Sangareddy | సంగారెడ్డి జిల్లాలో విషాదం నెలకొంది. మహబూబ్‌సాగర్ చెరువు కట్ట వద్ద ఓ కానిస్టేబుల్ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆన్లైన్ గేమ్స్‌కు బానిసై, భారీగా డబ్బులు పోగొట్టుకోవడంతోనే కానిస్టేబుల్ బలవన్మరణానికి పాల్పడి ఉంటాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
నారాయణఖేడ్ నియోజకవర్గం కల్హేర్‌కు చెందిన సందీప్ ఏడాదిగా సంగారెడ్డి టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఏఆర్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఇవాళ మహబూబ్ సాగర్ చెరువుకట్టపైకి వెళ్లిన సందీప్.. తన దగ్గర ఉన్న తుపాకీతో కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలను సేకరించారు. సందీప్ ఆత్మహత్యకు గల కారణాలపై విచారణ చేపట్టనున్నట్లు ఎస్పీ పరితోష్ పంకజ్ తెలిపారు. అయితే ఆన్లైన్ గేమ్స్‌లో భారీగా డబ్బులు పోగొట్టుకోవడంతోనే ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని భావిస్తున్నారు.