హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 23(నమస్తే తెలంగాణ) : ఫోర్త్‌సిటీ వరకు నిర్మించనున్న గ్రీన్‌ఫీల్డ్ హైవే నిర్మాణ పనులు మరోసారి చర్చనీయాంశమయ్యాయి. హెచ్‌సీయూ భూముల విక్రయానికి ఆంధ్రా బీజేపీ ఎంపీ సహకరించారనే ఆరోపణల నేపథ్యంలో ఆ ఎంపీ కంపెనీకి గ్రీన్‌ఫీల్డ్ హైవే పనులను తెలంగాణ సర్కారు అప్పగించినట్టు తెలిసింది. హెచ్ఎండీఏ గ్రోత్ కారిడార్ చేపట్టిన 41 కిలోమీటర్ల గ్రీన్ ఫీల్డ్ హైవే పనుల్లో 19 కిలోమీటర్ల మేర ఆ నేతకు కట్టబెట్టారని సమాచారం. గ్రీన్‌ఫీల్డ్ హైవే మార్గాన్ని రెండు దశలుగా రూ. 4,030 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్నారు. ఇందులో 19.2 కిలోమీటర్ల ప్రాజెక్టును పదేండ్ల తర్వాత ఆంధ్రా ఎంపీ కంపెనీకి అప్పగించారన్న వార్త ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఈ కంపెనీకి పనులు అప్పగించడం వెనుక ఓ పెద్ద కథే ఉంది. కంచ గచ్చిబౌలిలోని హెచ్‌సీయూ భూముల విక్రయం కోసం ముంబైకి చెందిన బీకాన్ కంపెనీతో జరిగిన లావాదేవీతో బీజం పడింది.
అవుటర్ రింగురోడ్డు ఎగ్జిట్ నంబర్ 13 నుంచి ఊహానగరి(ఫోర్త్ సిటీ) వరకు గ్రీన్‌ఫీల్డ్ హైవే నిర్మాణానికి సీఎం రేవంత్‌రెడ్డి సిద్ధమయ్యారు. దాదాపు 1,900 మంది రైతుల నుంచి సుమారు 440 ఎకరాల విస్తీర్ణంలో భూములను బలవంతంగా సేకరించారు. 41కిలో మీటర్ల పొడవైన ఆరు లేన్ల గ్రీన్‌ఫీల్డ్ హైవేను రూ. 4,030 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించేందుకు హెచ్ఎండీఏ టెండర్లు పిలిచింది. భూ సర్వే నుంచి భూసేకరణ వరకు అధికార బలాన్ని ఉపయోగించిన రేవంత్‌రెడ్డి పనిలో పనిగా ఆ ప్రాజెక్టును ఆప్తులకు కట్టబెట్టేందుకు సిద్ధమయ్యారు. రెండు దశల్లో నిర్మించనున్న ఈ ప్రాజెక్టు ద్వారా పదేండ్ల తర్వాత ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బీజేపీ ఎంపీ కంపెనీతోపాటు ఎల్అండ్టీ సంస్థలు దక్కించుకున్నట్టు సమాచారం. ఇందులో సదరు ఎంపీ కంపెనీ రూ. 2వేల కోట్ల ప్రాజెక్టు, ఎల్అండ్టీ సంస్థ మరో రూ. 2,030 వేల కోట్ల పనులను చేజిక్కించుకున్నాయని తెలిసింది.
కంచ గచ్చిబౌలిలోని హెచ్‌సీయూ భూములను విక్రయించే బాధ్యతను ముంబైకి చెందిన బీకాన్ ట్రస్టీ కంపెనీ దక్కించుకున్నది. ఈ కంపెనీ నియామకం వెనుక ఏపీ బీజేపీ ఎంపీ హస్తం ఉందనే వాదనలు ఉన్నాయి. ఈ కంపెనీ సాయంతోనే రేవంత్‌రెడ్డి రూ. పదివేల కోట్లకు హెచ్‌సీయూ భూముల ధారాదత్తం చేయడానికి సిద్ధమయ్యారు. బీకాన్ కంపెనీ, తెలంగాణ సర్కారుకు మధ్య ఒప్పందం కుదర్చడంలో ఆ ఎంపీ అన్నీ తానై వ్యవహరించినట్టు సమాచారం. దీంతో రేవంత్‌రెడ్డికి జరిగిన లబ్ధికి ప్రతిఫలంగా ఫోర్త్‌సిటీ గ్రీన్‌ఫీల్డ్ హైవే నిర్మాణంలో ఇరువురి మధ్య బంధం కుదిరినట్టు తెలిసింది. సదరు ఎంపీ కంపెనీ గడిచిన పదేండ్లలో తెలంగాణలో భారీ ప్రాజెక్టులను దక్కించుకున్న దాఖాలాలు లేవు. కానీ రూ. 2 వేల కోట్ల ప్రాజెక్టు ఎలా దక్కిందనేది ఇప్పుడు తెలంగాణవాదులను విస్మయానికి గురిచేస్తున్నది. దీనిపై సోషల్ మీడియాలోనూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది. అయితే హెచ్ఎండీఏ వర్గాలు మాత్రం టెండర్లు ఖరారు కాలేదనీ, తుదిదశలో మాత్రమే ఉన్నాయని, పనులను ఏ కంపెనీకీ అప్పగించలేదని, కోర్టు వివాదం తేలాల్సి ఉందని చెప్తున్నాయి.
రావిర్యాల నుంచి మీర్ఖాన్పేట్ వరకు నిర్మించనున్న 19 కిలోమీటర్ల రోడ్డును తొలి దఫాలో చేపట్టనున్నారు. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం దాదాపు రూ. 2వేల కోట్లు. గ్రీన్‌ఫీల్డ్ హైవే విషయంలో భూములను పరిరక్షించుకునేందుకు వందల మం ది రైతులు ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీంతో గడిచిన 4నెలలుగా టెండర్లు నిలిచిపోయాయి. కానీ ఇటీవలే టెండర్లు ఖరారైనట్టు తెలిసింది. తొలి దశలో చేపట్టే ప్రాజెక్టు పనులనే సదరు ఎంపీ కంపెనీకి ఇచ్చినట్టుగా తెలిసింది. టెండర్లపై హెచ్ఎండీఏ కదలికలను గుర్తించిన రైతులు మరోసారి కోర్టులను ఆశ్రయించగా పనులు కట్టబెడుతూ ఇవ్వాల్సిన ఉత్తర్వులు ప్రస్తుతానికి నిలిచినట్టుగా తెలిసింది. గ్రీన్‌ఫీల్డ్ హైవే విషయంలో ఓవైపు కోర్టులో వివాదం కొనసాగుతూనే ఉంది.