Supreme Court | ఢిల్లీ-నేషనల్ క్యాపిటల్ రీజియన్‌లో వాయు కాలుష్యంపై సుప్రీంకోర్టు సోమవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా అఫిడవిట్ దాఖలు చేయాలని కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ (CAQM)ని ఆదేశించింది. కాలుష్యాన్ని అరికట్టేందుకు ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకున్నారని కమిషన్‌ను ప్రశ్నించింది. పరిస్థితి మరింత దిగజారినప్పుడు మాత్రమే అధికారులు చర్యలు తీసుకోకూడదని.. అంతకు ముందు సిద్ధం కావాలని సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కే వినోద్ చంద్రన్‌లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. విచారణ సందర్భంగా కోర్టుకు అమికస్ క్యూరీగా సహాయం చేస్తున్న సీనియర్ న్యాయవాది అపరాజిత సింగ్ దీపావళి తర్వాత ఢిల్లీలోని అనేక వాయు నాణ్యత పర్యవేక్షణ కేంద్రాలు పని చేయడం లేదంటూ కోర్టుకు తెలిపారు.
37 స్టేషన్లలో తొమ్మిది మాత్రమే నిరంతరాయంగా పని చేస్తున్నాయని.. ఈ కేంద్రాలు సరిగా పని చేయకపోతే గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (GRAP)ను ఎప్పుడు అమలు చేయాలో నిర్ణయించడం కష్టమవుతుందని అపరాజిత సింగ్ తెలిపారు. పరిస్థితి క్లిష్ట స్థాయికి చేరుకోకుండా నిరోధానికి కమిషన్ ఏం చర్యలు తీసుకుందో చెప్పాలని.. ఇప్పటికే తీసుకున్న, ప్రతిపాదిన చర్యలను వివరించే వివరణాత్మక అఫిడవిట్‌ను దాఖలు చేయాలని కమిషన్‌ను ఆదేశించింది. ఏజెన్సీలు ‘ప్రతిస్పందించడానికి బదులు’గా.. ‘ముందుగానే సిద్ధం’ కావాలని స్పష్టం చేసింది. కాలుష్య డేటాను పర్యవేక్షించే బాధ్యత కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డుదేనని కమిషన్ తరఫున న్యాయవాది వాదనలు వినిపించారు. అన్ని ఏజెన్సీలు త్వరలో తమ నివేదికలను సమర్పిస్తాయని అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటి కోర్టుకు హామీ ఇచ్చారు.
కాలుష్యం పెరిగినప్పుడు ఏజెన్సీలు చర్యలు తీసుకోవడమే కాకుండా.. దాన్ని నివారించడానికి సకాలంలో చర్యలు తీసుకోవాలని గతంలో ఆదేశించినట్లుగా కోర్టు గుర్తు చేసింది. అయితే, అక్టోబర్ 15న దీపావళి సందర్భంగా ఢిల్లీ ఎన్సీఆర్లో పరిమిత స్థాయిలో గ్రీన్ క్రాకర్స్ అమ్మకాలు, వినియోగానికి సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. సాంప్రదాయ ఉత్సవాలు, పర్యావరణ సమస్యల మధ్య సమతుల్యత అవసరమని కోర్టు పేర్కొంది. గ్రీన్ క్రాకర్స్ అక్టోబర్ 18 నుంచి 20 మధ్య మాత్రమే విక్రయించవచ్చని.. నిర్దిష్ట సమయాల్లో మాత్రమే కాల్చేందుకు అనుమతి ఇచ్చింది. ఈ మినహాయింపును టెస్ట్ కేసు ప్రాతిపదికన ఇస్తున్నట్లు కోర్టు పేర్కొంది. అలాగే, అక్టోబర్ 14 నుంచి 25 వరకు గాలి నాణ్యతను పర్యవేక్షించి.. రోజువారీ నివేదికలను సమర్పించాలని కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు, రాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డులను కోర్టు ఆదేశించింది.