవడం కోసం అసలైన కుట్ర జరుగుతున్నది. డీపీఆర్‌లో స్పష్టత ఇవ్వకుండా కేవలం రెడ్‌జోన్ పరిశ్రమలను పేర్కొనడం వెనుక అసలు మతలబు కూడా ఇదే ఉద్దేశమన్ననే వాదన కూడా తెరపైకి వచ్చింది. ముఖ్యనేత బంధువులు, సన్నిహితులకు మైనింగ్‌లో ఇప్పటికే అనుభవం ఉండటం.. స్థానిక ఎమ్మెల్యేకు సైతం బ్లాక్‌స్టోన్ మైనింగ్ వ్యాపారం ఉండటంతో పక్కాప్లాన్ ప్రకారమే ఇండస్ట్రియల్ పార్క్ పేరుతో పావులు కదుపుతున్నారని.. ఇందులో భాగంగానే డెక్కన్ సిమెంట్స్ సంస్థను ఇందులోకి తీసుకొచ్చారని స్థానికంగా చర్చ జరుగుతున్నది.
కేంద్ర ప్రభుత్వ వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ 2026 మే నెలలో తీసుకొచ్చిన భవ్య(భారత్ అద్యోగిక్ వికాస్ యోజన) స్కీమ్‌లో ఇండస్ట్రియల్ పార్క్‌ను చేర్చుతారు. ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం 100 ఎకరాల నుంచి 1000 ఎకరాల విస్తీర్ణంలో ఇండస్ట్రియల్ పార్క్‌లు ఏర్పాటు చేస్తే ఎకరాకు రూ.కోటి కేంద్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ చొప్పున ఇస్తుంది. ప్రాథమిక మౌలిక వసతులు(రోడ్లు అడ్ కనెక్టివిటీ, విద్యుత్, నీరు, డ్రైనేజీ వ్యర్థాల నిర్వహణ, డిజిటల్ నెట్వర్క్, రెడీమేడ్ ఫ్యాక్టరీ షెడ్లు, వేర్ హౌసింగ్, టెస్టింగ్ ల్యాంబ్లు, కార్మికుల గృహ వసతి, ఆరోగ్య కేంద్రాలు, క్యాంటీన్ ఇతర వసతుల) కల్పిస్తారు. కేంద్రం ఇప్పటికే ఇందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నది. ఈ స్కిమ్‌లో ఆదిలాబాద్ ఇండస్ట్రియల్ పార్క్‌ను చేర్చితే ఎన్ని ఎకరాలు సేకరిస్తే.. అన్ని కోట్లు మ్యాచింగ్ గ్రాంట్‌గా వస్తాయి. అదే ప్రైవేట్ డెవలపర్ల భాగస్వామ్యంతో పార్క్‌లను అభివృద్ధి చేస్తే గరిష్ఠంగా ఎకరాకు రూ.50 లక్షలు ఇస్తుంది. ఈ లెక్కన రూ.5వేల కోట్ల నుంచి రూ.10కోట్లు పార్క్‌కు వస్తాయి. ఇందులోనూ మౌలిక సదుపాయాల కల్పన పనులను అరకొరగా చేసి మిగిలింది పంచుకొనే అవకాశాలున్నాయి.