Regional Ring Road | హైదరాబాద్, ఏప్రిల్ 4 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో రీజినల్ రింగ్ రోడ్డు (ట్రిపుల్ఆర్) నిర్మాణంపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లా రాయగిరి ప్రాంతంలో ఈ రోడ్డు నిర్మాణానికి భూములు ఇచ్చేందుకు నిరాకరిస్తూ కొందరు రైతులు కోర్టును ఆశ్రయించడంతో ఈ అంశాన్ని పరిశీలించాలని ఇటీవల ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో కోర్టు సూచనల మేరకు అలైన్‌మెంట్‌ను మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి నివేదించింది. ట్రిపుల్ఆర్ ఉత్తర భాగం నిర్మాణ పనుల కోసం త్వరలో టెండర్లు పిలిచేందుకు జాతీయ రహదారుల సంస్థ (ఎన్హెచ్ఏఐ) సిద్ధమవుతున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రతిపాదన చేయడం గమనార్హం. దీనిపై ఎన్హెచ్ఏఐ సానుకూల నిర్ణయం తీసుకుంటే ఈ ప్రాజెక్టు మరింత ఆలస్యమయ్యే అవకాశాలున్నాయి.
భారత్ మాల పరియోజన తొలి దశలో భాగంగా ట్రిపుల్‌ఆర్‌లో 164 కి.మీ. పొడవైన ఉత్తర భాగాన్ని నిర్మించాల్సి ఉన్నది. ఇందుకు అవసరమైన 1,935.35 హెక్టార్లలో ఇప్పటికే 1,500 హెక్టార్ల (85 శాతం) భూసేకరణ పూర్తయింది. మిగిలిన 15% భూసేకరణ ప్రక్రియను 3 నెలల్లో పూర్తిచేయాలని నిర్ణయించారు. కానీ, ట్రిపుల్ఆర్కు సంబంధించిన డీపీఆర్ తయారైనప్పటి నుంచే రాయగిరి ప్రాంత రైతులు దీనికి వ్యతిరేకంగా ఆందోళన నిర్వహిస్తున్నారు. దీనిపై అప్పుడు స్థానిక ఎంపీగా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా రైతులకు మద్దతుగా నిలిచారు. ప్రస్తుతం ఆయనే రాష్ట్ర ఆర్అండ్బీ మంత్రిగా ఉండటంతో ట్రిపుల్ఆర్ అలైన్‌మెంట్‌ను సవరించి రైతులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.
ట్రిపుల్ఆర్ అలైన్మెంట్ ఇప్పటికే ఖరారైనందున దాన్ని సవరించేందుకు అంతగా ఆస్కారం ఉండకపోవచ్చని అధికారులు అంటున్నారు. కానీ, ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనకు ఎన్హెచ్ఏఐ అంగీకరిస్తే తేనతుట్టెను కదిపినట్టేనని, అలైన్మెంట్లో మార్పులు చేస్తే మరికొన్ని కొత్త డిమాండ్లు రావొచ్చని, రాయగిరి ప్రాంత రైతుల మాదిరిగా మిగిలిన చోట్ల కూడా వ్యతిరేకత వ్యక్తం కావొచ్చని అధికారులు చెప్తున్నారు. ఇదే జరిగితే ట్రిపుల్ఆర్ దక్షిణ భాగం పనులపై కూడా ప్రభావం పడుతుందని, దీంతో ఈ ప్రాజెక్టు మరింత జాప్యమవడం ఖాయమని హెచ్చరిస్తున్నారు. కానీ, ట్రిపుల్ఆర్ అలైన్మెంట్ మార్పునకు సాక్షాత్తూ రాష్ట్ర ఆర్అండ్బీ మంత్రే మద్దతు తెలపడంతో టెండర్ల ప్రక్రియకు బ్రేకులు పడినట్టేనన్న వాదనలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనను కాదని కేంద్రం ముందుకెళ్తే మున్ముందు ఈ ప్రాజక్టు నిర్మాణంలో మరిన్ని సమస్యలు తలెత్తవచ్చని ఎన్హెచ్ఏఐ అధికారులు చెప్తున్నారు.
ట్రిపుల్ఆర్ నిర్మాణానికి మొత్తంగా దాదాపు 4,942 ఎకరాల భూములను సేకరించాల్సి ఉన్నది. దీనికి రూ.5,170 కోట్లకుపైగా ఖర్చవుతుందని అంచనా. ఇందులో సగభాగాన్ని (రూ.2,585 కోట్లు) రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉన్నది. మిగిలిన సగభాగంతోపాటు యుటిలిటీస్ షిఫ్టింగ్‌కు అయ్యే రూ.363 కోట్ల ఖర్చును భరించేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. ట్రిపుల్ఆర్ నిర్మాణాన్ని రెండు భాగాలుగా చేపట్టనున్నారు. ఇందులో 164 కి.మీ. పొడవైన ఉత్తర భాగాన్ని రూ.9,500 కోట్లతో నిర్మించాలని నిశ్చయించారు. ఈ భాగం సంగారెడ్డి, నర్సాపూర్, తూప్రాన్, గజ్వేల్, యాదాద్రి, ప్రజ్ఞాపూర్, భువనగిరి, చౌటుప్పల్ తదితర పట్టణాలమీదుగా సాగుతుంది. 182 కి.మీ. పొడవైన దక్షిణ భాగాన్ని రూ.6480 కోట్లతో నిర్మించనున్నారు. ఇది చౌటుప్పల్, ఇబ్రహీంపట్నం, కందుకూరు, ఆమన్‌గల్, చేవెళ్ల, శంకర్పల్లి, సంగారెడ్డి తదితర పట్టణాల మీదుగా సాగుతుంది.